కేంద్రానికి ఏపీ అల్లుడు
రాష్ట్రాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తారు
అడ్డగోలు విభజన వల్లే కాంగ్రెస్ భూస్థాపితం
వికాస్ పర్వ్‌లో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
ఒంగోలు : కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లుడిలా భావించి అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. వరకట్న నిషేధ చట్టం సమయంలో అల్లుడికి కట్న కానుకలను పసుపు కుంకుమల పేరుతో మామలు ముట్ట చెబుతున్నట్లే నేడు ప్రత్యేక హోదా నిషేధం అయినందున ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక ప్యాకేజీల రూపంలో లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామని, అందువల్లే ఏపీ జీడీపీ 10.99గా ఉందన్నారు. గురువారం ఒంగోలులోని కాపు కల్యాణమండపంలో మోదీ పాలన రెండేళ్లు పూర్తరుున సందర్బంగా బీజేపీ నిర్వహించిన వికాస్‌పర్వ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో రాష్ట్రంలో బీజేపీ తప్ప మిగితా పార్టీలు, కార్మిక వర్గాలు అంతా సమైక్య నినాదాన్నే చేశాయన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసినందునే కాంగ్రెస్ భూస్థాపితమైందని మంత్రి స్పష్టంచేశారు. ఇప్పటికి కూడా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు అవినీతి చేయాలని చూస్తున్నారని, అదే జరిగితే తీహార్ జైలు ఖాయం అన్నారు. పదేళ్లు కాదు..మీరిస్తామన్న అయిదేళ్లు ప్రత్యేక హోదా అయిన విభజన చట్టంలో ఏమైందో చెప్పాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నెత్తిన మొట్టి నిలదీయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.
భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గ్రామసీమల్లోను, అమరావతిలోను రోడ్లకోసం వెచ్చిస్తున్న నిధులంతా కేంద్రం జారీచేసినవే అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా కేంద్రం సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 5వేల ఎకరాలు సేకరించి కేంద్రానికి అప్పచెప్పిన వెంటనే కేంద్రం పోర్టు నిర్మాణానికి సంసిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా, చివరకు కాంగ్రెస్ పాలనలో సైతం కేంద్రం జారీచేసే నిధులకు రాష్ట్రప్రభుత్వం ప్రధాని ఫొటోను, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రచురిస్తుందని, కానీ ఏపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనబడడంలేదన్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పార్టీ నాయకులు ఎస్.రవీంద్రరాజు, పాతూరి వెంకట సుబ్బారావు, బత్తిన నరశింహారావు, కందుకూరి సత్యన్నారాయణ, మువ్వల వెంకట రమణారావు, మీనాకుమారి, గోలి నాగేశ్వరరావు, పేర్ల సుబ్బన్న, నరాల రమణారెడ్డి, ఈదా సుధాకరరెడ్డి, ఖలీఫాతుల్లాభాషా, ఎం.వెంకటేశ్వర్లు, సెగ్గం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కాపులపై వేధింపులను ఉపసంహరించుకోవాలి..
సమావేశం ప్రారంభానికి ముందుగా కాపు సంఘం నేతలు గాదె కృష్ణారావు, ధనుంజయ, కొక్కిరాల సంజీవ్‌కుమార్, తోట రంగారావు, ఆరిగ చలమయ్య తదితరులు మంత్రి మాణిక్యాలరావును దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం ముద్రగడ పద్మనాభం చేపడుతున్న దీక్షకు సంబంధించి వినతిపత్రాన్ని ఆయనకు అందించారు. తునిలో జరిగిన ఘటనలో అమాయకులను కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని, గతంలో సీఎం చెప్పినట్లుగా కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. కాపులను బీసీలలో చేర్చే అంశంపై మంజునాధన్ కమిషన్ వేసినా వాస్తవానికి ఇంతవరకు కమిషన్ అడుగు కూడా ముందుకు వేయలేదని, కనుక తక్షణమే కమిషన్ చర్యలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.