మూలా నక్షత్రం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు
క్యూలైన్లలో సామాన్యులపై అడుగడుగునా ఖాకీల జులుం
చిన్నారులు, వృద్ధులను సైతం లాగిపడేసిన పోలీసులు
పలువురికి గాయాలు
ప్రశ్నించిన వారిపై మహిళా పోలీసుల దుర్భాషలు
వీఐపీల రాకతో భక్తులకు మరిన్ని తిప్పలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): మూలా నక్షత్రం రోజు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులపై పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. మహిళలు, వృద్ధులు, బాలలని కూడా చూడకుండా లాగిపడేశారు. పోలీసుల క్రౌర్యానికి ఓ బాలుడు, మహిళ గాయపడ్డారు. రౌడీలు, నేరస్తులతో కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించరని పలువురు భక్తులు మండిపడ్డారు. ఎన్నో ప్రయాసలకోర్చి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసుల చేష్టలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీఐపీ దర్శనాల రద్దు ఉత్తి మాటే!
మూలా నక్షత్రం కావడంతో వీఐపీల దర్శనాలు రద్దు చేశామని, సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని అధికారులు, నేతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో కూడా మూడు క్యూలైన్లలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. అయితే అచరణతో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. చంద్రబాబు పట్టు వ్రస్తాల సమర్పణ సమయంలోనే 35 నిమిషాలకు పైగా భక్తులకు దర్శనం నిలిపివేశారు.
ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలోనూ క్యూలైన్లు ఆపారు. మిగతా వీఐపీలూ పెద్ద సంఖ్యలో రావడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మాటిమాటికీ క్యూలను ఆపడంతో వినాయకుడి గుడి, కుమ్మరిపాలెం సెంటర్‌ల నుంచి క్యూలైన్లలో చంటి బిడ్డలను తీసుకొని వచ్చే భక్తులకు దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. వీఐపీలకు తోడు ఉత్సవ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నేతల సంబందీకులు అనేక మంది కింద ఉన్న క్యూలైన్లలో కాకుండా నేరుగా కొండ పైకి చేరుకున్నారు. దీంతో ఓం టర్నింగ్ వద్ద తీవ్ర తోపులాటలు జరిగాయి.
మగ పోలీసులే మహిళలను తోసుకుంటూ వెళ్లటం, కొంతమంది కింద పడిపోవటం వంటి ఘటనలు జరిగాయి. ఆ తోపులాటకు కొందరు విలపించారు. ఏటా మూలా నక్షత్రం రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని తెలిసినప్పటికీ, పోలీసుల వద్ద నిరి్ధష్టమైన ప్రణాళిక లేకపోవటమే ఈ విధమైన తోపులాటలు, గందరగోళ పరిస్థితులకు కారణమని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం కాక పోలీసు స్టేషన్‌లో ఉండే పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆలయంలోని సిబ్బంది సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
బాలుడికి, తల్లికి గాయాలు
బుధవారం మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకారం కావడంతో బెజవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచే వేలాదిగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులకు అడుగడుగునా పోలీసుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను సౌకర్యవంతంగా క్యూలో పంపించాల్సిన పోలీసులే వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు గాయపడ్డారు.
కొండ కింద నుంచి ఐదు గంటలపాటు క్యూలో నడుచుకుంటూ ఆ మహిళ కుటుంబం అమ్మవారి చెంతకు చేరింది. అదే సమయంలో మహిళా పోలీసులు ఆమెను, ఆమె కుమారుడిని తోసేయడంతో వారిద్దరూ ముందు ఉన్న బారికేడ్‌పై పడిపోయారు. బాలుడి తలకు బారికేడ్ బలంగా తగిలింది. చెవికి తీవ్రమైన గాయమైంది. చెంప వాచింది.
ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడాడు. మహిళ చేతికి గాయమైంది. ఇదేమిటని ప్రశ్నించిన మహిళపై మహిళా పోలీసులు బూతులతో విరుచుకుపడ్డారు. ఆమె చెయ్యిని గిచ్చినట్లుగా ఆ మహిళ మీడియా వద్ద వాపోయారు. కొండపైన ఉన్న హెల్త్ సెంటర్‌లో సిబ్బంది బాలుడిని పరిశీలించి ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment