‘లెక్క’లేదు
ఆస్తుల వివరాలు వెల్లడించని ఎమ్మెల్యేలే అధికం
ఇద్దరు మంత్రులదీ అదే తీరు
వివరాలు ఇవ్వని వారిలో ప్రభుత్వ విప్ చింతమనేని సహా 10 మంది
ఏలూరు : శాసనసభలో జిల్లా సమస్యలను ప్రస్తావించడంలోను.. అభివృద్ధికి దోహదపడే చర్చల్లోనూ నోరుమెదపని జిల్లాలోని ప్రజాప్రతినిధు లు తమ ఆస్తుల వివరాలను వెల్లడించే విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై అడ్డగోలుగా విరుచుకుపడే ఎమ్మెల్యేల్లో చాలామంది తమ ఆస్తుల వివరాలను మాత్రం ఇంతవరకు శాసనసభకు సమర్పించలేదు.
ప్రస్తుత శాసనసభ కొలువుదీరి 20నెలలు కావస్తున్నా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సహా జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు ఆస్తుల లెక్కలను శాసన సభకు ఇవ్వలేదు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తాజాగా వెల్లడించిన జాబితాలో ఆస్తుల వివరాలు ప్రకటించిన వారిలో మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఐదుగురు మాత్రమే ఉన్నారు.
కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఆస్తుల వివరాలను శాసన సభకు సమర్పించారు.