Tadepalligudem constituency
-
అందుకే నేను దీక్ష చేస్తున్నా: పైడికొండల
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపించారు. శనివారం ఆయన తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్థానిక టీడీపీ నాయకుల కుతంత్రాలు కారణంగానే నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను చంద్రబాబు కావాలనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఆటో మొబైల్ రంగానికి కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెంలో ఆటోనగర్ నిర్మాణం, విమానాశ్రయ భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు తదితర ప్రధాన హామీలు అమలు చేసే అవకాశం ఉన్నా కూడా స్థానిక నేతలు ఒత్తిడితో ముఖ్యమంత్రి నిలిపి వేయడం దారుణమన్నారు. సోమవారాన్ని పోలవరంగా మార్చానని చెబుతున్న ముఖ్యమంత్రి ఏ పనీ చేయకుండా ఈ జిల్లాపై ఎందుకు కక్ష గట్టారో చెప్పాలన్నారు. ఈ జిల్లా ప్రజలు మీకు అన్ని నియోజకవర్గాలు నెగ్గించి ఇస్తే ఈ జిల్లాను వెనుకబడిన జిల్లాగా వదిలేశారని ఆయన అన్నారు. జిల్లాను తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేయడం వల్లే మీకు రాజీనామా అల్టిమేటం పంపానని చెప్పారు. ఇప్పటి వరకు నేను పంపిన అల్టిమేటంపై సీఎం స్పందించని కారణంగానే ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నానని తెలిపారు. నా నిరవధిక నిరాహారదీక్ష ద్వారా అయినా ఈ జిల్లా, నియోజకవర్గానికిచ్చిన హామీలు ముఖ్యమంత్రి నెరవేర్చాలని అన్నారు. ఈ దీక్షకు ప్రజలంతా అండగా నిలిచి హామీలు అమలుకు సహకరించాలని పైడికొండల మాణిక్యాలరావు కోరారు. -
ప్రజలను, సహజ వనరులను దోపిడీ చేస్తున్న ఘనుడు చంద్రబాబు
-
చంద్రబాబు గొప్ప దోపిడీ ట్రైనర్!
సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించినందుకు ప్రతిగా.. ప్రజలను, సహజ వనరులను దోపిడీ చేస్తున్న ఘనుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దోపిడీలకు పాల్పడటమేకాక.. టీడీపీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జన్మభూమి కమిటీలకూ ఎలా దోచుకోవాలో చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇసుక నుంచి పోలవరం కాంట్రాక్టుల దాకా అన్నింటా దోపిడీల పర్వం కొనసాగుతున్నదని వివరించారు. 167వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం మార్కెట్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడేనికి ఏమిచ్చాడు?: ‘‘2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు టీడీపీకే అన్ని సీట్లూ ఇచ్చారు. మరి ఈ నాలుగేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు ఏమిచ్చారు? మరీ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఏం చేశారు? తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు కడతామన్నారు.. కనీసం రోడ్డైనా వేయలేదు! నల్లజర్ల నుంచి తాడేపల్లి, తాడేపల్లి-భీమవరం, కైకలూరు-ఏలూరు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. నాలుగేళ్లలో ఇక్కడ ఒక్క కాలేజీ కూడా కట్టలేని ఆయన.. కేంద్రం ఇచ్చిన ఎన్ఐటీకి కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టలేదు. వైఎస్సార్ హయాంలో మంజూరైన తాడేపల్లిగూడెం అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తిచేయలేని అసమర్థుడు బాబు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నవైనం జిల్లా వాసులుగా మీకు తెలిసిందే. ప్రజలకు అవసరమైన పనులు చేయకపోగా, బాబు తన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇస్తాడు.. రౌడీయిజం, అధికారులపై దౌర్జన్యం, ఆడవాళ్లను జుట్టుపట్టి ఈడ్చడం, మట్టిని, ఇసుకను అక్రమంగా తొవ్వుకోవడం, కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి కమిషన్లు లాగడం లాంటివి ట్రైనింగ్ ఇస్తాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల కింద జన్మభూమి కమిటీలు ఆ ట్రైనింగ్ ప్రకారమే జనాన్ని దోచుకుతింటున్నారు. ఇక్కడి టీడీపీ నేతలు పేకాట రాయుళ్ల దేవుడు: తాడేపల్లిగూడెం టీడీపీ నాయకుడు, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు.. ఇసుక, మట్టి దోపిడీలే కాదు మరో కథనూ నడిపిస్తాడని జనం చెబుతున్నారు. భారీ ఎత్తున పేకాడేవాళ్లు ఈ ఎమ్మెల్యేకు నెలకు రూ.30 లక్షలు చెల్లించుకోవాలట! ఈ అక్రమ వ్యవహారాలన్నీ చూసి ఓ సీఐ చర్యలు తీసుకుంటే.. మరుసటిరోజే ఆయనను పక్కనపెట్టేశారు. ఇక్కడి కలెక్టర్.. టీచర్లను నడుస్తున్న శవాలంటూ దారుణంగా తిట్టాడు. ఆయనపై చర్యలులేవు. నాలుగేళ్లవుతున్నా ఆయనకు బదిలీ ఉండదు. తన పాలనలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరను కల్పించలేని చంద్రబాబు.. తన హెరిటేజ్ సంస్థ కోసం రైతుల పంటల్ని తక్కువ ధరకు కొని, నాలుగింతలు ఎక్కువ లాభాలు సొమ్ముచేసుకుంటున్నాడు. అందుకే ప్రతి సోమవారం పోలవరానికి పరుగులు: ఈ మధ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు.. పోలవరం పనులు 50 శాతం పూర్తయ్యాయని! నిజమే, ఆ 50 శాతంలో 70 శాతం పనులు దివంగత నేత వైఎస్సార్ హయాంలో జరిగినవే. అసలు రాష్ట్రానికి వరదాయిని అయిన పోలవరం గురించి పట్టించుకున్నది, పనులు ప్రారంభించింది వైఎస్సార్సే అన్న సంగతి అందరికీ తెలిసిందే. నాలుగేళ్లుగా పోలవరం పేరుతో జరుగుతోన్న దోపిడీ అంతాఇంతా కాదు. రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరాన్ని తామే కడతామని కేంద్రం అంటే.. వద్దూ నేనే కడతానని బాబు ముందుకొచ్చాడు. కేవలం కమిషన్ల కోసమే ఆయన పోలవరం కడతానన్నాడు. ఆ వెంటనే రేట్లను విపరీతంగా పెంచుతూపోతుపోయాడు. తన బినామీనకు నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టులు ఇప్పించాడు. 36 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరగాల్సిఉంటే.. ఈ నాలుగేళ్లలో కేవలం 6 లక్షల క్యూబిక్ మీటర్ల పనే జరిగింది. ప్రతిసోమవారం చంద్రబాబు పోలవరానికి పోయేది పనులు ఎలా జరుగుతున్నాయో చూడటానికో, పనుల వేగం పెంచడానికోకాదు.. కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన కమిషన్ల వసూలుకే సోమవారం పోలవరానికి వెళతాడు మోసగాళ్లను ఇంకా నమ్ముదామా?: గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు చేతిలో మోసపోనివారంటూలేరు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి, కాపులకు రిజర్వేషన్.. అంటూ వందలకొద్దీ హామీలిచ్చారు. వాటిలో ఏఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేశాడు. నాకు అలా చేయడంరాదు. చేయగలినిన పనైతే తప్పకుండా మాటిస్తా. కాకపోతే ప్రయత్నిస్తానని మాత్రమే అంటాను. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు ఇస్తున్న నిధుల కంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తామని మాటిస్తున్నా. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు అంటున్నాడు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా? ఇన్నాళ్లూ మోసం చేసిన చంద్రబాబును పొరపాటున కూడా క్షమిస్తే, కొత్త ఎత్తులతో జనం దగ్గరికొస్తాడు. ఇంటికి కేజీ బంగారం, బెంజికారు ఇస్తానంటాడు. అందుకే ఈ దుర్మార్గ వ్యవస్థలో మార్పులు రావాలి. చెప్పినమాట నిలబెట్టుకోలేనప్పుడు రాజకీయ నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అది జగన్ ఒక్కడితోనే సాధ్యంకాదు. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే మన ప్రభుత్వంలో ప్రజలకు చేయబోయే మేళ్లను నవరత్నాల ద్వారా వివరించాం. ఇవాళ ఆరోగ్యశ్రీ గురించి మరోసారి చెప్పుకుందాం.. ఆరోగ్యశ్రీలో మెరుగైన మార్పులు చేస్తాం: ఇవాళ వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ అక్కడ వర్తించదట! గుండె, మెదడుకు సంబంధించిన పెద్ద ఆపరేషన్లు చేయించాలంటే మంచి ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. పాత రేట్లు మార్చలేదు. దీంతో డాక్టర్లు ఆపరేషన్లు చేయడం లేదు. మనం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పు చేస్తాం. ఈ పథకం కింద ఏ పేదవాడికైనా వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తాం. ఏ ఆపరేషన్‌కైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ఉచితంగానే ఆపరేషన్ చేయిస్తాం. ఆ తర్వాత రోగి విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా డబ్బులు అందిస్తాం. దీర్ఘకాలంగా డయాలసిస్ చేయించుకునే కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం. ఏడాది ఓపిక పట్టండి దేశంలో ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
ప్రభుత్వాన్నే నిలదీస్తా..
సాక్షి, తాడేపల్లిగూడెం: ‘ఈ రామన్నగూడెంలో ఏ కార్యక్రమాలకు నన్ను పిలవడంలేదు.. నా పాత్ర లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదు.. నా నియోజకవర్గంలో నన్నో అంటరానివాడిగా చూసే పరిస్థితి ఏర్పడింద’ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను నిలదీయాలని ప్రయత్నిస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా.. నన్ను కట్ చేయాలని ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్ చేస్తా’ అని దురుసుగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పక్కనే మహిళా తహసీల్దార్, సభలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం జరిగిన జన్మభూమి సభలో మంత్రి పై విధంగా నోరు జారారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. గ్రామ సభలో జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుపై మంత్రి మాణిక్యాలరావు ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీలో కొలిక్కిరాని కుర్చీలాట
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీలో రాజకీయం వేడెక్కుతోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఎవరికి కట్టబెడతారన్న విషయం రోజుకో మలుపు తిరుగుతోంది.చాలా నెలల క్రితమే తెలుగు తమ్ముళ్లు ప్రారంభించిన కుర్చీలాట ఇంకా కొలిక్కిరాలేదు. అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించేస్తున్నారు అనుకునేలోగా కొత్త పేర్లు, కొత్త సమీకరణలు తెరపైకి వస్తు న్నాయి. దీంతో తమ్ముళ్లు బిక్కమొహం వేస్తున్నారు. పార్టీ టిక్కెట్ విషయంలో ఐదారునెలల క్రితం వరకూ యువ నాయకుల మధ్య పోటీ ఉండేది. ఇటీవల పార్టీలో పెద్దాయనగా పిలుచుకొనే యర్రా నారాయణస్వామి ఈ సీటు కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో పార్టీ అధినేత చంద్రబాబు ఎదుట యర్రా తన అంతరంగాన్ని వెల్లడించి నట్టు తెలిసింది. ఆ తరువాత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కలిసినట్టు సమాచారం. పార్టీ నాయకుడు సీఎం రమేష్ ద్వారా కొట్టు సత్యనారాయణ సీటు కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది. తమ్ముళ్ల గుర్రు ఇదిలావుండగా, ఓ మాజీ ప్రజాప్రతి నిధి రాకను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ శ్రేణులు పార్టీ అధినేతను కలిసి ఆయన కావాలో, క్యాడర్ కావాలో తేల్చుకోవా లని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 2004 నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులపై సదరు నేత అక్రమంగా కేసులు బనాయించారని పేర్కొంటూ కేసుల వివరాలను చంద్రబాబుకు సమర్పించారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఈ కేసుల విషయం తేల్చిన తరువాతే అలాంటి వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే విషయంపై ఆలోచించాలని అధినేతను కోరారని చెబుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రం గా పరిగణించకపోతే ఈనెల 26 లేదా 27న గూడెంలో నిర్వహించే గర్జన సభలో గందరగోళం తప్పదని బాహా టంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈలోగానే వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. రామయ్యా.. కష్టమేనయ్యా! కొవ్వూరు, న్యూస్‌లైన్ : కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వం వ్యవహారం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదట్లోనే వివాదాల్లో చిక్కుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకు తిరిగి పార్టీ టికెట్ ఇస్తే సహించేది లేదని శ్రేణులు హెచ్చరిస్తున్నారు. పార్టీలో ముఖ్య నాయకులకు, ఆయనకు మధ్య గతంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రామారావు మాత్రం చంద్రబాబు కచ్చితంగా తనకే సీటిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మంత్రి పదవి కూడా ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జీర్ణీంచుకోలేకపోతున్నారు. రామారావుకు టికెట్ దక్కకుండా చేసేందుకు పావులు కూడా కదుపుతున్నారు. ఐదేళ్లలో అతని వైఖరి కారణంగా పార్టీకి నష్టం వాటిల్లిందని, ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లే ప్రమా దం ఉందని కొందరు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి పార్టీ కార్యక్రమాలు, నిధుల కేటాయింపు వంటివి చేస్తున్నారని ఇప్పటికే పలుమార్లు పార్టీ పెద్దల ఎదుట గగ్గోలు పెట్టారు. నియోజకవర్గంలో కీలక నేత అయిన పెండ్యాల అచ్చిబాబు సైతం ఈ సారి రామారావు అభ్యర్థిత్వంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆ పార్టీ రాజ మండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాగంటి మురళీమోహన్ ఇటీవల నిర్వహిం చిన ఇంటింటికీ టీడీపీ పోస్టర్లపై రామారావు ఫొటో ముద్రించకపో వడం చర్చనీయాంశమైంది. దీంతో ఇటీవల ఏలూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో తనకే సీటు కేటాయించాలని, ప్రత్యామ్నాయాలు వెతి కితే ఉపేక్షించబోనని రామారావు కుండబద్దలు కొట్టారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు సీటిస్తారా లేక కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.