దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలు (స్టేట్ ఫెస్టివల్)గా ప్రకటించాలనే దుర్గమ్మ భక్తుల డిమాండ్ నేరవేరే అవకాశాలు కనపడుతున్నాయి.
విజయవాడ: దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలు (స్టేట్ ఫెస్టివల్)గా ప్రకటించాలనే దుర్గమ్మ భక్తుల డిమాండ్ నేరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. దసరా ఉత్సవాలకు పక్షం రోజులు ముందు హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి హడావుడి చేయడం ఆ తరువాత భక్తుల సమస్యలను పట్టించుకోకపోవడం జరుగుతోంది. అదే స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటిస్తే ఉత్సవ నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఐఏఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి.
నిర్వహణా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రం నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు శాశ్వత సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. దేవాదాయశాఖ మంత్రిగా మాణిక్యాలరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు స్టేట్ ఫెస్టివల్ హోదా కల్పించడంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దుర్గగుడికి ఉన్నతాధికారి
సాలీనా వంద కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తున్న దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సరైన అధికారి లేరు. దేవస్థానం ఈవో తీసుకునే నిర్ణయాలను కమిషనర్ అనుమతికి పంపి, అక్కడ ఆమోదం పొందిన తరువాతనే చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో తీవ్ర జాప్యంతో పాటు నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి. ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే దేవస్థానం నిధులు దుర్వినియోగం అరికట్టవచ్చని భక్తుల భావన. ఐఏఎస్ స్థాయి అధికారి నియమించాలనే ఆలోచన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని మంత్రి మాణిక్యాలరావు దృష్టికి వెళ్లగా పరిశీలిస్తానంటూ హామీ ఇచ్చారు.