సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగగా మే 23న కౌంటింగ్ జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా పోలింగ్, కౌంటింగ్‌కు మధ్య 41 రోజుల సుదీర్ఘ గడువు వచ్చింది. దీంతో అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై అంచనా లెక్కలతో తలమునకలుగా ఉండి పోయారు. అభ్యర్థుల గెలుపుపై పెద్ద ఎత్తున పందేలు నడిచాయి. గెలుపు మాదంటే మాదంటూ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎడతెగని లెక్కలతో గడుపుతున్నారు. సొంతంగా కొందరు సర్వేలు చేయించుకుంటుండగా ప్రధాన పార్టీలు సైతం నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించాయి. ఇక రాష్ట్ర, కేంద్ర నిఘా విభాగాల సర్వేలపై అభ్యర్థులు ఆరా తీస్తూ లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా సగం స్థానాలు మావేనంటూ టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. అభ్యర్థుల వారీ మెజార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కనున్నాయన్న దానిపైనా పందేలు చర్చలు నడుస్తున్నాయి. సుదీర్ఘ సమయం అనంతరం ఎట్టకేలకు కౌంటింగ్‌కు సమయం
ఆసన్నమైంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువుంది. ఈనెల 23న ఒంగోలు శివారులోని రైజ్, పేస్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు జిల్లా పరిధిలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులకు శిక్షణ సైతం ముగిసింది. ఇక ఎన్నికల్లో పోటీ పడిన ప్రధాన పార్టీలతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ సైతం ముగిసింది. కౌంటింగ్ దగ్గర పడడంతో అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ ఉత్కంఠ పెరిగింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన 155 మంది అభ్యర్థులు పోటీ పడగా ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పోటీ ఉంది. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో 22,62,249 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుక్నునారు. జిల్లా వ్యాప్తంగా 85.92 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు సైతం గణనీయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 13,24,075 మహిళా ఓట్లకు గాను 11,34,761 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment