
‘370’పై ముదురుతున్న వివాదం
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై వివాదం ముదురుతోంది. దాని రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరెవరితో చర్చలు జరుపుతోందో చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
* కేంద్రంపై మండిపడ్డ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్
* రాజ్యాంగ పరిషత్‌ను పునరుద్ధరించాకే నిర్ణయం తీసుకోవాలి
* జమ్మూ కాశ్మీర్ ఒమర్ అబ్బ సొత్తేం కాదు: ఆరెస్సెస్
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై వివాదం ముదురుతోంది. దాని రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరెవరితో చర్చలు జరుపుతోందో చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కాశ్మీర్‌ను భారత్‌లో భాగం చేసిన రాజ్యాంగ పరిషత్‌ను పునరుద్ధరించేదాకా 370ని రద్దు చేయడానికి వీలు లేదని, ఆ పరిషత్‌లో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతకూ దాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. 370 రద్దుపై చర్చల ప్రక్రియ మొదలైందన్న పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై వివాదం రేగడం తెలిసిందే. శ్రీనగర్‌లో బుధవారం సమావేశమైన నేషనల్ కాన్ఫరెన్స్ కోర్ గ్రూప్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అవి కాశ్మీర్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయంది. 370 విషయంలో బీజేపీ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఒమర్ మండిపడ్డారు. ‘పాక్ వైపున్న కాశ్మీర్ కూడా మనదేనంటున్న బీజేపీ వాదనను కూడా పరిగణనలోకి తీసుకుంటే కొత్త రాజ్యాంగ పరిషత్‌తో పాక్‌వైపున్న కాశ్మీర్ నుంచీ సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది. కనుక 370 రద్దు ఎన్డీఏ సర్కారుకు ఆసాధ్యం. భాగస్వామ్య పక్షాలతో చర్చలు ప్రారంభించినట్లు జితేంద్ర చెప్పారు. వారెవరు? సీఎంగా నేనూ ఇందులో భాగస్వామినే. మా పార్టీ వాళ్లు మాట్లాడలేదు. ఇతర పార్టీలూ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
మరి మీరెవరితో మాట్లాడారు?’ అని ప్రశ్నించారు. మరోవైపు.. ‘370 రద్దయితే కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉండద’న్న ఒమర్ వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్ తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్ ఆయన అబ్బ సొత్తేం కాదని, 370 ఉన్నా లేకున్నా ఆ రాష్ర్టం భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని సంఘ్ నేత రామ్‌మాధవ్ అన్నారు. 370ని తొలగించబోమని మోడీ హామీ ఇవ్వాలని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిషత్ అనుమతి లేకుండా ఈ ఆర్టికల్‌ను రద్దు చేయొద్దని రాజ్యాంగంలో ఉందని, త్వరలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. 370 కాశ్మీర్‌ను భారత్‌తో కలిపి ఉంచే జీవన రేఖ వంటిదని సీపీఐ పేర్కొంది. ఈ అం శంలో ఇదివరకు పాటించిన ప్రమాణాలకు వ్యతిరేకంగా నిర్ణ యం తీసుకోవద్దని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ అన్నారు.
ఏమిటీ ఆర్టికల్ 370?
1947లో స్వతంత్ర సంస్థానంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసినప్పుడు, ఒప్పందం మేరకు కేంద్రం ఆర్టికల్ 370ని రూపొందించింది. భారత రాజ్యాంగం ప్రకారం.. 370వ అధికరణ జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే ‘తాత్కాలిక నిబంధన’. రాజ్యాంగంలో ఇతర రాష్ట్రాలన్నిటికీ వర్తించే అధికరణలన్నీ జమ్మూకాశ్మీర్‌కు వర్తించవని ఈ అధికరణ స్పష్టంచేస్తోంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. భారత పార్లమెంటు చేసే ఏ చట్టాలనైనా జమ్మూకాశ్మీర్‌కు వర్తింపచేయాలంటే.. అందుకు పార్లమెంటు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదాన్ని తీసుకోవాలి. అందుకే మిగతా భారతదేశంతో పోలిస్తే ఈ రాష్ట్రంలో పౌరులకు పౌరసత్వం, ఆస్తిపై యాజమాన్యం, ప్రాథమిక హక్కులు వంటి వాటితో సహా ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఇతర ప్రాంతాలకు చెందిన భారతీయులు కాశ్మీర్‌లో ఆస్తులు కొనజాలరు.