
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి మిత్రపక్షాలుగా కలిసి మెలిసి ఉన్నట్లు కనపడుతున్నా పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జిల్లాలో తమకు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక మంత్రి ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోగా, ప్రతి విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తోందన్న భావన బీజేపీలోని కిందిస్థాయి కార్యకర్త వరకూ ఉంది. దీంతో వారు కసితో రగిలిపోతున్నారు. పార్టీ జిల్లాలో ఎదగకపోవడానికి తెలుగుదేశమే కారణమని వారంతా అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం నుంచి ఏదైనా సహాయం నిలిచిపోతే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఉపాధిహామీ పథకంతోనే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సిమెంట్‌రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేసుకుంటున్నారని అయితే అవన్నీ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో బీమా పథకాన్ని చంద్రన్న బీమా పేరుతో తమ స్వలాభం కోసం ప్రచారం చేస్తోందని, ఈ పథకానికి ముందు ప్రధాని పేరు పెట్టాలని అసెంబ్లీలో కోరినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేస్తున్నారు.
పోలవరానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారం దుర్మార్గమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసవర్మ ఆరోపిస్తున్నారు. పోలవరానికి నాబార్డు ద్వారా రుణం ఇప్పించి, ఆ రుణాన్ని కేంద్రం చెల్లిస్తుందని అటువంటప్పుడు దానికి బడ్జెట్‌లో ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మంత్రులకు సరైన ప్రొటోకాల్ ఇవ్వడం లేదు. ఆఖరికి జన్మభూమి కమిటీలు కూడా ఏకపక్షంగానే వేశారు. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజుకు కూడా చాలా కార్యక్రమాలకు ఆహ్వానం ఉండటం లేదు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో ఆయనకు చెప్పకుండానే జెడ్పీ చైర్మన్ బాపిరాజు కార్యక్రమాలు నిర్వహించడం తెలిసిందే. ఈ విషయంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తమవల్లే తాడేపల్లిగూడెంలో బీజేపీ గెలిచిందని, అందువల్ల తాము చెప్పినట్లే వినాలనే తరహాలో తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కలిసి పనిచేయడానికిఅభ్యంతరం లేదు
బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు భూపతి శ్రీనివాసవర్మ
మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం పొందుతూ ఎక్కడా బీజేపీ, ప్రధానమంత్రి పేరు చెప్పకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేంద్రం నుంచి ఏదైనా అందకపోతే దాన్ని పెద్ద వివాదంగా మారుస్తున్నప్పుడు కేంద్ర సహకారంతో చేసే పనులను ఎందుకు ప్రస్తావించరు. కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది. అయితే ఏపీకి రావాల్సిన వాటి కోసం మేము కూడా ప్రయత్నిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment