
జమ్మూ: ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై పలువురు కశ్మీరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో మళ్లీ హింస రాజుకుంటుందని భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం తాజా నిర్ణయం కారణంగా ముస్లిం మెజారిటీ గుర్తింపులను రాష్ట్రం కోల్పోతుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొందరు స్థానికులు మాత్రం ఇందుకు కశ్మీర్ ప్రాంతీయ పార్టీలను తప్పుపడుతున్నారు. ఈ విషయమై శ్రీనగర్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ షా మాట్లాడుతూ..‘కేంద్రం నిర్ణయంతో మేం షాక్‌కు గురయ్యాం. కేంద్ర ప్రభుత్వాలతో గత 70 ఏళ్లుగా చేతులు కలుపుతున్న కశ్మీరీ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని ఎముకలగూడులా మార్చేశాయి. కేంద్రం తాజా నిర్ణయం వల్లే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశముంది’అని హెచ్చరించారు.
ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది..
కేంద్ర ప్రభుత్వం తమను ఇంకెంతకాలం గృహనిర్బంధంలో ఉంచుతుందని కశ్మీరీ యువకుడు అర్షద్ వార్సీ(20) ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దుచేయడం అంటే తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చేందుకు వీల్లేనట్లు కాదని స్పష్టం చేశారు. మరో మహిళా టీచర్ మాట్లాడుతూ..‘ఈ దుస్థితికి జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలే కారణం. ఆర్టికల్ 370 రద్దుతో మా గుర్తింపును కోల్పోయినట్లైంది’అని చెప్పారు.
కశ్మీరీ పండిట్ల సమస్య అదే..
ఇక ఫాతిమా బానో అనే మహిళా ఎంట్రప్రెన్యూర్ కూడా తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేవలం ఆర్టికల్ 370 రద్దుతో దశాబ్దాలుగా కశ్మీర్‌లో కొనసాగుతున్న అశాంతి, హింస సమసిపోతుందా? అలా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. కశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు తిరిగొచ్చేందుకు ఆర్టికల్ 370, ఆర్టికల్–35ఏ అన్నవి అసలు అడ్డంకే కాదు. పండిట్లు తిరిగిరావడానికి శాంతిభద్రతల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment