చంద్రబాబు మానసికస్థితిపై అనుమానంగా ఉంది | Ex Minister Pydikondala Manikyala Rao Slams Chandrababu In Thadepalligudem | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మానసికస్థితిపై అనుమానంగా ఉంది

Published Sat, Nov 3 2018 7:03 PM | Last Updated on Sat, Nov 3 2018 10:11 PM

Ex Minister Pydikondala Manikyala Rao Slams Chandrababu In Thadepalligudem - Sakshi

తాడేపల్లిగూడెం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు స్థానిక జెడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌లపై మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావు తీవ్రంగా ధ్వజమెత్తారు.  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం మాణిక్యాల రావు విలేకరులతో మాట్లాడారు. దేశం భ్రష్టుపట్టుకుని పోవడానికి కారణమైన కాంగ్రెస్‌ పార్టీని పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ ఆశయాలను తుంగలో తొక్కుతూ కాంగ్రెస్‌తో అంటకాగుతున్న చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న ఆ పార్టీ నుంచి కార్యకర్తలు, నేతలు బయటకొచ్చి పార్టీని పునర్మించండని పిలుపునిచ్చారు.

దేశంలో అభివృద్ధి పథంలో ఉన్న వ్యక్తులందరూ నా సలహాతోనే పైకొచ్చారు..నేనే వారందరికీ మార్గదర్శినని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక స్థితిపై తనకు అనుమానంగా ఉందని, ఆయన ఎక్కడైనా చూపించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క అంగుళమైనా ఇసుక ఉచితంగా వస్తుందా అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రాన్ని తెలుగు దొంగలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. నీరు-చెట్టు తెలుగుదేశం పాలిట కల్పతరువుగా మారిందని వ్యాక్యానించారు.  

జెడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌లకు ఈ సందర్భంగా మాణిక్యాల రావు సవాల్‌ విసిరారు. మీరు తవ్వే నల్లజర్ల, జగన్నాథపురం చెరువుల్లో అయినా లేక మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తా, టైం మీరు చెప్పినా లేక మమ్మల్ని చెప్పమన్నా సరే నేను రెడీ అని మాణిక్యాల రావు ప్రకటించారు. గురివింద గింజలా మీ కింద మచ్చ ఉంచుకుని నాపై విమర్శలు చేస్తారా అని ఘాటుగా విమర్శించారు. నేను చేసే సేవాకార్యక్రమాల గురించి గుడి, బడి, ఆసుపత్రి దగ్గర అడిగితే చెబుతారు..నేనొక సామాన్యుడిగా ఇవన్నీ చేశా..మీరు గొప్పవాళ్లని చెబుతున్నారు కదా మీరు చేసిందేమిటో కనీసం ఒక్కటైనా చెప్పాలని సూటిగా అడిగారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement