నేటి నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
అక్టోబర్ 12 వరకు నిర్వహణ
ఈ ఏడాది 15 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా
విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలు ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో దసరాను పురస్కరించుకుని శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(3వ తేదీ) నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం ఉదయం 3–4 గంటల మధ్యలో ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది.
దర్శనానికి ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆలయ అధికారుల అంచనా. మూలానక్షత్రం రోజు సరస్వతి అలంకారంలో అమ్మవారిని 2.5 లక్షల మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉంది. 5 క్యూలైన్‌ల ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్న ప్రసాదం అందిస్తారు.
క్యూలైన్‌లో భక్తులకు వాటర్ ప్యాకెట్లతో పాటు, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్‌లు పంపిణీ చేస్తారు. భక్తుల కోసం 25 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. 12న విజయ దశమిని పురస్కరించుకుని సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఉత్సవాల నిర్వహణలో పాల్గొనే అన్ని శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో తొలి రోజైన గురువారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీబాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి ముఖ్యమైనది. విద్యోపాసకులకు మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment