గుజరాత్ మాదిరిగా ఏపీ అభివృద్ధి
ఏపీకి సాయంపై ప్రధాని మోదీ భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ బీజేపీ నేతల బృందానికి హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కంటే అధికంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, భవిష్యత్తులో కూడా సాయం అందిస్తామని తెలిపారు. ‘‘మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు ముంబై వంటి వాణిజ్య నగరాన్ని గుజరాతీలు కోల్పోయారు.
సముద్రతీరం, పర్వతాలు మినహా నదులు తదితర వనరులు లేవు. ఉప్పు అమ్మకాలపైనే రాష్ట్రాదాయం ఆధారపడేది. తర్వాత పర్వతాల నుంచి వజ్రాలను వెలికితీశారు. కాలక్రమంలో అదొక పెద్ద వ్యాపారంగా మారింది. పరిశ్రమలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం గుజరాత్ దేశంలోనే అగ్రగామిగా నిల్చింది. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఆ విధంగా లేదు. ఏపీలో పలు వనరులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. ప్రతి పెద్ద కంపెనీలో ఏపీకి చెందిన వారు ఉద్యోగాలు చేస్తున్నారు’’ అని మోదీ గుర్తు చేశారు.
ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి అందనంత అత్యధిక సాయాన్ని ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ప్రకటించినందుకు ఏపీ బీజేపీ నేతల బృందం శనివారం ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలను కలసి ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, ఎంపీ గోకరాజు, మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర నాయకులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
నిరంతరం అండగా..: ప్యాకేజీతో పాటుగా ఏపీ అభివృద్ధికి నిరంతరం అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన వాటికి చట్టబద్ధత కల్పించేందుకు బీజేపీ అగ్ర నేతలు హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల అమలు కాలపరిమితిలో జరగాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించిందని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ వల్లే గెలిచా..: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఏపీకి ప్రకటించిన ప్యాకేజీని అర్థం చేసుకొని ఎన్డీఏ కృషిని స్వాగతిస్తారని భావిస్తున్నానని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. పవన్ వల్లే తాను ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. శుక్రవారం పవన్ సమావేశానికి తమ అనుచరులు కూడా హాజరయ్యారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, పి.రఘురాం తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు.