తాండూరు రోటీ రుచిలో మేటి | Tandur Special Testy Food Jonna Rote! | Sakshi
Sakshi News home page

తాండూరు రోటీ రుచిలో మేటి

Published Tue, Jan 5 2016 2:07 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

తాండూరు రోటీ రుచిలో మేటి - Sakshi

తాండూరు రోటీ రుచిలో మేటి

జొన్నరొట్టె తాండూరువాసుల ఆహారపుటలవాట్లలో ఓ భాగమైంది. చేతులతో పిండిని నునుపు బండపై కొడుతూ.. కట్టెల పొయ్యి మీద తయారు చేసిన ఈ రొట్టెను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఒక పూట భోజనం (వరి అన్నం) లేకపోయినా ఉంటారేమో కానీ.. జొన్నరొట్టె లేకుండా మాత్రం ఉండలేరు. విందులు, శుభకార్యాల్లో కచ్చితంగా మెనూలో ఉండి తీరాల్సిందే.. డిమాండ్ పెరగడంతో కొన్ని కుటుంబాలు వీటి తయారీని ఏకంగా ఉపాధి మార్గంగా మలుచుకోవడం విశేషం. పోషకాలు పుష్కలంగా ఉండడంతోపాటు రుచి విభిన్నంగా ఉండడంతో చాలామంది జొన్నరొట్టెలను తినేందుకు అమితాసక్తి చూపుతున్నారు.     
 - తాండూరు
 
* జొన్నరొట్టెను ఇష్టంగా తింటున్న తాండూరువాసులు
* విందులు, శుభకార్యాల్లో ఉండి తీరాల్సిందే..
* పోషక విలువలు ఉండడంతో అమితాసక్తి
* జీవనోపాధిగా మలుచుకున్న కుటుంబాలు
* ఆర్డర్లపై విక్రయాలు
* కిరాణాదుకాణాలు, హోటళ్లలోనూ లభ్యం

జిల్లాలో ఇతర ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లతో పోల్చితే కర్ణాటక సరిహద్దులోని తాండూరు ప్రజలు భిన్నం. ఒకప్పుడు తాండూరు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా పరిధిలో ఉండేది. అలా కర్ణాటక సంప్రదాయమే క్రమంగా తాండూరు ప్రజల ఆహార అలవాట్లలో భాగమైంది. తాండూరు కందిపప్పు ఎంత ప్రసిద్ధో.. ఇక్కడి జొన్నరొట్టెకూ అంతే ఖ్యాతి వచ్చింది. వీటి తయారీ చాలామందికి జీవనోపాధిగా మారింది. తాండూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కుటుంబాలు జొన్నరొట్టె తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఇంట్లో.. హోటళ్లలో.. ఎక్కడికి వెళ్లినా జొన్నరొట్టెను ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో జొన్నరొట్టె తయారీ ఇక్కడ ఒక కుటీర పరిశ్రమగా మారింది.

పండగలు, ప్రత్యేక విందులు, ఇతర శుభకార్యాల్లో ఇది కచ్చితమైన మెనూ అయింది. ఆర్డర్లపై జొన్నరొట్టెలను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా కిరాణా దుకాణాలు, సూపర్‌మార్కెట్లలో సైతం హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తుంటారు. తాండూరు ప్రాంతంలో సుమారు 20 కుటుంబాలు జొన్నరొట్టె తయారీతో ఉపాధిని పొందుతుండడం గమనార్హం. పలు హోటళ్లలో ఉదయం వేళల్లో జొన్నరొట్టె కాంబినేషన్‌లో ‘రోటీ-బోటీ’ స్పెషల్ మెనూగా ఉండడం విశేషం.
 
ఒక్కో రొట్టె రూ.5 ..
తాండూరు పట్టణంలోని 22వ వార్డు గాంధీనగర్‌లో బుగ్గమ్మ కుటుంబం దాదాపు పదేళ్లుగా జొన్నరొట్టెలను తయారు చేస్తోంది. బుగ్గమ్మతోపాటు వీరి కోడళ్లు కూడా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జొన్నరొట్టెలను తయారు చేస్తారు. ఒక్కో జొన్నరొట్టె రూ.5 చొప్పున విక్రయిస్తారు. కొందరు యంత్రాలపై కూడా రొట్టెలు తయారు చేసి విక్రయిస్తున్నా.. చేతులతో చేసిన రొట్టెలను ఎక్కువగా ఇష్ట పడతారు.
 
ఇదే మాకు ఉపాధి..
పదేళ్లుగా జొన్నరొట్టెలు తయారు చేస్తున్నాం. ఇదే మా కుటుంబానికి జీవనోపాధి. అవసరమైన వారు ఆర్డర్లపై తీసుకువెళ్తారు. కొందరు కిరాణ, హోటల్ నిర్వాహకులు మా వద్ద హోల్‌సేల్‌గా తీసుకెళ్లి రిటైల్‌గా విక్రయిస్తారు. రూ.35 కిలో చొప్పు జొన్నలు కొనుగోలు చేస్తాం. కిలో జొన్నలతో పది రొట్టెలు అవుతాయి. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇష్టపడతారు.
 -బుగ్గమ్మ, గాంధీనగర్
 
రోజుకు 200దాకా విక్రయిస్తాం..
రోజుకు 200 వరకు జొన్నరొట్టెలు చేసి విక్రయిస్తాం. మా ఇంట్లో అత్త, తోటి కోడళ్లు అం తా కలిసి ఉదయం నుంచి సా యంత్రం వరకు రొట్టెలు త యారు చేస్తాం. ఒక మహిళ స హాయంగా పని చేస్తుంది. రొట్టెల తయారీకి రోజు కు క్వింటాలు కట్టెలు ఉపయోగిస్తాం. ఇందుకు రూ. 600 వరకు ఖర్చవుతుంది.ఒకరు రోజుకు 50 రొట్టె లు తయారు చేయొచ్చు. కందూర్, ఇతర విం దు కార్యక్రమాల సమయంలో ఆర్డర్లపై తీసుకువెళ్తారు.
-మున్నీబాయ్, గాంధీనగర్
 
రోజూ తినాల్సిందే..
భోజనంలో తప్పనిసరిగా జొన్నరొట్టె తింటాం. రోజులో ఒక్కసారైనా రొట్టె లేకుండా భోజనం దాదాపు ఉండదు.చాలా కాలంగా జొన్నరొట్టెను తింటున్నాం. మా కుటుంబంలో అందరికీ ఇష్టం. ఆరోగ్యపరంగా కూడా మంచిది కావడంతో ఎక్కువగా ఆసక్తి చూపుతాం.  
-బిడ్కర్ రఘ, తాండూరు
 
పోషకాలు పుష్కలం..
జొన్నల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో బీ, సీ విటమిన్లు ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో క్యాన్సర్ లాంటి వ్యాధులు దరి చేరవు. జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తంలో గ్లూకోజ్ తక్కువ మోతాదులో విడుదల చేస్తుంది. గింజల నూర్పిడి సమయంలో అల్యూరాన్ పొర దెబ్బతినకపోవడం వల్ల జొన్న రొట్టెతో సమృద్ధి పోషకత్వాలులభిస్తాయి. జాతీయ జొన్న పరిశోధనా సంచాలయం జొన్నలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు విలువ ఆధారిత వస్తువులుగా ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా జొన్న లడ్డూ, జొన్న ఉప్మా తదితర పదార్థాలపై ప్రచారం కల్పిస్తున్నారు.
-డా.సుధాకర్, వ్యవసాయ శాస్త్రవేత్త, తాండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement