- ఎమ్మెల్యే రాజుపై మండిపడుతున్న ఓ వర్గం
- సీనియర్లను విస్మరిస్తున్నారని ఆరోపణ
- తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థుల్లో ఆందోళన
చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు బలంగా కనిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా టీడీపీకి అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పట్ల పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక విషయంలో కేఎస్‌ఎన్ చివరి వరకు నాటకీయతకు తెరతీయడంతో టికెట్టుపై ఆశపెట్టుకున్న అభ్యర్థుల్లో మరింత అసంతృప్తికి కారణమైంది. ముందుగా అభయం ఇచ్చిన వారికి కాకుండా చివరి నిమిషంలో మరో అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతూ వస్తున్నారు.
వీరంతా అదనుకోసం చూస్తున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలోను ఇటువంటి అసంతృప్తులే అప్పటి జెడ్పీటీసీ అభ్యర్థి దాడి గంగరాజు ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. చోడవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బెన్నవోలుకు చెందిన మజ్జి గౌరీశంకర్‌కు టికెట్టు దాదాపు ఖరారయిందని భావించిన సమయంలో ఇదే టికెట్టు కోసం మండలంలోని గంధవరం మాజీ సర్పంచ్ పల్లా అర్జున యాదవ్ కూడా ఆశ పెట్టుకున్నారు.
వీరితోబాటు గోవాడకు చెందిన ఏడువాక సన్యాసినాయుడు, గజపతినగరం గ్రామానికి చెందిన కనిశెట్టి సన్యాసిరావు(మత్స్యరాజు ) పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అనూహ్యంగా కనిశెట్టి మత్య్సరాజుకు టికెట్టు ఖరారు కావడంతో మిగిలిన ఆశావాహులంతా కంగుతిన్నారు. ఇంతకాలం ఎమ్మెల్యే రాజు వెంట ఉన్నప్పటికీ ధన బలం ఉన్న వారికే టికెట్టు ఇచ్చారని ఆశావహులు మధనపడుతున్నారు.
ఇటీవలే టీడీపీలో చేరిన గంటా వర్గీయులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై కూడా ఆ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గంటా వర్గీయులు జెడ్పీటీసీ, లేదా ఎంపీపీ పదవికాని తమకు కేటాయించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజు వీరిని పట్టించుకోకపోవడంతో వారంతా రాజు తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాల్లోని సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన వారినే ప్రోత్సహిస్తున్న రాజు తీరుపై సీనియర్లు అక్కసుతో ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలా రాజుపై ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థులు మధనపడుతున్నారు.