బెడిసికొడుతున్న బీజేపీ, టీడీపీ సంబంధాలు | Interesting politics in BJP-TDP | Sakshi
Sakshi News home page

బెడిసికొడుతున్న బీజేపీ, టీడీపీ సంబంధాలు

Published Sun, Jan 28 2018 8:57 AM | Last Updated on Fri, Aug 10 2018 7:26 PM

Interesting politics in BJP-TDP  - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : మిత్రపక్షం బీజేపీతో పొత్తుకు నమస్కారం అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతో జిల్లాలో తాడేపల్లిగూడెం రాజకీయం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలోనిర్వహించిన జిల్లా సమీక్షా మండలి సమావేశానికి బీజేపీ నుంచి గెలిచిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు తాను వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు అయింది.

తాడేపల్లిగూడెం కేంద్రంగా తెలుగుదేశం, బీజేపీల మధ్య మూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాలు అటు సీఎం చంద్రబాబునాయుడికి కూడా తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటు ఆశించి (పొత్తు కారణంగా బీజేపీ ఇచ్చారు) అది దక్కకపోవడంతో జెడ్పీ చైర్మన్‌ అయిన ముళ్లపూడి బాపిరాజు ప్రతిక్షణం తాడేపల్లిగూడెం వ్యవహారాల్లో చెయ్యి పెట్టడం, మంత్రికి వ్యతిరేకంగా పనిచేయడంతో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ముఖ్యమంత్రి వద్ద కూడా అనేక పంచాయితీలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది.

ఇటీవల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు మంత్రి మాణిక్యాలరావుకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, దానిపై తెలుగుదేశం నాయకులు స్పందించి సోము వీర్రాజు నాలుక కోస్తామనడం తెలిసిందే. దీంతో మంత్రి మాణిక్యాలరావు పోలీసులపై వత్తిడి తీసుకువచ్చి మున్సిపల్‌ చైర్మన్‌పై కేసు పెట్టించారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభల్లో మంత్రికి  సమాచారం ఇవ్వకుండా జెడ్పీ చైర్మన్‌ పాల్గొనడం మంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, అదే సభకు ఆలస్యంగా వచ్చిన మంత్రి మాణిక్యాలరావు జెడ్పీ చైర్మన్‌ వ్యాఖ్యలపై స్పందించడంతో ఇరువర్గాలు రోడ్డెక్కాయి. మంత్రిని మున్సిపల్‌ ఛైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాసరావు ఆఫ్ట్రాల్‌ ఫొటోగ్రాఫర్‌ అని వ్యాఖ్యానించడం, తనను కట్‌ చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే నిధులు కట్‌ చేస్తానంటూ మంత్రి రెచ్చిపోవడం తెలిసిందే.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఈ వివాదం పరిష్కరించమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ బాపిరాజుతో పుల్లారావు విడిగా భేటీ అయ్యారు.  మొదట మంత్రి మాణిక్యాలరావే ఈ వివాదాన్ని మొదలు పెట్టారని, అందువల్ల ఆయనే వెనక్కి తగ్గాలని, తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదని బాపిరాజు స్పష్టం చేసినట్లు సమాచారం. తెలుగుదేశం బలంతో గెలిచిన మంత్రి ఆ విషయాన్ని మర్చిపోయి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బాపిరాజు ఆరోపించినట్లు సమాచారం. మంత్రి మాణిక్యాలరావు మాత్రం ఉదయం వరకూ తాడేపల్లిగూడెంలోనే ఉన్నా ఉదయమే కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత జిల్లా అంశాలపై సమీక్షా సమావేశం పెట్టినా మంత్రి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement