Ganga raju
-
15 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తాం
పెదపాడు : రాబోయే 15 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ గంచీరి దేవికారాణి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు మాఫీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్వాక్రా గ్రూపునకు లక్ష చొప్పున ఇచ్చి వడ్డీని ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లను రూ.1,000కి పెంచుతున్నట్టు తెలిపారు. పేద విద్యార్థులంతా చదువుకుని ఉన్నతస్థితికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయాలని నిర్ణయించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అభయహస్తం, ఆమ్ఆద్మీ, జనశ్రీ బీమా యోజన స్కాలర్‌షిప్పులను నియోజకవర్గంలో 5,661మందికి అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 70 వేల 600 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేసినట్టు చెప్పారు. నరసాపురం ఎంపీ గంగరాజు మాట్లాడుతూ ఆశ్రం ఆసుపత్రిలో సేవాగుణంతోనే వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్, దెందులూరు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
మహిళను నరికి చంపిన వృద్ధుడు
జంగారెడ్డిగూడెం రూరల్ : క్షణికావేశంలో ఓ వృద్ధుడు మహిళను కత్తితో నరికి చంపిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బేతాళ సరస్వతి(45) స్థానిక ప్రధాన రోడ్డు పక్కన కిళ్లీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటి పక్కనే అదే గ్రామానికి చెందిన వీరెంకి గంగరాజు(72) భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ తరచూ ఒకరినొకరు దూషించుకుంటూ గొడవలు పడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. సరస్వతి ఇంటికి.. గంగరాజు ఇంటి ముందు మరుగ్గా ఉండే స్థలం నుంచి నడిచే దారి ఉంది. బుధవారం సరస్వతి మనవరాలు ఈ దారి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా గంగరాజు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన గంగరాజు కత్తితో సరస్వతి తల, మెడపై నరికాడు. అనంతరం కత్తితో నడుచుకుంటూ వెళ్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయూడు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుకుంటున్న సరస్వతిని బంధువులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ అంబికా ప్రసాద్, ఎస్సై శ్రీహరి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు
ఎమ్మెల్యే రాజుపై మండిపడుతున్న ఓ వర్గం సీనియర్లను విస్మరిస్తున్నారని ఆరోపణ తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థుల్లో ఆందోళన చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు బలంగా కనిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా టీడీపీకి అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పట్ల పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక విషయంలో కేఎస్ఎన్ చివరి వరకు నాటకీయతకు తెరతీయడంతో టికెట్టుపై ఆశపెట్టుకున్న అభ్యర్థుల్లో మరింత అసంతృప్తికి కారణమైంది. ముందుగా అభయం ఇచ్చిన వారికి కాకుండా చివరి నిమిషంలో మరో అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతూ వస్తున్నారు. వీరంతా అదనుకోసం చూస్తున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలోను ఇటువంటి అసంతృప్తులే అప్పటి జెడ్పీటీసీ అభ్యర్థి దాడి గంగరాజు ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. చోడవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బెన్నవోలుకు చెందిన మజ్జి గౌరీశంకర్‌కు టికెట్టు దాదాపు ఖరారయిందని భావించిన సమయంలో ఇదే టికెట్టు కోసం మండలంలోని గంధవరం మాజీ సర్పంచ్ పల్లా అర్జున యాదవ్ కూడా ఆశ పెట్టుకున్నారు. వీరితోబాటు గోవాడకు చెందిన ఏడువాక సన్యాసినాయుడు, గజపతినగరం గ్రామానికి చెందిన కనిశెట్టి సన్యాసిరావు(మత్స్యరాజు ) పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అనూహ్యంగా కనిశెట్టి మత్య్సరాజుకు టికెట్టు ఖరారు కావడంతో మిగిలిన ఆశావాహులంతా కంగుతిన్నారు. ఇంతకాలం ఎమ్మెల్యే రాజు వెంట ఉన్నప్పటికీ ధన బలం ఉన్న వారికే టికెట్టు ఇచ్చారని ఆశావహులు మధనపడుతున్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన గంటా వర్గీయులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై కూడా ఆ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గంటా వర్గీయులు జెడ్పీటీసీ, లేదా ఎంపీపీ పదవికాని తమకు కేటాయించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజు వీరిని పట్టించుకోకపోవడంతో వారంతా రాజు తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాల్లోని సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన వారినే ప్రోత్సహిస్తున్న రాజు తీరుపై సీనియర్లు అక్కసుతో ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలా రాజుపై ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థులు మధనపడుతున్నారు.