జెండా పండుగకు తమ్ముళ్ల డుమ్మా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఊహించిందే జరిగింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెరుగుతున్న ఎడబాటు పంద్రాగస్టు అధికారిక వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. జెండా వందనం బాధ్యతను ప్రభుత్వం బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించిన నేపథ్యంలో శుక్రవారం ఏలూరులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టారు.
ఈ గైర్హాజరీ యాధృచ్ఛికంగా జరిగిందా.. ఉద్దేశపూర్వకమా అని ఎవరూ బహిరంగంగా చెప్పే పరిస్థితి లేదు.నవ్యాంధ్రలో మొదటిసారి జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కానరాకపోవడం చర్చనీయూంశమైంది. వాస్తవానికి జెండా వందనం బాధ్యత తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశించి భంగపడిన గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కర్నూలులో రాష్ట్రస్థారుులో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిపోయూరు. మిగిలిన ఎమ్మెల్యేలైనా ఈ కార్యక్రమానికి హాజరౌతారని అందరూ భావించారు. కానీ .. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రమే కాసేపు మెుహం చూపించి వెళ్లిపోయారు. మిగి లిన ప్రజాప్రతినిధులెవరూ కానరాలేదు.
ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా రాకపోవడం చర్చనీయూంశమైంది. తమ పార్టీకి చెందిన మంత్రి కాబట్టి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు హాజరై చివరివరకు ఉన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలోను, అంతకుముందు తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలోను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం 10మంది ఎమ్మెల్యేలైనా జిల్లా కేంద్రం ఏలూరులో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత నియోజకవర్గాల్లో జెండా వందనం కార్యక్రమాలకు వెళ్లేవారు. ఈసారి ఇలా జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎగ్గొట్టడం రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు దారితీసింది. తెలుగుదేశం, బీజేపీ మధ్య దూరం పెరుగుతోం దన్న భావనకు ఈ వేడుకలు బీజం పోశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.