
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు నివాసం(తాడేపల్లిగూడెం) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధం నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించిన ఆయనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు. రోడ్డుపై గంటకు పైగా తీవ్రమైన ఎండలో కూర్చోవడం, పోలీసులు లోపలికి తీసుకెళ్లే క్రమంలో జరిగిన పెనుగులాటలో మాణిక్యాల రావు అస్వస్థతకు గురయ్యారు.
ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అభివృద్ధికి ఆటంకం, మట్టి మాఫియా బాపిరాజు డౌన్ డౌన్, పోలీసుల దైర్జన్యం నశించాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లపై ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాల రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. దీంతో నిరసన చేపట్టేందుకు ఉపక్రమించిన మాణిక్యాల రావును పోలీసులు ఎత్తుకెళ్లి ఇంట్లో పడేశారు.
Comments
Please login to add a commentAdd a comment