
మహిళను నరికి చంపిన వృద్ధుడు
జంగారెడ్డిగూడెం రూరల్ : క్షణికావేశంలో ఓ వృద్ధుడు మహిళను కత్తితో నరికి చంపిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బేతాళ సరస్వతి(45) స్థానిక ప్రధాన రోడ్డు పక్కన కిళ్లీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటి పక్కనే అదే గ్రామానికి చెందిన వీరెంకి గంగరాజు(72) భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ తరచూ ఒకరినొకరు దూషించుకుంటూ గొడవలు పడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. సరస్వతి ఇంటికి.. గంగరాజు ఇంటి ముందు మరుగ్గా ఉండే స్థలం నుంచి నడిచే దారి ఉంది.
బుధవారం సరస్వతి మనవరాలు ఈ దారి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా గంగరాజు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన గంగరాజు కత్తితో సరస్వతి తల, మెడపై నరికాడు. అనంతరం కత్తితో నడుచుకుంటూ వెళ్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయూడు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుకుంటున్న సరస్వతిని బంధువులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ అంబికా ప్రసాద్, ఎస్సై శ్రీహరి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.