అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అవినీతి ఆరోపణలు రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, విధుల నుంచి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. నగరంలోని ఆర్‌ఆర్ పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రాల కిరీటం వ్యవహారం, మేనేజర్‌గా పనిచేసిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావుపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై మంత్రి స్పందించారు.
ఈవో వ్యవహార శైలిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఆరోపణలు వాస్తవాలేనని నిగ్గుతేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆయన పనితీరుపై తనకు పలుమార్లు ఫిర్యాదులు అందాయని, అవినీతి ఆరోపణలతోపాటు వ్యక్తిగత వ్యవహార శైలిపైనా విమర్శలు రావడంతో వెంటనే బదిలీ చేశామని చెప్పారు. శాఖాపరమైన విచారణను ఈ రీజియన్ అధికారులు చేపడితే అతను కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా ఇతర జిల్లాల అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని చెప్పారు.