కౌంటింగ్‌లో ఫారం–17సీ కీలకం | Form-17(c) Plays Key Role In Election Counting In AP Elections 2019 | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో ఫారం–17సీ కీలకం

Published Sat, May 18 2019 8:28 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Form-17 Plays Key Role In Election Counting In AP Elections 2019 - Sakshi

సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో ఫారం–17సి పార్ట్‌–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్‌ ఏజెంట్, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి.పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గ  నెంబరు, పోలింగ్‌ కేంద్రం పేరు, ఆ పోలింగ్‌ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెటింగ్‌ యూనిట్ల ఐడెంటిఫికేషన్‌ నెంబర్లను ఫారం–17సిలో నమోదు చేస్తారు.

ఆ పోలింగ్‌ కేంద్ర పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏలో నమోదు చేసిన వివరాలు), పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయకుండా నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటేసేందుకు పీఓ అనుమతించని వారి సంఖ్య, ఓటింగ్‌ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. అలాగే టెండర్డ్‌ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపరు సీళ్ల సీరియల్‌ నెంబర్లు, ఎన్ని పేపర్‌ సీళ్లు వినియోగించారు? వినియోగించని పేపరు సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్‌ అధికారికి వెళ్లాయి? డ్యామేజ్‌ అయిన పేపరు సీళ్ల సీరియల్‌ నెంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్‌లో ఫారం–17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది.

నమోదైన ఓట్లలో తేడా వస్తే..?!
కౌంటింగ్‌ సమయంలో టేబుల్‌ వద్దకు కంట్రోల్‌ యూనిట్‌తోపాటు ఫారం–17సీ పార్ట్‌–1 తప్పనిసరిగా తీసుకు వస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లంతా ఫారం–17సిలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్‌ యూనిట్‌ డిస్‌ప్లే సెక్షన్‌లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్‌ తప్పిదం, మరే కారణం వల్లగానీ కంట్రోల్‌ యూనిట్, ఫారం–17సి ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్‌ యూనిట్లు ప్రక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్‌ యూనిట్‌ ఏ పోలింగ్‌ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్దారించుకోవాలి.

ట్యాంపరింగ్‌ జరిగితే...
కంట్రోల్‌ యూనిట్‌ టేబుల్‌పైకి రాగానే క్యాం డిడేట్‌ సెక్షన్‌ సీలింగ్‌ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్‌ ఏజెంట్లు, సూపర్‌వైజర్లు చూసుకోవాలి. రిజల్ట్‌ సెక్షన్‌పై ఉన్న స్ట్రిప్ట్‌ సీలు, గ్రీన్‌ పేపరు సీలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్‌ నెంబర్లు ఫారం–17సిలో నమోదు చేసినవే ఉండాలి.కంట్రోల్‌ యూనిట్, పేపరు సీళ్లు, అడ్రస్‌ ట్యాగులు ట్యాంపరింగ్‌ జరిగాయని గుర్తిస్తే సూపర్‌వైజర్లు ఆ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకు వెళ్లాలి. ట్యాంపరింగ్‌ జరగని సీయూలను మాత్రమే కౌంటింగ్‌ నిర్వహించాలి.

ర్యాండమ్‌గా కౌంటింగ్‌
కౌంటింగ్‌ ఒక రౌండ్‌ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్‌ యూనిట్లను జనరల్‌ అబ్జర్వర్‌ తన టేబుల్‌ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌తో ఓట్ల లెక్కింపు చేయిస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు, ఫారం–17సీ పార్ట్‌–2లో కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ  ఏదైనా తేడా వస్తే సూపర్‌వైజర్‌ను కౌంటింగ్‌ నుంచి తప్పిస్తారు. ఆ సూపర్‌వైజర్‌ తనిఖీ చేసిన మిగతా కంట్రోల్‌ యూనిట్లలన్నింటినీ జనరల్‌ అబ్జర్వర్‌ మరోసారి లెక్కింపజేస్తారు. వివరాలు తప్పులు నమోదు చేసిన కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్‌లో ఓట్లు సమానంగా వస్తే ఏం చేయాలనే సందేహం రావడం సహజం. అలాంటి సందర్బం ఎదురైనపుడు ప్రజాప్రతినిద్య చట్టం ప్రకారం రిటర్నింగ్‌ అధికారి లాటరీ ద్వారా ఫలితాలను ప్రకటిస్తారు. లాటరీలో ఎవరు గెలుపొందితే వారిని విజేతగా ప్రకటిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement