ఉత్తుత్తి సమావేశాలు..
►రైతులను చైతన్యపరచడంలో అధికారులు విఫలం
►అందనినాణ్యమైన విత్తనం
►ఏటా రూ.5 లక్షలు వృథా
జిల్లాలో గ్రామవిత్తనోత్పత్తి పథకం సీడ్‌లెస్ పథకంగా మిగిలిపోతోంది. రైతులను ప్రోత్సహించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి ఏటా ఖరీఫ్,రబీలో ఈ పథకాన్ని జిల్లా వ్యవసాయశాఖ ఆర్భాటంగా ఆరంభిస్తున్నా...చివరికి వచ్చే సరికి తస్సుమంటోంది. ఓ అధికారి అయితే అందివచ్చిన అవకాశాన్ని పథక శిక్షణల పేరుతో సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు మిన్నకుండి పోయారంటే ఇది ఏవిధంగా అమలవుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కడప అగ్రికల్చర్ : ప్రతి ఏటా జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లకుగాను 200 గ్రామాల్లో ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా దీనిని అమలు చేస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు గ్రామంలో అభ్యుదయ రైతులను గుర్తిస్తారు. అందులో ఒక్కో పంటను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఈ యూనిట్‌లో 25 మంది రైతులను ఎంపిక చేసి వారికి 7 1/2 క్వింటాళ్ల నాణ్యమైన సర్టిఫికేషన్ సీడ్(నాణ్యతతో కూడిన విత్తనం)ను అందిస్తారు. మొదటి దశ సాగులో విత్తనశుద్ధి, మొలకశాతం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. రెండో దశలో పంటలో సస్యరక్షణ, కల్తీ మొక్కలను ఏరివేయడం వంటి వాటిపై సూచనలు, సలహాలు ఇస్తారు. మూడో దశలో పంట నూర్పిడి, విత్తనాలను నాణ్యంగా తయారు చేసుకోవడం వంటి వాటిపై శిక్షణ పూర్తి చేస్తారు.
నాణ్యమైన విత్తనం రైతులకు ఇవ్వడంలేదు
జిల్లాలో గ్రామ విత్తనోత్పత్తి పథకానికి ఇస్తున్న విత్తనం కాగితాల్లో మాత్రం సర్టిఫైడ్ , పౌండేషన్ సీడ్ ఇస్తున్నట్లు పైకి చెబుతున్నా, ఎక్కడ కూడా ఇవ్వడం లేదని, సాధారణంగా సబ్సిడీపై ఇచ్చే వాటినే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అనంతపురం జిల్లా కణేకల్లు పరిశోధన స్థానం నుంచి వరి విత్తనాలు తీసుకువచ్చి జిల్లాలోని ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట మండలాల్లో రైతులకు పంపిణీ చేశారు. అవి సాగుకంటే ముందుగానే మోసులొచ్చి, కుళ్లిపోయి ఉండడంతో వ్యతిరేకించారు. తరువాత సాధారణ విత్తనాలు ఇచ్చారు.
రెండు సీజన్లలో రూ.5 లక్షలు వృథా
ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో గ్రామ విత్తనోత్పత్తి పథకం అమలవుతోంది. ఖరీఫ్‌లో 100 గ్రామాల్లో, రబీలో 100 గ్రామాల్లోను దీనిని అమలు చేస్తున్నారు. . కానీ అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల లక్ష్యం నెరవేరడం లేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.2500 ఖర్చు చేస్తారు. ఈ లెక్కన ఖరీఫ్‌కు రూ. 2.50లక్షలు, రబీకి రూ.2.50లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినా అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకురాలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ పథకం కొందరు అధికారుల అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది. దీనిని అడ్డుపెట్టుకుని విత్తనాలు, నిధులు అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లోపాలున్నాయి...సరి చేస్తాం
పథకంలో లోపాలు ఉన్నాయి. జిల్లా వ్యవసాయశాఖ కార్యాయానికి సీడ్ సర్టిఫికేషన్ వివరాలు సంబంధిత సంస్థ అందిస్తుంది. లోకల్‌గా దొరికే విత్తనాలు, విత్తన కాయల పట్ల రైతులు మొగ్గు చూపడంలేదు. కొత్త రకాలపై దృష్టి పెడుతున్నా విత్తనాభివృద్ధి సంస్థ అందించలేకపోతోంది. నాణ్యమైనవి ఇచ్చేలా చూస్తాం. నిధులు పక్కదారి పట్టడంలేదు.వీటిని పథకం కోసమే ఖర్చు చేస్తున్నారు.
–జ్ఞానశేఖర్, డిప్యూటీ డైరక్టర్,పధక పర్యవేక్షులు, జిల్లా వ్యవసాయశాఖ.