Carib
-
పత్తి విత్తనంపై అధికారుల పెత్తనం
సాక్షి, హైదరాబాద్: బీజీ–2 పత్తి విత్తనం విఫలమైంది. గులాబీ రంగు పురుగు సోకి పత్తి పంట నాశనమవుతోంది. దీంతో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం బీజీ–2 పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కోసం విత్తన ప్రణాళికను ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే జిల్లాల నుంచి ఇండెంట్లు తెప్పించుకుంది. ఆ ప్రకారం విత్తనాలను సరఫరా చేయాలని యోచిస్తోంది. వ్యవసాయశాఖ తాజా ప్రణాళిక ప్రకారం వచ్చే ఖరీఫ్‌కు ఏకంగా 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. విస్మయం కలిగించే విషయమేంటంటే, గతేడాది కేవలం కోటి ప్యాకెట్లు మాత్రమే సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి అదనంగా 29 లక్షల ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి విత్తన కంపెనీలకు బాసటగా నిలిచేలా అధికారుల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 90 పత్తి విత్తన కంపెనీలకు ఆర్డర్లు.. తెలంగాణలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 2018–19 ఖరీఫ్‌లో ఏకంగా 44.30 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే గులాబీ రంగు పురుగు కారణంగా ఉత్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయిందని నిర్ధారించారు. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావాలి. కానీ అనేకచోట్ల ఈసారి 6–7 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండగా, పత్తిని ప్రత్యేకంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం అంతుబట్టడంలేదు. ఈసారి 90 పత్తి విత్తన కంపెనీలకు విత్తన ప్యాకెట్లను సరఫరా చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. ఇదిలావుం టే అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కూడా కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. బీజీ–2, బీజీ–3 విత్తనాలు చూడడానికి ఒకేరకంగా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తు పట్టడం కష్టమైన వ్యవహారం. దీన్ని ఆసరాగా చేసుకొని కంపెనీలు బీజీ–3 విత్తనాలను కూడా మార్కెట్లోకి దించుతున్నాయి. వాటిపై దాడులు చేస్తున్నామని చెబుతు న్నా పరోక్షంగా ఆయా కంపెనీలకు కొందరు అధికారులు మద్దతుగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇతర విత్తనాలు 8 లక్షలు.. ఇదిలావుంటే వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రకటించింది. ఖరీఫ్‌కు ఏఏ విత్తనాలు అవసరమో జిల్లాల నుంచి ఇండెంట్ తెప్పించుకుంది. ఆ ప్రకారం ఖరీఫ్‌కు 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేస్తారు. మూడు లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు. అలాగే 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు, 20 వేల క్వింటాళ్ల కంది, లక్ష క్వింటాళ్ల జీలుగ, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను కూడా సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను కూడా ఖరీఫ్ కోసం అందజేస్తారు. -
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపుస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షలమంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతుధర (గ్రేడ్–ఎ క్వింటాల్‌కు రూ.1,770, సాధారణ రకం– క్వింటాల్‌కు రూ.1750)కు 6.71 లక్షలమంది మంది రైతుల నుండి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్‌లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈసారి పురుగులు(దోమకాటు), ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. రైతులకు కనీసమద్దతు ధర లభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో దళారుల జోక్యానికి అడ్డుకట్ట పడింది. పంటకు కనీస మద్దతుధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతుల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుండి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటివరకు రూ.5,213 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుఖాతాలోకి జమ చేయగా, మిగిలిన మొత్తం కూడా ట్రాక్‌షీట్ జనరేట్ అయిన వెంటనే జమ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేశాం రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లాల కలె క్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఖరీఫ్‌లో 25 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 34 లక్షల టన్నులు సేకరించాం. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. దీని ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగలిగాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
రబీపై కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి, హైదరాబాద్: రైతును కాలం కాటేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని కుదేలు చేశాయి. ప్రస్తుతం రబీ కీలకమైన దశలో ఉండగా, పంటల సాగు ఏమాత్రం పెరగడంలేదు. బోర్లు, బావులు, చెరువులు, జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. సర్కారు లెక్కల ప్రకారమే రాష్ట్రంలోని 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, పాలమూరు, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాభావం నెలకొందని సర్కారు వెల్లడించింది. దీంతో రబీ సాగు విస్తీర్ణం 27 శాతానికే పరిమితమైంది. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 9.95 లక్షల ఎకరాలే సాగైంది. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 1.23 లక్షల ఎకరాల్లో (దాదాపు 7%) మాత్రమే నాట్లు పడ్డాయి. 4.15 లక్షల ఎకరాల్లో ఉండాల్సిన మొక్కజొన్న కాస్త 2.19 లక్షల ఎకరాల్లోనే సాగవుతోంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.86 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగుచేస్తున్నారు. మెదక్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో పంటల సాగు 10% లోపే ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు తీవ్ర నష్టం చేసింది. కనికరించని బ్యాంకులు రబీ పంటల పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మరోవైపు రైతులను ఆదుకోవాల్సిన బ్యాంకులు పట్టించుకోవడంలేదు. వ్యవసాయ రుణాలకు కొర్రీలు పెడుతున్నాయి. పైపెచ్చు ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో వీలున్నంత మేర.. రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా మొండికేస్తున్నాయి. రబీలో పంట రుణాల లక్ష్యం రూ.16,998 కోట్లు కాగా, వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కేవలం రూ.3,816 కోట్లే (22.45%) ఇవ్వడం గమనార్హం. రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చు కోసం ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తుంది. రైతుబంధు కింద ప్రభుత్వం సొమ్ము ఇస్తున్నా.. కౌలు రైతులు మాత్రం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు.. వడ్డీ వ్యాపారస్తుల వద్దే అప్పులు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఖాతా నెంబర్లలో సమస్యల కారణంగా దాదాపు 44 వేల మంది రైతుల ఖాతాల్లోకి సొమ్మే చేరలేదు. అలాగే కొత్తగా రబీలో అర్హులైన 3 లక్షల మందికి ఇప్పటికీ రైతుబంధు సొమ్ము చేరలేదు. చాలామంది రైతులు సాధారణంగా పంట రుణాలు రెన్యువల్ చేసుకుంటారు. దీన్ని సాకుగా తీసుకుని పాత వాటికి వడ్డీలు కట్టాలని కొన్నిచోట్ల, రేపు, మాపు అంటూ మరికొన్ని చోట్ల అన్నదాతలను బ్యాంకులు తిప్పుకుంటున్నాయి. పంట బీమాకు దూరమైన అన్నదాత ఈ నెల 31తో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం చెల్లించే గడువు ముగియనుంది. ఇందులో వరి ప్రధాన పంటగా ఉంది. అయితే బ్యాంకులు రుణాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో, చాలా మంది రైతులు బీమా పరిధిలోకి రాలేదు. రుణం ఇచ్చే సమయంలోనే పంటను బట్టి ప్రీమియాన్ని బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఈసారి దీన్ని తప్పనిసరి చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లింపులపై చాలా మంది అన్నదాతలకు అవగాహన లేదు. రైతుల్లో చైతన్యం తీసుకురావడంలో వ్యవసాయశాఖ అత్యంత దారుణంగా విఫలమైం దనేది సుస్పష్టం. ఫలితంగా ప్రకృతి విపత్తుతో నష్టం వస్తే రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇన్పుట్ సబ్సిడీని అమలు చేయకపోవడం, ఇటు బీమా పరిధిలో లేకపోవడంతో రైతులు అప్పులపాలు కావాల్సి వస్తోంది. కంటింజెన్సీ ప్రణాళికపైనిర్లక్ష్యం రబీ పరిస్థితి ఆశాజనకంగా లేదని వ్యవసాయశాఖ వర్గాలే చెబుతు న్నాయి. బోర్లు బావులు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో వరి అనుకున్నంత మేరకు సాగు అయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే రబీలో వర్షాభావం నెలకొంటే, వరి సాగయ్యే పరిస్థితి లేకుంటే అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి. సాధారణంగా రబీలో వరి సాగు కాని చోట్ల ఆరుతడి పంటలే వేస్తారు. జొన్న, మినుములు, నువ్వులు వంటి వాటిని సాగు చేస్తారు. కానీ అదనపు విత్తనాల సరఫరాపై వ్యవసాయశాఖ దృష్టిసారించకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురయ్యాయి. కేవలం రబీలో అవసరమయ్యే విత్తనాలకే పరిమితమయ్యారు కానీ వర్షాభావం నెలకొంటే ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం.. తాజా దారుణ పరిస్థితికి అద్దంపడుతోంది. ఖరీఫ్ పంట నష్టాన్ని కేంద్రానికి నివేదించరా? ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకంగా 24.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు సకాలంలో నీరందక ఎండిపోవడంతో నష్టం వాటిల్లినట్లు ఏకంగా వ్యవసాయశాఖే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, కందులు, పత్తి, పెసర, జొన్నలు, మినుములు, సోయాబీన్ వంటివి ఉన్నాయి. ఖరీఫ్‌లో 1.03 కోట్ల ఎకరాలలో పంటలు సాగు చేయగా, 24.72 లక్షల ఎకరాలు అంటే, దాదాపు 25% పంట నష్టం జరిగింది. ఎండల తీవ్రత, వర్షాభావం, గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంత నష్టం జరిగినా.. కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివేదిక ఇస్తే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి బాగోలేదన్న చర్చ జరుగుతుందని, దీనివల్ల ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రానికి నివేదిక ఇచ్చుంటే.. కనీసం రూ.700 కోట్ల మేర అయినా రైతులకు పరిహారం అందే అవకాశముండేదని అధికారులంటున్నారు. -
కమ్ముకున్న కరువు మేఘాలు
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిన పైర్లు, బీడు భూములే. తినడానికి మేత దొరక్క బక్కచిక్కిన పశువులు.. మైళ్ల దూరం నుంచి బిందెల్లో నీరు మోసుకెళుతున్న మహిళలు... వ్యవసాయం సాగక, పనుల్లేక పొట్ట చేతపెట్టుకుని బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన రైతన్నలు, వ్యవసాయ కూలీలు.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడా చూసినా ఇలాంటి దయనీయ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జూన్–సెప్టెంబరు మధ్య ఖరీఫ్ సీజన్లోనే కరువు తీవ్రత కనిపిస్తుంది. ఈ ఏడాది రబీ సీజన్లోనూ దుర్భిక్షం తాండవిస్తుం డడం గమనార్హం. సాధారణంగా వేసవిలో నీటికోసం రైతులు బోర్లు వేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కాకపోయినా నీటి దొరక్కపోవడంతో పంటలను, తోటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, వైస్సార్, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 800 నుంచి 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గతేడాది డిసెంబరు 27వ తేదీన రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం 35.62 అడుగులు కాగా, ప్రస్తుతం 42.12 అడుగులకు పడిపోయింది. రబీ ఆశలూ అడియాసలు ఖరీఫ్‌లో కరువు కాటు వల్ల పంటలు పోగొట్టుకుని అప్పులపాలైన రైతులు రబీలోనైనా ఎంతో కొంత పంటలు పండుతాయని ఆశపడ్డారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు సాగు చేశారు. అక్టోబరులో పంటలు విత్తిన తర్వాత వర్షాలు పడలేదు. తుపాన్ల సీజన్‌గా పేరొందిన రబీలోనూ ఏకంగా12 జిల్లాల్లో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. డిసెంబరు ముగుస్తున్నా నీటి తడి లేక రబీలోనూ పంటలన్నీ మాడిపోతున్నాయి. ఖరీఫ్‌లోనూ, ప్రస్తుత రబీలోనూ వేరుశనగ కంది, పత్తి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, ఉల్లి పైర్లు పొలాల్లోనే మలమలా మాడిపోయాయి. పెట్టుబడులు మట్టిపాలయ్యాయి.రైతన్నలపై అప్పుల భారం పెరిగింది. పైర్లు ఎండిపోవడంతో రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వాడిపోయిన పంటలను దున్నేస్తున్నారు. కబేళాలకు తరలుతున్న పశువులునాలుగేళ్లుగా వరుస కరువులతో చితికిపోయిన అన్నదాతలు, వ్యవసాయ కూలీలు ఈ రబీపై పెట్టుకున్న ఆశలు కూడా అడియాశలయ్యాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. పశుగ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతుండటంతో పాడిపై ఆధారపడిన రైతుల పరిస్థితి దీనంగా మారింది.చాలామంది మరోదారి లేక పశువులను కబేళాలకు అమ్మేస్తున్నారు. పరాయి రాష్ట్రాల్లో బతుకు పోరాటం రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం కుటుంబాలతో సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి కేరళ, కర్ణాటకకు వలసలు భారీగా పెరిగాయి. వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల పేద రైతులు, కూలీలు ఎక్కువగా బెంగళూరులో పనుల వెతుక్కుంటున్నారు. కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్‌కు వలస వెళుతున్నారు. వలస వెళ్తున్న వారితో రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. పనిచేసే శక్తి ఉన్నవారు వలసబాట పట్టడంతో చాలా గ్రామాల్లో వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి చేతులు రాని ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో ప్రధాన పంట అయిన వేరుశనగ ఖరీఫ్ సీజన్లో పూర్తిగా నేలపాలైంది. రబీలో వేసిన శనగ, కంది, మినుము, పెసర పంటలు కూడా వర్షాభావం వల్ల ఎండిపోయాయి. టమోటా, మిరప, బెండ, వంగ తోటలు కూడా నీరులేక వాడిపోయాయి. తమ పరిస్థితి ఏటేటా దిగదుడుపుగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు కాటేస్తున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని వాపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక రైతులు మానసికంగా కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఖరీఫ్‌లో 450కి పైగా మండలాల్లో కరువు ఉన్నప్పటికీ ప్రభుత్వం 316 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతలు దులుపుకుంది. దుర్భిక్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పైసా కూడా పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. రబీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించలేదు. రెయిన్ గన్‌తో పంటలను రక్షించామని గతంలో గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తలేదు. 12 జిల్లాల్లో కరువు విలయ తాండవం రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోంది. అక్టోబరు ఒకటో తేదీతో ఆరంభమైన రబీ సీజన్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లోనూ దుర్భిక్షం తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ కురవాల్సిన కనీస సగటు సాధారణ వర్షంతో పోల్చితే సగం కూడా కురవకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లాలో అయితే కురవాల్సిన దానిలో కేవలం 29 శాతం మాత్రమే కురిసింది. రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకూ 279.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 121.2 మిల్లీమీటర్లు మాత్రమే (57 శాతం తక్కువ) నమోదైంది. సాధారణం కంటే కోస్తాంధ్రలో 54 శాతం, రాయలసీమలో 62 శాతం సగటు లోటు వర్షపాతం రికార్డయింది. ఇవన్నీ అధికారిక గణాంకాలే కావడం గమనార్హం. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే రబీలోనే కాదు అంతకు ముందు ఖరీఫ్ సీజన్ నుంచి కరువు తిష్ట వేసింది. జూన్ 1వ తేదీతో ఆరంభమైన ఖరీఫ్ సీజన్ ఇప్పటివరకూ నమోదైన అధికారిక వర్షపాతం గణాంకాల ప్రకారం.. 480 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రాష్ట్రంలో 72 శాతం ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. అప్పులు ఎలా తీర్చాలో... ‘‘ఇంతటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. సాగు చేసిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోయాయి. రబీలో రూ.3 లక్షల ఖర్చు పెట్టి 18 ఎకరాల్లో శనగ పంట వేశా. వర్షాల్లేక పంటంతా ఎండిపోయింది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు’’ – తేనేశ్వరరెడ్డి, రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవడం లేదు ‘‘రూ.లక్ష ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశా. విత్తనాలు వేసే సమయంలో కురిసిన వాన తప్ప తర్వాత చినుకు పడలేదు. జొన్న పంటంతా ఎండిపోయింది. వానల్లేక ప్రతిఏటా పంటలు ఎండిపోతుండడంతో నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడం లేదు’’ – విష్ణువర్దన్‌రెడ్డి, రైతు, ప్యాలకుర్తి, కర్నూలు జిల్లా -
ఎరువు బరువు
►కరువు జిల్లాపై పిడుగుపాటు ►అన్నదాతపై జీఎస్టీ భారం ►12శాతం పన్ను శ్లాబులో ఎరువులను చేర్చడంపై ఆందోళన జీఎస్టీ (వస్తు సేవలపన్ను) రైతుకు గుదిబండగా మారనుంది. అన్ని రకాల ఎరువులను 12శాతం పన్నుల శ్లాబులోకి చేర్చడంతో అన్నదాతపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఎరువులపై అన్ని రాష్ట్రాల్లోనూ 4 నుంచి 8 శాతం పన్ను పరిధిలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏకంగా 12 «శాతానికి పెంచడంతో ఎరువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేటి పరిస్థితుల్లో ఎరువులపై పన్నులు పెంచడం మూలిగేనక్కపై తాటికాయ పడ్డచందంగా ఉందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. చిత్తూరు, సాక్షి: దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ విధానం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ విధానం కొన్ని వర్గాలకు మేలు చేస్తుంటే దేశానికి వెన్నెముకవంటి అన్నదాతపై మోయలేని భారం అవుతోంది. ఇప్పుడున్న ధరల విధానంతోనే ఎరువులు కొనా లంటే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో కర్షకులు ఉంటే.. ఎరువులపై మరింత పన్ను వేస్తూ వారి నడ్డివిరుస్తోంది. 12«శాతం పన్ను శ్లాబు లోకి ఎరువులను తేవడంతో టన్ను యూరి యాపై రూ.400, 50 కేజీల డీఏపీపై రూ.125, ఇతర కాంప్లెక్స్ ఎరువులపై టన్నుకు రూ.350 వరకు రైతులపై భారం పడనుంది. ఎరువుల ధరలపై విపరీతంగా ఖర్చుపెరుగుతున్నా..దిగుబడికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒక్క ఖరీఫ్‌లోనే.. జిల్లాలో ఖరీఫ్‌లో యూరియా 40,539, డీఏపీ 12050, పొటాషియం 8500, కాంప్లెక్స్ ఎరువులు 31,900, పాస్పేట్ 2300 టన్నుల వినియోగం ఉంటుంది. యూరియాపై రూ.16.10 కోట్లు, డీఏపీపై రూ.3.01 కోట్లు, పొటాషియంపై రూ.34 లక్షలు, కాంప్లెక్స్ ఎరువులపై రూ.12 కోట్లు, పాస్పేట్పై రూ.5.75 లక్షలు భారం పడనుంది. ఒక్క ఖరీఫ్‌లోనే రూ.32 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్స్పై ఎలాంటి పన్నులు లేవు. వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవడంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడుతున్న జిల్లా రైతాంగానికి ఇది ఏమాత్రం రుచించడం లేదు. ఓ వైపు సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులపై ఒకింత ఒత్తిడి తెస్తూనే పన్నులు వేయడం.. నోటితో చెప్పి నుదిటితో వెక్కిరించినట్లు ఉందని వారు అంటున్నారు. స్పష్టత లేదు.. ఎరువులపై పెరిగిన పన్నును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఒక్క యూరియా బస్తాపైనే సుమారు రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్‌కే సుమారు జిల్లాలో రూ.16కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది అనుమానించాల్సిన విషయం. ఇతర సూక్ష్మపోషకాల కంటే ఎక్కువ సబ్సిడీ యూరియాపైనే ఉండడంతో రైతులందరూ యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు యూరియాపై కూడా జీఎస్టీ బండ పడడంతో వినియోగం తగ్గుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. -
అదనులో అందేనా?!
►జూన్ 2 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన ►ఇప్పటి వరకూ జిల్లాకు చేరని పరిహారం వివరాలు ►రూ.1,032.69 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు ► రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది రూ.82.34 కోట్లు మాత్రమే ► ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి రైతులకు అన్యాయం! ►ప్రభుత్వ మోసపూరిత చర్యలతో అన్నదాతలకు రూ.434 కోట్ల మేర నష్టం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ముందస్తు వర్షాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో పెట్టుబడి కోసం అవస్థలు పడుతున్నారు. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందజేయలేదు. ఖరీఫ్‌లో రైతులు పంటసాగుకు సిద్ధమయ్యేలోపు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల పామిడి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ అతీగతీ లేదు. పైగా అధికారులు రూ.1,032.69 కోట్లతో ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.82.34 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోనుంది. గడిచిన ఖరీఫ్(2016)లో జిల్లా రైతులు 6.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున వెచ్చించారు. వర్షాభావం కారణంగా పంట తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే కంది, జొన్న, పత్తి తదితర పంటల ద్వారా మరో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. మొత్తమ్మీద రైతులకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు నష్టం వివరాలను తెప్పించుకుని రూ.1,070 కోట్లతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. చివరకు రూ.1,032.69 కోట్లతో తుది నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇందులో రూ.516.345 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రం కూడా ఈ మేరకు ఇవ్వాలి. కానీ రూ.82.34 కోట్లను మాత్రమే ఇస్తోంది. తక్కిన రూ.434 కోట్లను ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్ము ఇన్çపుట్‌సబ్సిడీ లెక్కల్లో కలిపి అందజేయనుంది. ఈ మోసపూరిత చర్యతో రైతులకు రూ.434కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ బీమా కింద వేరుశనగకు రూ.367 కోట్లు, ఇతర పంటలకు రూ.67కోట్లు మంజూరైంది. ఈ సొమ్ముపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. అయినా ఇన్పుట్లో కలిపేసి రైతులను దగా చేస్తోంది. దీనివల్ల 6,25,050 మంది వేరుశనగ, 3,635 మంది ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అన్యాయం జరగనుంది. చరిత్రలో తొలి మోసం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో వేటికవే లెక్కలు కట్టి ప్రభుత్వాలు రైతులకు అందజేసేవి. చరిత్రలో తొలిసారిగా రైతులకు, బీమా కంపెనీకి మాత్రమే సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చింది. తనకు ఏమాత్రమూ సంబంధం లేని సొమ్మును సొంతమన్నట్లు భావించి రైతులను దగా చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రెండింటినీ కలిపి లెక్కగట్టి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఇదే! ఖరీఫ్ మొదలైనా... : ఏప్రిల్‌లో పామిడికి విచ్చేసిన చంద్రబాబు ఖరీఫ్ మొదలయ్యేలోపు పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ నెల మొదటి నుంచి బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తున్నారు. రైతులు విత్తనకాయలు కొనుగోలు చేస్తున్నారు. కళ్యాణదుర్గంతో పాటు పలుచోట్ల పొలాల్లో విత్తు కూడా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు అందలేదు. నిజానికి గతేడాది అక్టోబరు 10లోపే ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు అందజేయాలి. ఈ సొమ్మును బజాజ్ అలయంజ్ కంపెనీ అక్టోబరులోనే జమ చేసినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయకుండా ప్రభుత్వమే పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు గతేడాది ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని ఇప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయం. జూన్ 2 నుంచి పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ మొదటి విడతలో ఎంత మొత్తాన్ని, ఎంతమంది రైతులకు ఇవ్వబోతున్నారు? ఎప్పటిలోగా జమ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన రైతులు : ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లంకెపెట్టి పరిహారం పంపిణీ చేస్తే వెంటనే పూర్తి ఆధారాలతో కోర్టును ఆశ్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. రూ.1,032 కోట్లతో అధికారులు పంపిన నివేదికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఇన్సూరెన్స్ సొమ్మును ఇందులో కలపడం వంటి రికార్డులను పూర్తిస్థాయిలో సేకరించి హైకోర్టును ఆశ్రయిస్తామని పలువురు రైతులు ‘సాక్షి’తో తెలిపారు. వ్యవసాయాధికారులు, జిల్లా కీలక అధికారులు, ప్రభుత్వాన్ని కేసులో చేరుస్తామని చెబుతున్నారు. -
ఉత్తుత్తి సమావేశాలు..
►రైతులను చైతన్యపరచడంలో అధికారులు విఫలం ►అందనినాణ్యమైన విత్తనం ►ఏటా రూ.5 లక్షలు వృథా జిల్లాలో గ్రామవిత్తనోత్పత్తి పథకం సీడ్లెస్ పథకంగా మిగిలిపోతోంది. రైతులను ప్రోత్సహించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి ఏటా ఖరీఫ్,రబీలో ఈ పథకాన్ని జిల్లా వ్యవసాయశాఖ ఆర్భాటంగా ఆరంభిస్తున్నా...చివరికి వచ్చే సరికి తస్సుమంటోంది. ఓ అధికారి అయితే అందివచ్చిన అవకాశాన్ని పథక శిక్షణల పేరుతో సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు మిన్నకుండి పోయారంటే ఇది ఏవిధంగా అమలవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కడప అగ్రికల్చర్ : ప్రతి ఏటా జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లకుగాను 200 గ్రామాల్లో ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా దీనిని అమలు చేస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు గ్రామంలో అభ్యుదయ రైతులను గుర్తిస్తారు. అందులో ఒక్కో పంటను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఈ యూనిట్లో 25 మంది రైతులను ఎంపిక చేసి వారికి 7 1/2 క్వింటాళ్ల నాణ్యమైన సర్టిఫికేషన్ సీడ్(నాణ్యతతో కూడిన విత్తనం)ను అందిస్తారు. మొదటి దశ సాగులో విత్తనశుద్ధి, మొలకశాతం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. రెండో దశలో పంటలో సస్యరక్షణ, కల్తీ మొక్కలను ఏరివేయడం వంటి వాటిపై సూచనలు, సలహాలు ఇస్తారు. మూడో దశలో పంట నూర్పిడి, విత్తనాలను నాణ్యంగా తయారు చేసుకోవడం వంటి వాటిపై శిక్షణ పూర్తి చేస్తారు. నాణ్యమైన విత్తనం రైతులకు ఇవ్వడంలేదు జిల్లాలో గ్రామ విత్తనోత్పత్తి పథకానికి ఇస్తున్న విత్తనం కాగితాల్లో మాత్రం సర్టిఫైడ్ , పౌండేషన్ సీడ్ ఇస్తున్నట్లు పైకి చెబుతున్నా, ఎక్కడ కూడా ఇవ్వడం లేదని, సాధారణంగా సబ్సిడీపై ఇచ్చే వాటినే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అనంతపురం జిల్లా కణేకల్లు పరిశోధన స్థానం నుంచి వరి విత్తనాలు తీసుకువచ్చి జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట మండలాల్లో రైతులకు పంపిణీ చేశారు. అవి సాగుకంటే ముందుగానే మోసులొచ్చి, కుళ్లిపోయి ఉండడంతో వ్యతిరేకించారు. తరువాత సాధారణ విత్తనాలు ఇచ్చారు. రెండు సీజన్లలో రూ.5 లక్షలు వృథా ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో గ్రామ విత్తనోత్పత్తి పథకం అమలవుతోంది. ఖరీఫ్‌లో 100 గ్రామాల్లో, రబీలో 100 గ్రామాల్లోను దీనిని అమలు చేస్తున్నారు. . కానీ అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల లక్ష్యం నెరవేరడం లేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.2500 ఖర్చు చేస్తారు. ఈ లెక్కన ఖరీఫ్‌కు రూ. 2.50లక్షలు, రబీకి రూ.2.50లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినా అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకురాలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పథకం కొందరు అధికారుల అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది. దీనిని అడ్డుపెట్టుకుని విత్తనాలు, నిధులు అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోపాలున్నాయి...సరి చేస్తాం పథకంలో లోపాలు ఉన్నాయి. జిల్లా వ్యవసాయశాఖ కార్యాయానికి సీడ్ సర్టిఫికేషన్ వివరాలు సంబంధిత సంస్థ అందిస్తుంది. లోకల్‌గా దొరికే విత్తనాలు, విత్తన కాయల పట్ల రైతులు మొగ్గు చూపడంలేదు. కొత్త రకాలపై దృష్టి పెడుతున్నా విత్తనాభివృద్ధి సంస్థ అందించలేకపోతోంది. నాణ్యమైనవి ఇచ్చేలా చూస్తాం. నిధులు పక్కదారి పట్టడంలేదు.వీటిని పథకం కోసమే ఖర్చు చేస్తున్నారు. –జ్ఞానశేఖర్, డిప్యూటీ డైరక్టర్,పధక పర్యవేక్షులు, జిల్లా వ్యవసాయశాఖ.