సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక టీడీపీ నాయకుల కుతంత్రాలు కారణంగానే నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు కావాలనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఆటో మొబైల్ రంగానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఆటోనగర్ నిర్మాణం, విమానాశ్రయ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు తదితర ప్రధాన హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా కూడా స్థానిక నేతలు ఒత్తిడితో ముఖ్యమంత్రి నిలిపి వేయడం దారుణమన్నారు.
సోమవారాన్ని పోలవరంగా మార్చానని చెబుతున్న ముఖ్యమంత్రి ఏ పనీ చేయకుండా ఈ జిల్లాపై ఎందుకు కక్ష గట్టారో చెప్పాలన్నారు. ఈ జిల్లా ప్రజలు మీకు అన్ని నియోజకవర్గాలు నెగ్గించి ఇస్తే ఈ జిల్లాను వెనుకబడిన జిల్లాగా వదిలేశారని ఆయన అన్నారు. జిల్లాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేయడం వల్లే మీకు రాజీనామా అల్టిమేటం పంపానని చెప్పారు. ఇప్పటి వరకు నేను పంపిన అల్టిమేటంపై సీఎం స్పందించని కారణంగానే ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నానని తెలిపారు. నా నిరవధిక నిరాహారదీక్ష ద్వారా అయినా ఈ జిల్లా, నియోజకవర్గానికిచ్చిన హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చాలని అన్నారు. ఈ దీక్షకు ప్రజలంతా అండగా నిలిచి హామీలు అమలుకు సహకరించాలని పైడికొండల మాణిక్యాలరావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment