ఇప్పుడు వాడబోయే వీవీ ప్యాట్, గతంలో వాడిన బ్యాలెట్ పేపర్
విజయనగరం మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానం మార్పులు సంతరించుకుంటోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడగా 1951లో దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో బ్యాలెట్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఈ విధానంలో బ్యాలెట్ పేపర్‌పై ఓటర్ నచ్చిన అభ్యర్థికి ముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతను ప్రకటించేవారు. 2004 వరకు ఇదే విధానం కొనసాగగా 2004 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) అందుబాటులోకి వచ్చాయి. ఈవీఎం వినియోగంపై ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం పారదర్శకత కోసం వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్)ను ప్రవేశపెట్టింది. ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ను వినియోగించనున్నారు. ఈ విధానంలో మీరు ఎవరికి ఓటు వేశారో మీరు ధ్రువీకరించుకునే సదుపాయం కల్పించారు.
వీవీ ప్యాట్ అంటే..
ఇటీవల తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం వీవీ ప్యాట్ ప్రత్యేకం. ఇందుకోసం వీవీ ప్యాట్ అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సరికొత్త యంత్రం ద్వారా ఎలా ఓటు వేయాలో తెలుసుకుందాం.
వీవీ ప్యాట్‌తో ఓటు వేసే విధానం
పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడ ఓటింగ్ కోసం మూడు యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ ద్వారా మనల్ని ఓటింగ్‌కు అనుమతిస్తారు. అధికారులు చెప్పిన తర్వాత మనం ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్‌లోకి వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థులకు సంబంధించిన పార్టీల గుర్తులు ఉంటాయి. మనం మొదట బ్యాలెట్ యూనిట్‌లో నచ్చిన గుర్తుకు ఓటు వేయాలి.
ఏడు సెకెన్ల పాటు కనిపించే ఓటు
ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌పై క్లిక్ చేయాలి. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేశామో.. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీ ప్యాట్ యంత్రానికి అమర్చిన అద్దం వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దానిని పరిశీలించి మనం ఎంచుకున్న అభ్యర్థికే ఓటు పడిందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ విధానంలో ఏ గుర్తుకు ఓటు వేశామో అక్కడికక్కడే కచ్చితంగా ధ్రువీకరించుకోవచ్చు.
అనుమానం వస్తే లెక్కింపు
వీవీప్యాట్‌లో కనిపించిన కాగితం ముక్క 7 సెకన్ల అనంతరం.. యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్సులోకి వెళ్లిపోతుంది. అది ఇక బయటకి రాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్టు. యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ కాగితపు ముక్కలను పరిశీలించి, లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ సరికొత్త ఓటింగ్ విధానం ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment