అదనులో అందేనా?!
►జూన్ 2 నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన
►ఇప్పటి వరకూ జిల్లాకు చేరని పరిహారం వివరాలు
►రూ.1,032.69 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు
► రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది రూ.82.34 కోట్లు మాత్రమే
► ఇన్‌పుట్, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి రైతులకు అన్యాయం!
►ప్రభుత్వ మోసపూరిత చర్యలతో అన్నదాతలకు రూ.434 కోట్ల మేర నష్టం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) ముందస్తు వర్షాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో పెట్టుబడి కోసం అవస్థలు పడుతున్నారు. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందజేయలేదు. ఖరీఫ్‌లో రైతులు పంటసాగుకు సిద్ధమయ్యేలోపు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల పామిడి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ అతీగతీ లేదు. పైగా అధికారులు రూ.1,032.69 కోట్లతో ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.82.34 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోనుంది.
గడిచిన ఖరీఫ్(2016)లో జిల్లా రైతులు 6.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున వెచ్చించారు. వర్షాభావం కారణంగా పంట తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే కంది, జొన్న, పత్తి తదితర పంటల ద్వారా మరో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. మొత్తమ్మీద రైతులకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు నష్టం వివరాలను తెప్పించుకుని రూ.1,070 కోట్లతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. చివరకు రూ.1,032.69 కోట్లతో తుది నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇందులో రూ.516.345 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రం కూడా ఈ మేరకు ఇవ్వాలి. కానీ రూ.82.34 కోట్లను మాత్రమే ఇస్తోంది. తక్కిన రూ.434 కోట్లను ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్ము ఇన్çపుట్‌సబ్సిడీ లెక్కల్లో కలిపి అందజేయనుంది. ఈ మోసపూరిత చర్యతో రైతులకు రూ.434కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ బీమా కింద వేరుశనగకు రూ.367 కోట్లు, ఇతర పంటలకు రూ.67కోట్లు మంజూరైంది. ఈ సొమ్ముపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. అయినా ఇన్‌పుట్‌లో కలిపేసి రైతులను దగా చేస్తోంది. దీనివల్ల 6,25,050 మంది వేరుశనగ, 3,635 మంది ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అన్యాయం జరగనుంది.
చరిత్రలో తొలి మోసం
ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో వేటికవే లెక్కలు కట్టి ప్రభుత్వాలు రైతులకు అందజేసేవి. చరిత్రలో తొలిసారిగా రైతులకు, బీమా కంపెనీకి మాత్రమే సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చింది. తనకు ఏమాత్రమూ సంబంధం లేని సొమ్మును సొంతమన్నట్లు భావించి రైతులను దగా చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ రెండింటినీ కలిపి లెక్కగట్టి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఇదే!
ఖరీఫ్ మొదలైనా... : ఏప్రిల్‌లో పామిడికి విచ్చేసిన చంద్రబాబు ఖరీఫ్ మొదలయ్యేలోపు పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ నెల మొదటి నుంచి బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తున్నారు. రైతులు విత్తనకాయలు కొనుగోలు చేస్తున్నారు. కళ్యాణదుర్గంతో పాటు పలుచోట్ల పొలాల్లో విత్తు కూడా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు అందలేదు. నిజానికి గతేడాది అక్టోబరు 10లోపే ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు అందజేయాలి. ఈ సొమ్మును బజాజ్ అలయంజ్ కంపెనీ అక్టోబరులోనే జమ చేసినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయకుండా ప్రభుత్వమే పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు గతేడాది ఖరీఫ్ ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయం. జూన్ 2 నుంచి పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ మొదటి విడతలో ఎంత మొత్తాన్ని, ఎంతమంది రైతులకు ఇవ్వబోతున్నారు? ఎప్పటిలోగా జమ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు.
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన రైతులు : ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లంకెపెట్టి పరిహారం పంపిణీ చేస్తే వెంటనే పూర్తి ఆధారాలతో కోర్టును ఆశ్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. రూ.1,032 కోట్లతో అధికారులు పంపిన నివేదికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఇన్సూరెన్స్ సొమ్మును ఇందులో కలపడం వంటి రికార్డులను పూర్తిస్థాయిలో సేకరించి హైకోర్టును ఆశ్రయిస్తామని పలువురు రైతులు ‘సాక్షి’తో తెలిపారు. వ్యవసాయాధికారులు, జిల్లా కీలక అధికారులు, ప్రభుత్వాన్ని కేసులో చేరుస్తామని చెబుతున్నారు.