టీడీపీలో కొలిక్కిరాని కుర్చీలాట
Published Sun, Jan 19 2014 1:48 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీలో రాజకీయం వేడెక్కుతోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఎవరికి కట్టబెడతారన్న విషయం రోజుకో మలుపు తిరుగుతోంది.చాలా నెలల క్రితమే తెలుగు తమ్ముళ్లు ప్రారంభించిన కుర్చీలాట ఇంకా కొలిక్కిరాలేదు. అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించేస్తున్నారు అనుకునేలోగా కొత్త పేర్లు, కొత్త సమీకరణలు తెరపైకి వస్తు న్నాయి. దీంతో తమ్ముళ్లు బిక్కమొహం వేస్తున్నారు. పార్టీ టిక్కెట్ విషయంలో ఐదారునెలల క్రితం వరకూ యువ నాయకుల మధ్య పోటీ ఉండేది. ఇటీవల పార్టీలో పెద్దాయనగా పిలుచుకొనే యర్రా నారాయణస్వామి ఈ సీటు కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో పార్టీ అధినేత చంద్రబాబు ఎదుట యర్రా తన అంతరంగాన్ని వెల్లడించి నట్టు తెలిసింది. ఆ తరువాత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కలిసినట్టు సమాచారం. పార్టీ నాయకుడు సీఎం రమేష్ ద్వారా కొట్టు సత్యనారాయణ సీటు కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఉంది.
తమ్ముళ్ల గుర్రు
ఇదిలావుండగా, ఓ మాజీ ప్రజాప్రతి నిధి రాకను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ శ్రేణులు పార్టీ అధినేతను కలిసి ఆయన కావాలో, క్యాడర్ కావాలో తేల్చుకోవా లని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 2004 నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులపై సదరు నేత అక్రమంగా కేసులు బనాయించారని పేర్కొంటూ కేసుల వివరాలను చంద్రబాబుకు సమర్పించారని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఈ కేసుల విషయం తేల్చిన తరువాతే అలాంటి వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే విషయంపై ఆలోచించాలని అధినేతను కోరారని చెబుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రం గా పరిగణించకపోతే ఈనెల 26 లేదా 27న గూడెంలో నిర్వహించే గర్జన సభలో గందరగోళం తప్పదని బాహా టంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈలోగానే వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు.
రామయ్యా.. కష్టమేనయ్యా!
కొవ్వూరు, న్యూస్‌లైన్ : కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వం వ్యవహారం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదట్లోనే వివాదాల్లో చిక్కుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావుకు తిరిగి పార్టీ టికెట్ ఇస్తే సహించేది లేదని శ్రేణులు హెచ్చరిస్తున్నారు. పార్టీలో ముఖ్య నాయకులకు, ఆయనకు మధ్య గతంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి టికెట్ ఇస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రామారావు మాత్రం చంద్రబాబు కచ్చితంగా తనకే సీటిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మంత్రి పదవి కూడా ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జీర్ణీంచుకోలేకపోతున్నారు. రామారావుకు టికెట్ దక్కకుండా చేసేందుకు పావులు కూడా కదుపుతున్నారు. ఐదేళ్లలో అతని వైఖరి కారణంగా పార్టీకి నష్టం వాటిల్లిందని, ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లే ప్రమా దం ఉందని కొందరు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది.
స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించి పార్టీ కార్యక్రమాలు, నిధుల కేటాయింపు వంటివి చేస్తున్నారని ఇప్పటికే పలుమార్లు పార్టీ పెద్దల ఎదుట గగ్గోలు పెట్టారు. నియోజకవర్గంలో కీలక నేత అయిన పెండ్యాల అచ్చిబాబు సైతం ఈ సారి రామారావు అభ్యర్థిత్వంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఆ పార్టీ రాజ మండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాగంటి మురళీమోహన్ ఇటీవల నిర్వహిం చిన ఇంటింటికీ టీడీపీ పోస్టర్లపై రామారావు ఫొటో ముద్రించకపో వడం చర్చనీయాంశమైంది. దీంతో ఇటీవల ఏలూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో తనకే సీటు కేటాయించాలని, ప్రత్యామ్నాయాలు వెతి కితే ఉపేక్షించబోనని రామారావు కుండబద్దలు కొట్టారని తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు సీటిస్తారా లేక కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Advertisement