సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల ముంగిట మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధిని అధికార పార్టీ అడ్డుకుంటుందని, ముఖ్యమంత్రి ఇప్పటివరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన ఆరో పించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చేనెల 6న వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాణిక్యాలరావు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జిల్లాలోతీవ్రచర్చకు దారి తీసింది. అభివృద్ధి విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మంగళవారం ప్రకటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల నిమిత్తం 56 హామీలిచ్చి వాటిలో కొన్నింటికి జీఓలు, మరికొన్నింటికి సీఎం హామీ ఐడీ నంబర్‌లు ఇచ్చికూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి గాను 15 రోజుల వ్యవధిలో కార్యాచరణ ప్రకటించకుంటే 16వ రోజున ప్రజలతో కలిసి నిరవధిక నిరసన దీక్ష చేపడతానని హెచ్చరించారు.
15 రోజుల్లో అభివృద్ధి విషయంలో సీఎం నిర్ణయం తీసుకోకుంటే ఆయనకు పంపిన లేఖను స్పీకర్‌కు పంపి ఆమోదించే బాధ్యత కూడా సీఎం తీసుకోవాలని కోరారు. అయితే నాలుగేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రిని పొగుడుతూ వచ్చిన మాణిక్యాలరావు తెలుగుదేశం, బీజేపీ మధ్య విభేదాలు మొదలైన తర్వాత స్వరం మార్చుతూ వచ్చారు. నాలు గేళ్లు మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోలేకపోవడంపై ఆయన ఏనాడూ నోరు విప్పలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిపై విశ్వాసంతో ఎమ్మెల్యే, ఎంపీలను మొత్తంగా జిల్లా ప్రజలు కూటమికి కట్టబెట్టినా, జిల్లాకు ఒక ప్రాజెక్టు కాని, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ కాని, యూనివర్సిటీ కాని, తీరప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కాని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెబుతున్న మాణిక్యాలరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏ ప్రాజెక్టు తేలేకపోయారు. నిట్ ఒక్కటే ఈ నా లుగేళ్లలో వచ్చింది. అయితే నాలుగున్నరేళ్ల కాలంలో కూడా మిత్రపక్షాల మధ్య విభేదాల కారణంగా ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడానికే పరిమితం అయ్యారు. అధికార పార్టీ నేతలు కూడా మాణిక్యాలరావుకు పేరు రా కూడదన్న పద్ధతిలో వ్యవహరించడంతో అక్కడా అభివృద్ధి జరగకుండా పోయింది.
ఇరుకున పడ్డ అధికార పక్షం
మిత్రపక్షాలను నమ్మి గెలిపిస్తే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తాడేపల్లిగూడెంను అభివృద్ధి చేయకుండా చేశారు. తెలుగుదేశం, బీజేపీ మధ్య సంబంధాలు తెగిపోయిన తర్వాత అభివృద్ధిపై బహిరంగ చర్చ అంటూ హైడ్రామా నడిపారు. ఇప్పుడు తాజాగా అభివృద్ధి చేయడం లేదంటూ పైడికొండల మాణిక్యాలరావు రాజీనా మాస్త్రం సంధించడంతో అధికారపక్షం ఒక విధంగా ఇరుకునపడింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో వారు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగుతున్నారు. మరోవైపు ఈ రాజీనామా పై ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఎందుకు మాట్లాడరని చంద్రబాబు ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు, రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదని చంద్రబాబు విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి.. టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాక.. అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో ప్రభుత్వం తమకు ఎంతో సహకారం అందించిందని ప్రకటించిన మాణిక్యాలరావు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న సమయంలో రాజీనామా డ్రామాకు తెరతీశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రాజీనామాతో నాలుగేళ్లు అధికారంలో ఉండి బీజేపీ, నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీలు జిల్లా అభివృద్ధి కోసం ఏమీ చేయలేదని తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment