పత్తి విత్తనంపై  అధికారుల పెత్తనం | Power of cops on cotton seed | Sakshi
Sakshi News home page

పత్తి విత్తనంపై  అధికారుల పెత్తనం

Published Fri, Mar 22 2019 1:19 AM | Last Updated on Fri, Mar 22 2019 1:19 AM

Power of cops on cotton seed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజీ–2 పత్తి విత్తనం విఫలమైంది. గులాబీ రంగు పురుగు సోకి పత్తి పంట నాశనమవుతోంది. దీంతో పత్తి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం బీజీ–2 పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కోసం విత్తన ప్రణాళికను ఖరారు చేసే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే జిల్లాల నుంచి ఇండెంట్లు తెప్పించుకుంది. ఆ ప్రకారం విత్తనాలను సరఫరా చేయాలని యోచిస్తోంది. వ్యవసాయశాఖ తాజా ప్రణాళిక ప్రకారం వచ్చే ఖరీఫ్‌కు ఏకంగా 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. విస్మయం కలిగించే విషయమేంటంటే, గతేడాది కేవలం కోటి ప్యాకెట్లు మాత్రమే సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి అదనంగా 29 లక్షల ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్తి విత్తన కంపెనీలకు బాసటగా నిలిచేలా అధికారుల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  

90 పత్తి విత్తన కంపెనీలకు ఆర్డర్లు.. 
తెలంగాణలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, 2018–19 ఖరీఫ్‌లో ఏకంగా 44.30 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే గులాబీ రంగు పురుగు కారణంగా ఉత్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయిందని నిర్ధారించారు. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి కావాలి. కానీ అనేకచోట్ల ఈసారి 6–7 క్వింటాళ్లకు మించి ఉత్పత్తి కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండగా, పత్తిని ప్రత్యేకంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం అంతుబట్టడంలేదు. ఈసారి 90 పత్తి విత్తన కంపెనీలకు విత్తన ప్యాకెట్లను సరఫరా చేసే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. ఇదిలావుం టే అనుమతిలేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కూడా కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టే పనిలో నిమగ్నమయ్యాయి. బీజీ–2, బీజీ–3 విత్తనాలు చూడడానికి ఒకేరకంగా ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తు పట్టడం కష్టమైన వ్యవహారం. దీన్ని ఆసరాగా చేసుకొని కంపెనీలు బీజీ–3 విత్తనాలను కూడా మార్కెట్లోకి దించుతున్నాయి. వాటిపై దాడులు చేస్తున్నామని చెబుతు న్నా పరోక్షంగా ఆయా కంపెనీలకు కొందరు అధికారులు మద్దతుగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి. 

ఇతర విత్తనాలు 8 లక్షలు.. 
ఇదిలావుంటే వచ్చే ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రకటించింది. ఖరీఫ్‌కు ఏఏ విత్తనాలు అవసరమో జిల్లాల నుంచి ఇండెంట్‌ తెప్పించుకుంది. ఆ ప్రకారం ఖరీఫ్‌కు 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేస్తారు. మూడు లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు. అలాగే 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలు, 20 వేల క్వింటాళ్ల కంది, లక్ష క్వింటాళ్ల జీలుగ, 80 వేల క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను కూడా సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను కూడా ఖరీఫ్‌ కోసం అందజేస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement