కశ్మీర్‌ ఓ నివురుగప్పిన నిప్పు | One year completed on demolition of article 370 and kashmir separation | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ ఓ నివురుగప్పిన నిప్పు

Published Thu, Aug 6 2020 3:41 AM | Last Updated on Thu, Aug 6 2020 3:41 AM

One year completed on demolition of article 370 and kashmir separation - Sakshi

దేశంలోనే ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కశ్మీర్‌ ఇప్పుడు ఉనికిలోనే లేకుండా పోయింది. భారత రాజకీయ భౌగోళిక ఉనికిలో కశ్మీర్‌ మటుమాయమైపోయింది. దాని రాజ్యాంగపరమైన, శాసస సంబంధమైన నిర్మాణం రద్దయిపోయింది. బీజేపీ కశ్మీర్‌ని ఎంతో చాతుర్యంగా భారతదేశ ముస్లిం సమస్యగా మార్చిపడేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్‌ తన మైనారిటీలను అణిచివేస్తోందన్న అభిప్రాయం తక్కిన ప్రపంచ దేశాలలో పెరుగుతూ వస్తోందంటే ఆశ్చర్యపడనక్కర లేదు. ఇస్లామిక్‌ దేశాల్లోని ప్రజాభిప్రాయం గత ఆరునెలలుగా భారత్‌కు వ్యతిరేకంగా బలపడుతోంది. పలు కారణాలతో భారత్‌ పట్ల అంతర్జాతీయ సమాజానికి ఉన్న సదభిప్రాయం, సమీప భవిష్యత్తులో పరీక్షకు నిలబడవచ్చు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్రప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించేసింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి ముందు, ఆ తరువాత కశ్మీర్‌ ఎలా కనిపిస్తోంది అనే అంశంపై చర్చ జరగాల్సి ఉంది. అక్టోబర్‌ విప్లవానికి ముందు ‘మనం ఇప్పుడు విజయం సాధించకపోతే ఏం జరుగుతుంది’ అని విప్లవనేత లెనిన్‌.. ట్రాట్సీ్కని అడిగాడు. అప్పుడు ట్రాట్సీ్క ‘మనం విజయం సాధిస్తే ఏం జరుగుతుంది’ అని ఎదురు ప్రశ్నించాడు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ లెనిన్‌ అడిగిన ఆ ప్రశ్ననే అడగవలసి ఉండగా, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పాలకపార్టీలో ఎవరూ కూడా.. 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి ముందు, ఆనాడు ట్రాట్సీ్క వేసిన ప్రశ్నకైనా జవాబు ఇచ్చుకోలేకపోయారు.

365 రోజులు గడిచిపోయాయి. కశ్మీర్‌ లోయ దాదాపు 300 రోజులపాటు మూసివేతకు గురై ఉండిపోయింది. ఈ సంవత్సరం జనవరి వరకు రాజకీయంగా స్తంభించిపోయింది, మార్చి నెల తర్వాత కరోనా లాక్‌డౌన్‌లో స్తంభించిపోయింది. సమాచార నియంత్రణ ఎంత కఠినంగా ఉండిందంటే, స్థానిక పత్రికలు ఉదయం తుడుచుకోవడానికి తప్ప చదవడానికి పనికివచ్చేవి కావు. ఎలాంటి లబ్ధిదారులూ, స్థానిక రాజకీయ జోక్యం లేక ప్రజల భాగస్వామ్యం అనేదే  లేకుండా పాలనను నిరంకుశోద్యోగులు చేజిక్కించుకోవడం అనేది కశ్మీర్‌ని 1931 కాలం ముందునాటికి తీసుకెళ్లిపోయింది. కశ్మీర్‌ ప్రజల దృష్టిలో 2019 అనేది 1990ల నాటి మిలిటెన్సీ పతాక దశలో ఉన్నప్పటికంటే ఘోరంగా తయారైపోయింది. అయితే ఈసారి భౌతిక హింస కంటే ఎక్కువగా, తీవ్రమైన అవమానం, బెదిరింపులతో కూడిన మానసిక హింసకు కశ్మీరీలు గురయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే శరీరానికి, మనిషి అస్తిత్వానికి శారీరకంగా తగిలిన దెబ్బకు సరిసమానంగా కశ్మీరీల మనస్సులు తీవ్రంగా దెబ్బతినిపోయాయి.

ప్రామాణికంగా చెప్పుకునే ‘బలహీనుల ఆయుధం’ అనేది కశ్మీర్‌లో శారీరక హింసా సాధనంగా మారిపోయింది. అక్కడ జీవితం నరకంగా మారింది. గాలి బలంగా వీస్తోంది.. కానీ ఊపిరాడటం లేదు అనే మాట కశ్మీరీలందరి ఉమ్మడి వ్యక్తీకరణగా మారిపోయింది. ఇప్పటికే స్వీయాత్మక, ప్రతీకాత్మక హింసారూపాలతో రాజకీయంగా చిక్కుకుపోయిన ఒక సమాజానికి, ఈ మానసిక పాశవికీకరణ అతిపెద్ద నష్టం కలిగించింది. మానవ శాస్త్రవేత్త వీణా దాస్‌ మాటల్లో చెప్పాలంటే, ఇవి మనిషికి, సమాజానికి, జాతికి సంబంధించిన అనుభవాలుగా మారిపోయాయి. ఇప్పుడు సందేశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్‌ ఒక రాజకీయ సమస్యగా, అంతర్గత భద్రతా సమస్యగా, అంతర్జాతీయ సంక్లిష్టతల మధ్య ద్వైపాక్షిక సమస్యగా ఉండేది. ఈరోజు అది మతతత్వంతో కూడిన హిందూ–ముస్లిం సమస్యగా, కనీసం మూడు సౌర్వభౌమాధికార దేశాలతో అంతర్గత, బాహ్య భద్రతా సమస్యగా మారిపోయింది. అందుచేత, విస్తృతమైన రాజకీయ ప్రయత్నంతో, చాతుర్యంతో బీజేపీ కశ్మీర్‌ని.. భారతదేశ ముస్లిం సమస్యగా మార్చిపడేసింది. 1989లో కశ్మీర్‌ పండిట్లు లోయను వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కూడా కశ్మీర్‌ ఒక ముస్లిం సమస్యగా ఉండేది కాదు. 

కశ్మీర్‌ జాతీయవాద పరిణామంలో, సంవత్సరాలుగా సాగిన ఘర్షణ కాలంలో మతపరమైన బాష్యం అనేది ముఖ్యమైన పాత్ర పోషించిందంటే తోసిపుచ్చలేం.. కానీ ఇది ఇటీవలి కాలం వరకు రాజ కీయాల్లో, రాజకీయ పోరాటాల్లో వ్యక్తం కాలేదు. కశ్మీర్‌ని ముస్లిం సమస్యగా ముద్రించడం ద్వారా కశ్మీర్‌లో జాతిపరమైన ఉనికిపై మతపరమైన ఉనికి ఆధిక్యత సాధించేసింది. రెండు రాజ్యాంగాల కింద ప్రజలు, వారి హక్కులకు సంబంధించిన సామాజిక ఒడంబడికగా ఇంతవరకు కనిపిస్తూ వచ్చిన  కశ్మీర్‌ సమస్య ఇప్పుడు పరస్పరం తలపడుతున్న మత విశ్వాసాలు కలిగిన బృందాల సమస్యగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు మాత్రమే వర్తించే విశిష్ట లక్షణాలను నిర్మూలించివేస్తూ లోయలో ప్రస్తుతం శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జనాభాపరంగా మెజారిటీగా ఉన్న వారిని రాజ కీయపరమైన మైనారిటీగా మార్చివేస్తున్నారు. ఇది ప్రాతినిధ్య అధికారం నుంచి వీరిని వేరు చేస్తుంది. ఇక తతిమ్మా జరగాల్సింది దానికదేగా జరిగిపోతుంది.

భారతీయ ముస్లింలను వేరుపర్చడం అనే తిరస్కరించలేని ప్రక్రియ ప్రత్యక్ష పర్యవసానాల్లో భాగంగా తక్కిన భారతదేశం ముస్లిం సమస్యను చూస్తున్నప్పుడు కశ్మీర్‌లో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ముస్లింలపై, ఇతర మతపరమైన మైనారిటీలపై ప్రత్యక్ష దాడులు చేయడానికి అదనంగా వారిని వేరుచేయడం అనేది హిందువుల రాజకీయ స్థానికీకరణను ప్రతిబింబిస్తోంది. ఇదంతా భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా తోసిపుచ్చుతూ మన గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని మెజారిటీవాద ప్రజాస్వామ్యంగా మార్చివేస్తున్నారు. అంతర్జాతీయంగా, ఈ పరిణామాలన్నీ కశ్మీర్‌ పట్ల, కశ్మీర్‌ గురించి ఏర్పడుతూ వచ్చిన దృక్పథాన్ని మౌలికంగానే మార్చివేశాయి. ఇంతవరకు జాతీయంగా, అంతర్జాతీయంగా కశ్మీర్లో ఏ చర్య తీసుకున్నా భారత ప్రాదేశిక సమగ్రతను సవాలు చేస్తున్న శక్తుల పట్ల ప్రతిచర్యగా దాన్ని సమర్థిస్తూ వచ్చేవారు. అంతర్జాతీయ సమాజం భారత ప్రభుత్వ చర్యను వ్యతిరేకించేది కానీ మానవ హక్కుల ఉల్లంఘనపై ఖండనగా మాత్రమే అది పరిమితమయ్యేది.

దశాబ్దాలుగా నిరసనలు తెలిపే ప్రాంతంగా పేరొందిన తహ్రిర్‌ స్క్వేర్‌లాగా లాల్‌ చౌక్‌ ఒక ఐకానిక్‌ ప్రాంతంగా ఎన్నడూ కాలేకపోయింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ వ్యూహపరంగా, దౌత్యపరంగా చేస్తూ వచ్చిన ప్రయత్నమే దానికి కారణం. కశ్మీర్‌లో కొనసాగుతున్న సాయుధ తీవ్రవాదానికి అంతర్జాతీయ దౌత్య చర్చల్లో ఎన్నడూ రాజకీయ మద్దతు లభించేది కాదు. తాలిబన్‌ తదనంతర శకంలో సాయుధ తీవ్రవాదం పట్ల సహన భావం చాలా వరకు తగ్గిపోయింది. ఇస్లామిక్‌ దేశాల సంస్థ వంటి వేదికల్లో భారత్‌పై మృదువిమర్శ చేసేవారు కానీ భారత్‌ కశ్మీర్‌ విషయంలో తీవ్రమైన వ్యతిరేకతను అరుదుగా మాత్రమే చవిచూడగలిగింది. 

ఇప్పుడు పునర్నిర్వచించబడుతున్న భారత్‌.. అంటే మైనారిటీలను, ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్న భారత్‌గా, పౌరులకు జాతీయ రిజిస్టర్, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొస్తున్న భారత్‌గా, మతపరమైన దాడులపట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం పాటిస్తున్న భారత్‌ అనే అర్థం చేసుకోవలసివస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలోనే ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కశ్మీర్‌ ఇప్పుడు ఉనికిలోనే లేకుండా పోయింది. భారత రాజకీయ భౌగోళిక ఉనికిలో కశ్మీర్‌ మటుమాయమైపోయింది. దాని రాజ్యాంగపరమైన నిర్మాణం కానీ, దానితో ముడిపడివున్న శాసన సంబంధమైన నిర్మాణం కానీ రద్దయిపోయాయి. ఈ ప్రతీకాత్మక హింసా చర్య కశ్మీర్‌ లోని ముస్లిం మెజారిటీనీ వ్యవస్థాపరంగానే పతనమొందించి, వారిని అధికారం నుంచి తప్పించడంలో భాగంగానే జరుగుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్‌ తన మైనారిటీలను అణిచివేస్తోందన్న అభిప్రాయం తక్కిన ప్రపంచ దేశాలలో పెరుగుతూ వస్తోం దంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇస్లామిక్‌ దేశాల్లోని ప్రజాభిప్రాయం గత ఆరునెలలుగా భారత్‌కు వ్యతిరేకంగా బలపడుతోంది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి కీలకమైన ఇస్లామిక్‌ దేశాల  ప్రభుత్వాలు ఇప్పటికైతే∙వ్యతిరేకించడం లేదు కానీ టర్కీ, మలేసియాలు మునుపటికన్నా భారత్‌ వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నాయి. బహుశా మొట్టమొదటిసారిగా పాక్‌ ఈ విషయంలో విజయవంతమవుతోందని చెప్పవచ్చు. అప్గాన్‌ ఒప్పందం తర్వాత అమెరికా కూడా ఈ పరిణామానికి మరింత ఎక్కువగా దోహదపడుతోంది. కశ్మీర్‌ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడానికి ప్రత్యక్ష స్పందనగానే చైనా బలగాలు సరిహద్దుల్లో మోహరించి ప్రమాద సంకేతాలు పంపుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్‌ పట్ల అంతర్జాతీయ సమాజం కలిగి ఉంటున్న సదభిప్రాయం, ప్రత్యేకించి ఉదారవాద రాజకీయ శక్తుల అభిప్రాయం సమీప భవిష్యత్తులో పరీక్షకు నిలబడవచ్చు. కొసమెరుపు: చాలా ఏళ్ల క్రితం కశ్మీర్‌ లోయలో ఒక గ్రామంలోని సెక్యూరిటీ బంకర్‌ గోడపై కాస్త సన్న అక్షరాలతో ఇలా రాశారు. ‘ఇక్కడకు వచ్చింది కశ్మీరీల హృదయాలను, మనస్సును గెల్చుకోవడానికే’. దాని కిందే మరింత ముద్దక్షరాలతో కింద రాశారు. ‘వాళ్ల జుత్తు పట్టుకుని ఈడ్చితే చాలు.. హృదయాలు, మనస్సులు వాటికివే అనుసరి స్తాయి’. విసిగిపోయిన సైనికాధికారి ఎవరో ఇలా రాసినట్లుంది. వెనక్కు వెళ్లి చూస్తే 20 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో పరిస్థితి ఇలాగే ఉండేది.

(ది వైర్‌ సౌజన్యంతో)
వ్యాసకర్త ఆర్థికవేత్త, జమ్మూ కశ్మీర్‌ మాజీ మంత్రి}
హసీబ్‌ డ్రాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement