సాక్షి, రాజమండ్రి :గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది జరిగే పుష్కరాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు ఉభయగోదావరి జిల్లాల అధికారులను ఆదేశించారు. పుష్కర సన్నాహకంగా తొలి సమావేశాన్ని ఆదివారం రాజమండ్రి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో రెండు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు. పుష్కరాలకు దక్షిణ భారతం నుంచే కాక ఉత్తరాది రాష్ట్రాల నుంచీ భక్తులను ఆహ్వానించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. గత పుష్కరాల కన్నా రెట్టింపు భక్తులు తరలి వస్తారని అంచనాలు వేస్తున్నందున వర్షాలు కురిసినా, వరద వచ్చినా భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.
గత పుష్కరాల్లో పని చేసిన అధికారుల సూచనలు తీసుకోవాలని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. పుష్కరాల కోసం నియమించనున్న మంత్రుల కమిటీ ఈ నెల 8న రాజమండ్రిలో సమావేశం అయ్యే అవకాశం ఉందని, ఆలోగా అన్ని శాఖల అధికారులు నివేదికలను తయారు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఆహారాది సేవలందించేందుకు పలు సేవా సంస్థలు ఇప్పటి కే తనను సంప్రదిస్తున్నాయన్నారు. రాజమండ్రిలో గతంలో ఏర్పాటు చేసినట్టు.. ఈసారి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని స్నానఘట్టాల వద్ద షవర్ బాత్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. నిధులు కేంద్రం ఇచ్చినా, రాష్ట్రానివైనా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో పుష్కరాల నిర్వహణ ఉంటుందని హామీ ఇచ్చారు.
రెండు కోట్ల మంది వస్తారని అంచనా..
వివిధ శాఖల అధికారులు వారంలోగా నివేదికలు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా తుదిరూపు ఇవ్వడానికి వీలవుతుందని తూర్పుగోదావరి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అన్నారు. ఈ పుష్కరాలకు కనీసం రెండుకోట్లమంది వస్తారని అంచనా వేస్తున్నారని, వారికోసం కొత్త ఘాట్ల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఘాట్లలో కొన్నింటిని పునర్నిర్మించాలని, కొత్తగా తొమ్మిది నిర్మించాల్సి ఉందని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించినట్టు చెప్పారు. గత పుష్కరాలకు ఏ శాఖకు నిధులెన్ని వచ్చాయి, ఇప్పుడెన్ని కావాలి అనే అంశాలను నివేదికల్లో స్పష్టంగా పొందుపరచాలన్నారు. ప్రభుత్వం అందించే నిర్ణీత ప్రొఫార్మాలోనే ప్రతిపాదనలు అందించాలన్నారు. రెండు జిల్లాల ప్రతిపాదనల ఆధారంగా సంయుక్తంగా కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు.
త్వరలో మరో సమావేశం..
పశ్చిమగోదావరి జిల్లాలో గత నెల 31న తొలి సమావేశం నిర్వహించామని ఆ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటుచేసి తుది నివేదికలు తీసుకుంటామన్నారు. తర్వాత రెండు జిల్లాల కలెక్టర్లు సమావేశమై ప్రతిపాదనలను ఖరారు చేస్తామన్నారు. కార్పొరేషన్ నుంచి మెరుగైన సేవలు..కార్పొరేషన్ పరంగా అందించే సేవలను మెరుగుపరుస్తామని రాజమండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి చెప్పారు. ప్రభుత్వపరమైన ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని మంత్రిని కోరారు. పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మంత్రిని కోరారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, రాజమండ్రి ఆర్డీఓ నాన్‌రాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, రెండు జిల్లాల పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు, పోలీసు, వైద్య, ఆరోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రణాళికాబద్ధంగా నివేదికలివ్వండి..
గత పుష్కరాలలో పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న అనూరాధ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన ప్రభుత్వం ఐదుగురు కేబినెట్ మంత్రులతో సబ్ కమిటీ వేస్తోంది. వివిధ శాఖల కార్యదర్శి స్థాయి అధికారులతో కూడా రాష్ట్ర స్థాయి అధికారిక కమిటీనీ నియమిస్తున్నారు. రెండు జిల్లాల్లో జిల్లాలవారీగా ప్రజా ప్రతినిధులతో ఒక కమిటీ, కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల కమిటీలు వేస్తారు. పుష్కర తేదీల నిర్ణయంలో తర్జనభర్జనలతో నిమిత్తం లేకుండా పనులను చేపట్టాలి. పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే వస్తువుల ధరలు గతంలో ఆకాశాన్నంటాయి.
ఈసారి మార్కెట్ కమిటీలతో చర్చించి నిర్ణీత ధరలకు అందించే ఏర్పాటుచేయాలి. తూర్పుగోదావరిలో 81, పశ్చిమాన 50 ఘాట్ల జాబితా అధికారులు ఇచ్చారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలా అభివృద్ధి చేసుకోవాలి. పుష్కరాలను ఓ అవకాశంగా భావించి అవసరమైన పనులతోపాటు అవసరం లేని పనులను అనుబంధంగా ప్రతిపాదించవద్దు. గతంలో ఇలాంటి పనులు నిధుల్లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. పనుల్లో ఆర్భాటం, అందం వంటి వాటి కన్నా వసతులు, భక్తుల సౌకర్యాలకే పెద్దపీట వేయాలి. వరదలు వస్తాయని భావించి వాటికి అనుగుణంగానే బారికేడ్లు నిర్మించాలి. ఘాట్లలో మూడంచెల భద్రతను అమలు చేయాలి.
భక్తుల విశ్వాసాలు, అవసరాలను ప్రాధాన్యంగా పరిగణించి ఆలయాలను అభివృద్ధి చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కళాకారులను ముందు నుంచే గుర్తించాలి. ఒకేసారి వివిధ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలి. భక్తులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి విధులు నిర్వహించే ఉద్యోగులపై కూడా దృష్టిపెట్టాలి. అర్చకులు ఎవరు ఏయే ఘాట్లలో ఉండాలి, ఏ సేవకు ఎంత మొత్తం వసూలు చేయాలో ధరలు, జాబితాలు దేవాదాయ శాఖ అధికారులు ముందుగానే తయారుచేసి ఉంచాలి. ట్రాఫిక్, యాత్రికుల భద్రత తదితర రక్షణ చర్యలను పోలీసుశాఖ ఓ ప్రణాళికతో అమలు చేయాలి.
పావనపర్వానికి పటిష్టమైన ఏర్పాట్లు
Published Mon, Aug 4 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement