సమస్యలు.. సైడ్‌ ట్రాక్‌ | Lack Of Connecting Ridges Along Railway Track At Marampally | Sakshi
Sakshi News home page

సమస్యలు.. సైడ్‌ ట్రాక్‌

Published Sun, Jul 7 2019 8:04 AM | Last Updated on Sun, Jul 7 2019 8:05 AM

Lack Of Connecting Ridges Along Railway Track At Marampally - Sakshi

తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి వద్ద ట్రాక్‌ వరకు లేని గట్లు

సాక్షి,తాడేపల్లిగూడెం : ఎర్ర కాలువపై ఉన్న పాత అక్విడెక్ట్‌ తొలగించినా...గట్లు ఎత్తు పెంచి  ఆధునీకరించినా, ముంపు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆధునీకరణలో భాగంగా గట్లు ఎత్తు పెంచారు. అయితే, గట్లను రివిట్‌మెంట్‌ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే గత ఏడాది జూలైలో గట్లు జారిపోయాయి. దీనికి తోడు అదే ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ను ఆనుకుని గట్లు పూర్తి స్థాయిలో అనుసంధానించకపోవడమే ముంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దీంతో నందమూరు, మారంపల్లి, ఆరుళ్ల గ్రామాల వైపు, జగన్నాథపురం, మాధవరం గ్రామాల వైపు వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతాంగం అపార నష్టం చవి చూసింది. పలు చోట్ల చేలలో ఇసుక మేటలు వేసింది. ఈ ముంపునకు సంబంధించి రైతాంగానికి ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం అందని పరిస్థితి. మరో మూడు నెలలు గడిస్తే ముంపునకు ఏడాది పూర్తి కావస్తుంది. మళ్లీ వర్షాకాలం వచ్చింది. గట్లు జారిన చోట పటిష్ట చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మళ్లీ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

రైల్వే ట్రాక్‌ భద్రత కోసమే...!
ఎర్ర కాలువ నిర్మాణం జరిగిన సమయంలోనే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ సమీపం వరకు గట్లు వేయలేదని తెలుస్తోంది. ట్రాక్‌ అతి దగ్గరగా గట్లు వేయడం వల్ల పై నుంచి వరద నీరు ఉధృతంగా వస్తే ట్రాక్‌ భద్రత ఇబ్బందుల్లో పడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ట్రాక్‌కు చేరువగా గట్లు వేయడానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ట్రాక్‌కు ఆనుకుని వరద నీరు పోయేలా కాలువలను తవ్వింది.

ఆ కాలువలు కాలక్రమంలో ఆక్రమణలకు గురై పూడుకుపోవడంతో వరద నీరంతా మారంపల్లి రైల్వే ట్రాక్‌ సమీపం నుంచి చేలను ముంచెత్తుతుంది. దీన్ని గుర్తించని రైతులు పాత అక్విడెక్ట్‌ను పట్టుబట్టి తొలగించారు. అయితే, ముంపును నివారించాలంటే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ కానాలను పెంచడం, గట్లను ట్రాక్‌ వరకు పొడిగించడం చేయవలసి ఉంది. ఇది జరిగితేనే ఎర్ర కాలువ ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 

గట్లు పొడిగిస్తే ముంపు నివారణ 
మారంపల్లి రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని గట్లు వేసి పూడ్చడం వల్ల ముంపును నివారించవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీపీ గన్నమని దొరబాబు ఈ మేరకు రైల్వే అధికారులను తీసుకొచ్చి ముంపు ప్రాంతాన్ని చూపించినా ప్రయోజనం లేకపోయింది. జంగారెడ్డిగూడెం వద్ద కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి వదిలిన వరద నీరు ఎర్ర కాలువకు చేరుతుంది.

ఇలా వస్తున్న వరద నీరు నందమూరు అక్విడెక్ట్‌ వద్ద లాగకపోవడం ముంపునకు మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో వేలాది ఎకరాలు ముంపునకు గురవుతూ వచ్చాయి. మారంపల్లి వద్ద ట్రాక్‌ కానాలు పెంచడంతో పాటు  దువ్వ వద్ద వెంకయ్య – వయ్యేరు కాలువ కానాలను పెంచితేనే గానే పూర్తి స్థాయిలో వరద నీరు లాగే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement