Harvesting crops
-
ఖరీఫ్ సాగులో సరికొత్త విప్లవం.... ఎమ్.టి.యు 1318 వరి రకం
-
ఆదర్శ గ్రామం ..పూర్తి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం
-
కూరగాయల సాగు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న రైతులు
-
మహాగని సాగు కోట్లలో లాభం
-
అవగాహన, ప్రణాళికతో పంట సాగు చేసుకుంటే మంచి లాభాలు...
-
800 ఎకరాల్లో అరటి సాగు....లక్షల్లో లాభాలు
-
ఇంటి వద్ద ఔషధ మొక్కల సాగు.. ఆదర్శంగా నిలిచిన మహిళ
-
ధాన్యంపై దాగుడుమూతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి వరి కోతలు వచ్చే నెల మొదటివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాతావరణం అనుకూలించడంతో ఈసారి పంట దిగుబడి సంతృప్తికరంగా ఉంటుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోలు విషయమై నెలకొన్న వివాదంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నెల ప్రారంభం కాబోతున్నా.. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) సేకరించబోమని తెగేసి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరుకు సిద్ధమైందే తప్ప.. రైతులు పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో స్పష్టత ఇవ్వట్లేదు. కేంద్ర వైఖరి నేపథ్యంలో వానాకాలం పంట కొనుగోళ్ల సమయంలోనే సీఎం కేసీఆర్ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ‘రైతులదే బాధ్యత’అన్న ధోరణిలో జిల్లాల రెవెన్యూ, పౌరసరఫరాల యంత్రాంగాలు ఉన్నాయి. ఉప్పుడు బియ్యంపైనే వివాదం.. యాసంగి ధాన్యం ఎక్కువగా అధిక వేడి కారణంగా నూకలుగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి 20 ఏళ్ల కిందటే ఎఫ్‌సీఐ ఉప్పుడు బియ్యం విధానాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉప్పుడు బియ్యంకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కేంద్రమే తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సేకరించింది. అయితే కొన్నేళ్లుగా ఉప్పుడు బియ్యం తినేవాళ్లు తగ్గడంతో ఎఫ్‌సీఐ గోదా ముల్లో నిల్వలు పెరిగిపోతున్నాయనేది కేంద్రం వాదన. ఈ క్రమంలో 2020–21 యాసంగి పంట సేకరణ సమయంలో కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టంగా రాష్ట్రానికి చెప్పింది. దేశంలోని ఏ రాష్ట్రం నుంచి కూడా ఉప్పుడు బియ్యం సేకరించట్లేదని, ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ముడిబియ్యమే సేకరిస్తామని చెప్పింది. ముడిబియ్యం తప్ప ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల రాష్ట్ర మంత్రుల బృందానికి తేల్చి చెప్పారు. అయితే ‘ఉప్పుడు, ముడిబియ్యంతో సంబంధం లేకుండా రైతులు పండించిన ధాన్యా న్ని కొనాలి..’అని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు..పెరిగిన దిగుబడి గత సంవత్సరం యాసంగిలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా అత్యధికంగా 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే ఇటీవలి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి 36 లక్షల ఎకరాలకే వరిసాగు పరిమితమైంది. అయినా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం విక్రయానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లకు మార్చి నాటికే ఏర్పాట్లు మొదలవుతాయి. ఏప్రిల్ రెండో వారం నుంచే కొనుగోళ్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి అలాంటివేవీ లేవు. వరికోతలు పూర్తయిన తరువాత రైతులు ధాన్యాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? ఎవరికి విక్రయిస్తారో స్పష్టత లేకుండా పోయింది. కొన్ని మండలాల్లో రైతులతో మిల్లర్లు తక్కువ ధరకు ఒప్పందం చేసుకోవడం, విత్తనాల కోసం సీడ్ కంపెనీలు అవగాహన కుదుర్చుకోవడం మిన హా ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఏర్పాట్లూ లేవు. రైతులు నష్టపోవాల్సిందేనా? ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కనీస మద్దతు ధరతో రైతు ధాన్యాన్ని విక్రయించుకుంటాడు. ఏ– గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1,960, సాధారణ ధాన్యం రూ.1,940కి విక్రయిస్తారు. కేంద్రాలు లేనిపక్షంలో ధాన్యాన్ని నేరుగా మిల్లర్లు, దళారులు రైతుల నుం చి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు. క్వింటా లుకు రూ.400 నుంచి రూ.500 వరకు తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందని, ఇదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. ప్రభుత్వాలు డ్రామాలు ఆపాలి యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్రానిది. డ్రామా లు ఆపి, వరి ధాన్యంపై నిర్ణయం తీసుకోవాలి. – వి.ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఏఐకేఎంఎస్ మార్కెట్ సదుపాయం..మద్దతు ధర ముఖ్యం రైతులు పండించిన ధాన్యం ఎవరు కొంటున్నారనేది, ఎక్కడ అమ్ముతున్నారనేది ముఖ్యం కాదు. మార్కెట్ సదుపాయం కల్పించి, మద్దతు ధర అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. జిల్లాలో వరి తప్ప ఇతర పంటలను పండించే స్థితిలో ప్రస్తుత భూములు లేవు. అందువల్ల వరి సాగు తప్పలేదు. ఏదో విధంగా ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో పోరాటం తప్పదు. – మండారి డేవిడ్ కుమార్, రైతు కూలీసంఘం రాష్ట్ర నాయకుడు, సూర్యాపేట జిల్లా ఐకేపీ కేంద్రాలు తెరవాలి ఈ వేసవిలో 9 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రభుత్వం దొడ్డు వడ్లు సాగు చేయవద్దు అనడంతో సన్న రకం సాగు చేశా. వెంటనే ఐకేపీ కేంద్రాలు నెలకొల్పి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మిల్లుకు అమ్మితే ధర తగ్గుతుంది. ఆర్థికంగా నష్ట పోతాం. – గుండాల హనుమయ్య, రైతు, నసీంపేట (సూర్యాపేట జిల్లా) -
భారీగా పెరిగిన వరి కోత యంత్రాల అద్దె ధరలు
జగిత్యాల అగ్రికల్చర్: కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. వరికోత మెషీన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. ట్రాక్టర్ల బాడుగ భారంగా మారింది. వరికోతలకు వినియోగించే టైర్ హార్వెస్టర్ అద్దె గతేడాది గంటకు రూ.1,800–రూ.2,000 ఉండగా, డీజిల్ ధరలు పెరగడంతో ఈసారి రూ.2,300–రూ.2,500 వరకు యజమానులు పెంచేశారు. పొలాల్లో తడి ఆరక టైర్ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్ హార్వెస్టర్లను వినియోగించాల్సి వస్తోంది. అయితే ఇవి తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి అద్దెకు తీసుకొచ్చి డిమాం డ్‌ను బట్టి గంటకు రూ.3,500– రూ.4,500 వరకు వసూలు చేస్తు న్నారు. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగైంది. ఈ లెక్కన వరికోతల నిమిత్తం రాష్ట్ర రైతాంగంపై రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. తడిసిమోపెడు..: ఇదివరకు టైర్ హార్వెస్టర్‌తో ఎకరా పొలంలోని వరి పైరును గంటలో కోయిస్తే, ఇప్పుడు పొలాల్లో తేమ కారణంగా గంటన్నర పడుతోంది. హార్వెస్టర్ డ్రైవర్ మామూళ్లతో కలుపుకుని గంటకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. అదే చైన్ హార్వెస్టర్‌తో ఎకరం పైరు కోయిస్తే 2 నుంచి 2.30 గంటల వరకు సమయం పడుతోంది. అంటే.. చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు వస్తోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఒక్కో ట్రిప్పుకు గతేడాది రూ.500 ఖర్చు కాగా, ఈసారి దాదాపు రూ.వెయ్యి వరకు పెరిగింది. ధాన్యంలో తేమతోపాటు తప్ప, తాలు ఉందంటూ తిప్పలు పెడుతుండటంతో ఆరబెట్టడం, మెషీన్ల ద్వారా తూర్పార పట్టడం వంటివి చేసేందుకు మరో రూ.2 వేలు –రూ.3 వేలు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. హమాలీల కూలీ, లారీ డ్రైవర్ల మామూళ్లు.. ఇలా రైతులపై మోయలేని భారం పడుతోంది. తేమ అధికంగా ఉండే నేలల్లో ఇతర పంటలు పండించే పరిస్థితి లేక వరిసాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఖర్చులు రెట్టింపయ్యాయి వర్షాలకుతోడు సాగునీటి కాలువల ద్వారా నీరు నిరంతరం పారుతోంది. వ్యవసాయ బావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నది. దీంతో పొలాలు ఎప్పుడూ తేమగా ఉంటున్నాయి. ఫలితంగా టైర్ హార్వెస్టర్‌తో వరికోసే పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లోని వరిని చైన్ హార్వెస్టర్‌తో కోయిస్తే, దాదాపు రూ.30 వేలు ఖర్చు వచ్చింది. అంతకుముందు టైర్ హార్వెస్టర్ ఖర్చు రూ.8 వేల –రూ.9 వేలు అయ్యేది. – యాళ్ల గోపాల్‌రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా ఏమీ మిగలడం లేదు రోజూ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ రూ.104–రూ.105 మధ్య ఉంది. రెండునెలలు వరికోతలు ఉంటాయి. మున్ముందు డీజిల్ ధర ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. అందుకే హార్వెస్టర్ అద్దెలు పెంచక తప్పడంలేదు. కరోనా నేపథ్యంలో డ్రైవర్ల జీతాలతోపాటు మరమ్మతు ఖర్చులు రెట్టింపయ్యాయి. మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం కట్టడమే ఇబ్బందిగా మారింది. – శ్రీనివాస్‌రెడ్డి, హార్వెస్టర్ యజమాని, పోరండ్ల -
అదనులో అందేనా?!
►జూన్ 2 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ప్రభుత్వ ప్రకటన ►ఇప్పటి వరకూ జిల్లాకు చేరని పరిహారం వివరాలు ►రూ.1,032.69 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు ► రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది రూ.82.34 కోట్లు మాత్రమే ► ఇన్పుట్, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి రైతులకు అన్యాయం! ►ప్రభుత్వ మోసపూరిత చర్యలతో అన్నదాతలకు రూ.434 కోట్ల మేర నష్టం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ముందస్తు వర్షాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో పెట్టుబడి కోసం అవస్థలు పడుతున్నారు. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందజేయలేదు. ఖరీఫ్‌లో రైతులు పంటసాగుకు సిద్ధమయ్యేలోపు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల పామిడి సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికీ అతీగతీ లేదు. పైగా అధికారులు రూ.1,032.69 కోట్లతో ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.82.34 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోనుంది. గడిచిన ఖరీఫ్(2016)లో జిల్లా రైతులు 6.07 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. ఎకరాకు రూ.18 వేల చొప్పున వెచ్చించారు. వర్షాభావం కారణంగా పంట తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో దాదాపు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. అలాగే కంది, జొన్న, పత్తి తదితర పంటల ద్వారా మరో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. మొత్తమ్మీద రైతులకు రూ.3,700 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అధికారులు నష్టం వివరాలను తెప్పించుకుని రూ.1,070 కోట్లతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. చివరకు రూ.1,032.69 కోట్లతో తుది నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఇందులో రూ.516.345 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రం కూడా ఈ మేరకు ఇవ్వాలి. కానీ రూ.82.34 కోట్లను మాత్రమే ఇస్తోంది. తక్కిన రూ.434 కోట్లను ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్ము ఇన్çపుట్‌సబ్సిడీ లెక్కల్లో కలిపి అందజేయనుంది. ఈ మోసపూరిత చర్యతో రైతులకు రూ.434కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ బీమా కింద వేరుశనగకు రూ.367 కోట్లు, ఇతర పంటలకు రూ.67కోట్లు మంజూరైంది. ఈ సొమ్ముపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. అయినా ఇన్పుట్లో కలిపేసి రైతులను దగా చేస్తోంది. దీనివల్ల 6,25,050 మంది వేరుశనగ, 3,635 మంది ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అన్యాయం జరగనుంది. చరిత్రలో తొలి మోసం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మంజూరులో వేటికవే లెక్కలు కట్టి ప్రభుత్వాలు రైతులకు అందజేసేవి. చరిత్రలో తొలిసారిగా రైతులకు, బీమా కంపెనీకి మాత్రమే సంబంధించిన ఇన్సూరెన్స్ వ్యవహారంలో ప్రభుత్వం తలదూర్చింది. తనకు ఏమాత్రమూ సంబంధం లేని సొమ్మును సొంతమన్నట్లు భావించి రైతులను దగా చేస్తోంది. ఎకరాకు రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రెండింటినీ కలిపి లెక్కగట్టి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం ఇదే! ఖరీఫ్ మొదలైనా... : ఏప్రిల్‌లో పామిడికి విచ్చేసిన చంద్రబాబు ఖరీఫ్ మొదలయ్యేలోపు పరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ నెల మొదటి నుంచి బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తున్నారు. రైతులు విత్తనకాయలు కొనుగోలు చేస్తున్నారు. కళ్యాణదుర్గంతో పాటు పలుచోట్ల పొలాల్లో విత్తు కూడా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు అందలేదు. నిజానికి గతేడాది అక్టోబరు 10లోపే ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు అందజేయాలి. ఈ సొమ్మును బజాజ్ అలయంజ్ కంపెనీ అక్టోబరులోనే జమ చేసినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయకుండా ప్రభుత్వమే పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. దీంతో పాటు గతేడాది ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని ఇప్పటికీ ఇవ్వకపోవడం శోచనీయం. జూన్ 2 నుంచి పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. కానీ మొదటి విడతలో ఎంత మొత్తాన్ని, ఎంతమంది రైతులకు ఇవ్వబోతున్నారు? ఎప్పటిలోగా జమ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన రైతులు : ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లంకెపెట్టి పరిహారం పంపిణీ చేస్తే వెంటనే పూర్తి ఆధారాలతో కోర్టును ఆశ్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. రూ.1,032 కోట్లతో అధికారులు పంపిన నివేదికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఇన్సూరెన్స్ సొమ్మును ఇందులో కలపడం వంటి రికార్డులను పూర్తిస్థాయిలో సేకరించి హైకోర్టును ఆశ్రయిస్తామని పలువురు రైతులు ‘సాక్షి’తో తెలిపారు. వ్యవసాయాధికారులు, జిల్లా కీలక అధికారులు, ప్రభుత్వాన్ని కేసులో చేరుస్తామని చెబుతున్నారు. -
కరువు కాటేస్తోంది
కరుణించని వరుణుడు ఎండుతున్న బత్తాయి తోటలు ఇంకుతున్న భూగర్భ జలాలు హల్చల్ చేయాల్సిన కాడెద్దులు కంగారుపడుతున్నాయి... ఛల్ఛల్మని గాల్లో గింగిరీలు కొట్టాల్సిన చెర్నోకోలో చెమ్మగిల్లిపోయింది...గజ్జెల సవ్వడులతో పరుగులు తీయాల్సిన ఎడ్లబండ్లు కానరావడం లేదు...నాగలి భుజాన వేసుకోవాల్సిన రైతన్నలో అయోమయం, చేనుకుండ తీసుకుపోవాల్సిన అన్నపూర్ణల మోముల్లో వివర్ణం, పచ్చని భూముల్లో బీటలు, బోసిపోయిన పంట కాలువలు, ఎండిపోయి నల్లబారిన పండ్లతోటలు... ఇదీ ప్రస్తుతం జిల్లాలోని సాగు దుస్థితి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కరువు కమ్ముకొస్తోంది. ఒకవైపు జలాశయాలు ఎండిపోయి ఖరీఫ్‌కు నీరు రాదని తేలిపోయిన నేపథ్యంలో మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. జూలై నెలలో పడాల్సిన వర్షపాతం కంటే 43.7 శాతం తక్కువ పడింది. పశ్చిమ ప్రకాశం దాదాపు అన్ని మండలాల్లో వ ర్షాలు అతి తక్కువగా పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో వేసిన పంటలు గిడసబారిపోతున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాకు 562 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. తిండిగింజలు రూ.113 కోట్లు, పప్పు ధాన్యాలు రూ.276 కోట్లు, ఇతర పంటలు రూ. 89 కోట్లుపోగా, ఉద్యానవన పంటలకు రూ.62 కోట్లు నష్టం వచ్చింది. రబీలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ ఏడాది ఖరీఫ్ ఉండదని కృష్ణాబోర్డు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాల్లో మాగాణిలో వరి వేసే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటలకు కూడా అవకాశం లేదు. మరోవైపు పొగాకు సాగు తగ్గించేశారు. అక్కడ కూడా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సి ఉంది. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఉద్యానవన పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితి కనపడుతోంది. యర్రగొండపాలెం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో మొత్తం 56,086ఎకరాల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా 19106 ఎకరాల్లో మాత్రమే రైతులు తమ పొలాల్లో పంటలను విత్తుకున్నారు. ప్రత్తి పండించే రైతుల పరిస్థితి మరింతదారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు గిడసబారి పోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎర్రతెగులు సోకటందో ఆ పంటను రైతులు దున్నేసుకున్నారు. ఫలితంగా రైతులకు దాదాపు రూ 12 కోట్ల మేరకు నష్టపోవాల్సి వచ్చింది. కంది పంట మొలక దశలోనే నేలపాలయ్యే పరిస్థితి ఉందని పలువురు రైతులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో బత్తాయి రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు సాగు చేస్తే సకాలంలో వర్షాలు కురవక 600 అడుగుల్లో బోర్లు వేసినా నీరు పడక తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేకపోవటంతో రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది. నాలుగు సంవత్సరాల క్రితం ఎకరాకు సుమారు 10 నుంచి 12టన్నుల వరకు దిగుబడి రాగా, ఇప్పుడు ఏడాది 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తోంది. మరికొన్ని చెట్లు ఎండు తెగులు సోకి కాయ పరిమాణం సోకి రంగు మారటంతో వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపటం లేదు. వడగాల్పులు వీస్తుండటంతో కాయ ఊరక, రసం లేక బరువు తగ్గి చిన్నవిగా వస్తున్నాయి. కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడులో చెరువుల్లో చుక్క నీరులేక 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గల నిమ్మతోటలు నిలువునా ఎండి పోవడంతో రైతులు నరికి కాల బెడుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలు వలస బాట పట్టాయి. బత్తాయి నిమ్మ, చెట్లు నిలువునా ఎండిపోయాయి. నీళ్లులేక కనిగిరి, వెలిగండ్ల మండలాల్లో బత్తాయి చెట్లను నరికేశారు. + కొండపిలో పశువులకు సైతం గ్రాసం కొరత ఏర్పడింది. వర్షపాతం పూర్తి స్దాయిలో పడిపోయింది. చేలన్నీ ఎడారులను తలపిస్తున్నాయి. ఇక్కడ ఖరీఫ్ సీజన్లో 16,998 హెక్టార్ల నార్మల్ ఏరియాలో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికీ మొత్తం 5 వేల హెక్టార్లలో కూడా రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. దర్శి నియోజకవర్గంలో అడపా దడపా కురిసిన చిరుజల్లులకు కొందరు రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేసి వేల రూపాయలు నష్టపోయారు. వేసిన విత్తనాలు మొలవక, చేసిన కృషి వృథా అయి అప్పులు పెరిగి అల్లాడుతున్నారు. చెరువులు ఎండిపోయి, బావులు, బోర్లు అడుగంటి గొంతు తడుపుకునేందుకు కూడా గుక్కెడు నీరు లభించక ప్రజలు విలవిల్లాడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆకాశం మబ్బులుగా ఉన్నా సరైన వర్షం పడిన దాఖలు లేవు. గత రెండు సంవత్సరాల నుంచి చేతి నిండా పని ఉన్న కూలీలు నేడు ఇబ్బందులకు గురవుతున్నారు. -
కర్నూలు సోనాకు గడ్డుకాలం
ఆళ్లగడ్డ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా చినుకు జాడ లేకపోవడం వరి రైతును ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు పొందిన కర్నూలు సోనా(బీపీటీ 5204) సాగు ప్రశ్నార్థకమవుతోంది. సన్న బియ్యం అంటే ముందుగా గుర్తొచ్చేది కర్నూలు సోనాయే. జిల్లాలో దాదాపు 1.03 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుండగా.. సకాలంలో నీరొస్తే 70 శాతం విస్తీర్ణంలో సోనా పండిస్తారు. రైతులు ముఖ్యంగా తుంగభద్ర, శ్రీశైలం డ్యాంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం నిండి దిగువకు నీరు విడుదల చేస్తే సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్ 0 నుంచి 120 కిలోమీటర్ల వరకు సాగునీరు అందుతుంది. అయితే తుంగభద్రలో నీటి మట్టం అంతంతే కావడంతో పరిస్థితి గందరగోళానికి తావిస్తోంది. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువలకు నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆల్మట్టి డ్యాం నిండకపోవడం, దాని కిందనున్న నారాయణపుర్, జూరాల ప్రాజెక్టులు వెలవెలబోతుండటంతో శ్రీశైలం డ్యాం జలకళ సంతరించుకునే అవకాశం ఇప్పట్లో లేనట్లేననే తెలుస్తోంది. వరి ఎక్కువగా కేసీ కెనాల్, తెలుగుగంగ, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎస్సార్బీసీ కాలువలు, చెరువుల కింద ఆయకట్టు పొలాల్లో సాగు చేయడం జరుగుతోంది. డ్యాంలలో కనీస నీటి మట్టం కూడా లేకపోవడంతో కర్నూలు సోనా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కర్నూలు సోనా సాగుకు సీజన్ ఇదే.. కర్నూలు సోనా సాగు చేయాలంటే జూలై 10 నుంచి 20వ తేది లోపు నారు పెంచాలి. నారు 35 నుంచి 40 రోజులకు వచ్చే సరికి నాట్లు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు చివరి నాటికి నాట్లు పూర్తి చేయాలి. ఆలస్యంగా నారు పోసి నాట్లు వేస్తే వరి పంట పొట్ట దశకు వచ్చే సరికి ఉష్ణోగ్రతలు తగ్గిపోయి దోమపోటు, అగ్గి తెగులుతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ కారణంగా రైతులు సాగునీటి విడుదల ఆలస్యమైతే.. కర్నూలు సోనా సాగుకు నీళ్లొదులుకుంటారు. స్వల్పకాలిక పంటలుగా ఐఎన్ఆర్-64, జేజీఎల్ 1470, ఎంటీయూ 1001 తదితర రకాలను సాగు చేస్తారు. కాలువలకు నీరు విడుదల కాని సమయంలో రైతులు వర్షం వస్తే గడ్డనారు పెంచుతారు. కనీసం ఈ సంవత్సరం గడ్డనారు పెంచేందుకు అవసరమైన వర్షం కూడా కురవకపోవడంతో రైతులు కర్నూలు సోనా సాగు ఆశలను వదులుకున్నారు. ఆలస్యంగా నీటి విడుదల జరిగితే ముతక రకాలైన స్వల్పకాలిక పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బోర్ల కింద మాత్రమే కర్నూలు సోనా సాగవుతోంది. ఆలస్యమైతే స్వల్పకాల పంటలే మేలు కర్నూలు సోనా సీజన్ దాటిన తర్వాత కాలువలకు నీరు వస్తే స్వల్పకాలిక పంటలు సాగు చేయడం మేలు. దీర్ఘకాలిక వరి వంగడాలను సాగు చేస్తే తెగుళ్ల ప్రభావంతో పాటు పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. - వరప్రసాద్, ఏడిఏ -
వస్తాండ్రు.. చూస్తాండ్రు.. పోతాండ్రు!
డిచ్పల్లి: ఏటా పంటలు సాగు చేస్తున్నాం.. నష్టపోతూనే ఉన్నాం.. నష్టం జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు వచ్చి చూస్తున్నారు.. పోతున్నారు. అయితే ఇప్పటి వరకు నష్ట పరిహారం అందించి ఆదుకున్నవారు ఎవరూ లేరూ.. అంటూ బాధిత రైతులు కేంద్ర కమిటి సభ్యుల ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి తాము బాధపడుతుంటే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాం..పరిహారం అందేలా చూస్తామని హామీలు గుప్పిస్తారు, గొప్పలు చెబుతారే తప్ప ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా వరుసగా పంటలు నష్ట పోతున్నామని, కానీ ఇప్పటి వరకు ఒక్కరూపాయి నష్ట పరిహారం అందలేదని వాపోయారు. పంటల బీమా చేసుకోండి.. నష్టం వస్తే ఉపయోగపడుతుందని చెబుతూ బీమా సొమ్మును తీసుకుంటున్నారు కానీ పరి హారం ఇవ్వడం లేదన్నారు. వ్యక్తిగతంగా బీమా సొమ్ము వసూలు చేస్తున్నప్పుడు, గ్రామాన్ని, మండలాన్ని యూనిట్ గా తీసుకుని పరిహారం అందిస్తామని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వ నిబంధనల్లో ఎక్కడ లోపం ఉందో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా కేంద్రప్రభుత్వానికి నివేదిక అం దజేస్తామని కేంద్ర పరిశీలన కమిటీ కన్వీనర్ డాక్టర్ మోహన్‌లాల్ హామీ ఇచ్చారు. పరిహారం కూడా సత్వరం అందేలా చూస్తామన్నారు. ఒక్క గ్రామంలోనే 1800 ఎకరాల్లో పంట నష్టం సిరికొండ మండలం కొండూర్ గ్రామంలోనే సుమారు 1800 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వానకు పంటలు పూర్తిగా నష్టపోయి ఒక్క మా కుటుంబంలోనే సుమారు 15 లక్షలు నష్టపోయాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప, ఇప్పటికీ రూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి. -చల్ల గోపాల్‌రెడ్డి, కొండూర్ గ్రామం, సిరికొండ మండలం పంటను అలాగే వదిలేశాను రబీలో పది ఎకరాల్లో వరి పంటను వేశాను. రేపు పంట కోస్తమని అనంగా వడగళ్లు కురిసి పంట పూర్తిగా నేల పాలైంది. కోయడానికి కూడా రాకపోవడంతో అలాగే పొలంలో వదిలేశాను. వంద శాతం నష్టం జరిగింది. ఎకరానికి రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. మా ఊర్లో 140 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. -చాగంటి లక్ష్మన్, కలిగోట్, జక్రాన్‌పల్లి మండలం -
ఖరీఫ్..సర్వం సన్నద్ధం
నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ‘‘జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 4లక్షల 59వేల 74 హెక్టార్లు. అయితే గత ఖరీఫ్‌లో 6లక్షల 2వేల 799హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి లక్షా 92వేల 185హెక్టార్లు. అత్యధికంగా పత్తి 3లక్షల 35వేల 976 హెక్లార్లు కాగా మిగతావి కంది, పెసర, ఆముదం, వేరుశనగ వంటి ప్రధాన పంటలు సాగు చేశారు. అయితే ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే మరో 10 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 6లక్షల 70 వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా వరి 2లక్షల హెక్టార్లు, పత్తి 3లక్షల 50 హెక్టార్లు, కంది 32వేల హెక్టార్లు, పెసర 38వేల హెక్టార్లు, వేరుశనగర 7వేల హెక్టార్లలో, ఆముదం 3200 హెక్లార్లతో పాటు ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది’’. విత్తనాలు సిద్ధం చేశాం ‘‘కేంద్ర ప్రభుత్వం పదేళ్లపై బడిన వరి వంగడాలకు సబ్సిడీని ఎత్తివేసింది. సబ్సిడీ లేని వరి విత్తనాలు రైతులకు అందించేందుకు 38 వేల 432 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాం. బీపీటీ 5204 రకం 18వేల క్వింటాళ్లు, ఎంటీయూ 1010 రకం 20 వేల క్వింటాళ్లు, ఎంటీయూ 7029 రకం 332 క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్ రకం 100 క్వింటాళ్లను సిద్ధం చేశాం. దాంతో పాటు 49 క్వింటాళ్ల మినుములు, 752 క్వింటాళ్ల జనుము విత్తనాలు రెడీగా ఉంచాం. దాంతో పాటు సబ్సిడీపై అందించేందుకు 1200 క్వింటాళ్ల కంది, 1000 క్వింటాళ్ల పెసర, 2500 క్వింటాళ్ల వేరుశనగ, 400 క్వింటాళ్ల మొక్కజొన్న, 200 క్వింటాళ్ల జొన్నతో పాటు ఆము దం, పిల్లి పెసర విత్తనాలను సిద్ధం చేశాం. వీటన్నింటినీ ఏపీ సీడ్స్ వద్ద అందుబాటులో ఉంచడంతోపాటు అన్ని మండల కేంద్రాలలోని విక్రయ కేంద్రాలకు తరలించాం. అదేవిధంగా జిల్లాలో గత ఏడాది 13లక్షల 45వేల 404బీటి పత్తి విత్తనాలను సరఫరా చేశాం. కానీ ఈ ఖరీఫ్‌లో 17లక్షల ప్యాకెట్లను జిల్లాకు తెప్పిం చడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా బీటీ పత్తి విత్తనాలను మార్కెట్లో ఉంచాం. ఇంకా రెండు మూడు రోజులలో మొత్తం బీటీ పత్తి విత్తనాలు జిల్లాకు రానున్నాయి. రైతులు బ్రాండెడ్ కంపనీ విత్తనాలని ఎగబడకుండా అన్ని రకాల బీటీ పత్తి విత్తనాలను వేసుకోవాలి. అన్ని రకాల విత్తనాలు బాగానే దిగుబడులు వస్తాయి’’. ఎరువులు అందుబాటులోనే... ‘‘జిల్లాలో ఇప్పటికే యూరియా 16638 టన్నులు, డీఏపీ 6110 టన్నులు, ఎంఓపీ 2640 టన్నులు, ఎస్ఎస్పీ 360 టన్నులు, కాంప్లెక్స్ 16244 టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో యూరియా 1,81,762 టన్నులు, డీఏపీ 72,704 టన్నులు, ఎంఓపీ 45,441టన్నులు, ఎస్ఎస్పీ 7276టన్నులు, కాంప్లెక్స్ 1,09,058టన్నులు ఎరువులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిం చాము. సీజన్ ప్రారంభం కాగానే నెలనెల వారిగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం’’. భూసార పరీక్షలు ‘‘జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి రైతుల పొలాలలో మట్టి నమూనాలను సేకరించి భూ సార పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో మొత్తం 11వేల నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహించిన అనంతరం పరీక్షల ఫలితాలను ఆయా రైతుల సెల్ఫోన్లకు తెలుగులో మెసేజ్ రూపంలో పంపిస్తున్నాం. ఫలితాలను బట్టి ఆ భూమిలో ఏఏ పంటలు వేసుకోవాలి. ఏ మోతాదులో ఏ ఎరువులను వాడాలి అనే అంశాలను కూడా రైతులకు సూచిస్తున్నాం’’.