కార్యకలాపాలు లేక వెలవెలబోయిన కశ్మీర్ హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ‘ప్రజా భద్రతా చట్టం’ కింద అరెస్టయిన వేలాది మంది యువకులు గత నెల పదిహేను రోజులుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. రాష్ట్రంలోని జైళ్లు సరిపోకపోవడంతో వేలాది మందిని ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు కూడా తరలించిన విషయం తెల్సిందే. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఊచలు లెక్క పెడుతున్నారు. వారు తమ ఆరెస్టులను సవాల్ చేసేందుకు కోర్టులకు వెళ్లే ఆస్కారం కూడా లేకుండా పోయింది. కోర్టుల తలుపులు ఇప్పటికీ తెరచుకోవడం లేదు. ఇదేమిటిని ప్రశ్నించేందుకు న్యాయవాదులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. వారిలో ఎక్కువ మంది కటకటాల వెనెక్కే వెళ్లారు.
ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉన్న హైకోర్టుకు వెళ్లే దారి
కశ్మీర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మియాన్ అబ్దుల్ ఖయ్యూంను అరెస్ట్ చేసి ఆగ్రా జైల్లో నిర్బంధించగా, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ రోంగాను అరెస్ట్ చేసి మొరదాబా జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత బారముల్లా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ సలాం రాథర్‌ను అరెస్ట్ చేసి యూపీ జైల్లో నిర్బంధించారు. అందుబాటులో లేకుండా పోయిన అనంతనాగ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయద్ సోదాగర్ జాడ కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది మొహమ్మద్ యూసుఫ్ భట్, ఆయన కుమారుడు, న్యాయవాది జుబేర్ అహ్మద్ భట్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారని సోఫియన్ జిల్లా కోర్టు న్యాయవాదులు తెలిపారు.
హైకోర్టు ఆవరణలో అతికించిన నోటీసు
వారందరిని రెండేళ్లపాటు ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించేందుకు అవకాశం ఉన్న కశ్మీర్‌కు మాత్రమే పరిమితమైన ‘ప్రజా భద్రతా చట్టం’ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత మంది న్యాయవాదులను అరెస్ట్ చేయడమే కాకుండా వారు విధులు నిర్వర్తించడానికి వీల్లేకుండా కోర్టుల తలుపులకు తాళాలు వేసి ఉంచడం పట్ల కశ్మీర్ బార్ అసోసియేషన్‌కు చెందిన 1,050 మంది న్యాయవాదులు ఇటీవల సమావేశమై అరెస్టయిన న్యాయవాదులే తరఫునే కాకుండా అదశ్యమైన యువకుల తరఫున ‘హబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏడుగురు న్యాయవాదులను నియమించారు.
కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా ఢిల్లీలో విద్యార్థుల నిరసన
శ్రీనగర్‌లోని కశ్మీర్ హైకోర్టు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని, ఈ విషయంలో అవసరమైతే తానే స్వయంగా శ్రీనగర్‌కు వెళతానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోర్టులన్నీ యథావిధిగా పనిచేసేందుకు తమ అధికార యంత్రాంగం తప్పకుండా సహకరిస్తుందని, హైకోర్టుతోపాటు దిగువ కోర్టులు కూడా సజావుగానే పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ప్రకటించారు. ఇప్పటికీ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించలేదని, ప్రభుత్వ రవాణా సర్వీసులేవీ నడవడం లేదని, కొన్ని చోట్ల కోర్టుల తలుపులు తెరస్తున్నప్పటికీ సిబ్బందిగానీ, జడ్జీలుగానీ, న్యాయవాదులుగానీ రావడం లేదని కశ్మీర్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దాదాపు సగం న్యాయవాదులు జైళ్లలో మగ్గుతుంటే ఇంకా ఎవరు వచ్చి విధులు నిర్వర్తిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీలకు బంగారు భవిష్యత్తు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నేపథ్యంలో ఈ నిర్బంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment