నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్.ముత్యాలరాజు కౌంటింగ్ సూపర్‌వైజర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాయలంలో కౌంటింగ్ సూపరవైజర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్లు లెక్కించే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఆర్‌ఓల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ తహసీల్దార్లు, కౌంటింగ్ సూపరవైజర్లు పాల్గొన్నారు.
సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణద్వివేది ఓట్ల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం సీఈఓ విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఎటువంటి అల్లర్లు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, జేసీ కె. వెట్రిసెల్వి, ఎన్నికల పరిశీలకులు, ఆర్‌ఓలు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపుపై శిక్షణ
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు జస్‌కిరణ్‌సింగ్ సూక్ష్మపరిశీలకులకు సూచించారు. మంగళవారం కస్తూర్బాకళాక్షేత్రంలో సూక్ష్మపరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకుడు మాట్లాడారు. ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అందరూ చదవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మపరిశీలకులు అభ్యర్థులను, ఏజెంట్లను పలకరించడం, విష్ చేయకూడదన్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment