కర్నూలు సోనాకు గడ్డుకాలం
ఆళ్లగడ్డ : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా చినుకు జాడ లేకపోవడం వరి రైతును ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు పొందిన కర్నూలు సోనా(బీపీటీ 5204) సాగు ప్రశ్నార్థకమవుతోంది. సన్న బియ్యం అంటే ముందుగా గుర్తొచ్చేది కర్నూలు సోనాయే. జిల్లాలో దాదాపు 1.03 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుండగా.. సకాలంలో నీరొస్తే 70 శాతం విస్తీర్ణంలో సోనా పండిస్తారు. రైతులు ముఖ్యంగా తుంగభద్ర, శ్రీశైలం డ్యాంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం నిండి దిగువకు నీరు విడుదల చేస్తే సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్ 0 నుంచి 120 కిలోమీటర్ల వరకు సాగునీరు అందుతుంది.
అయితే తుంగభద్రలో నీటి మట్టం అంతంతే కావడంతో పరిస్థితి గందరగోళానికి తావిస్తోంది. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువలకు నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆల్మట్టి డ్యాం నిండకపోవడం, దాని కిందనున్న నారాయణపుర్, జూరాల ప్రాజెక్టులు వెలవెలబోతుండటంతో శ్రీశైలం డ్యాం జలకళ సంతరించుకునే అవకాశం ఇప్పట్లో లేనట్లేననే తెలుస్తోంది. వరి ఎక్కువగా కేసీ కెనాల్, తెలుగుగంగ, హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎస్సార్బీసీ కాలువలు, చెరువుల కింద ఆయకట్టు పొలాల్లో సాగు చేయడం జరుగుతోంది. డ్యాంలలో కనీస నీటి మట్టం కూడా లేకపోవడంతో కర్నూలు సోనా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కర్నూలు సోనా సాగుకు సీజన్ ఇదే..
కర్నూలు సోనా సాగు చేయాలంటే జూలై 10 నుంచి 20వ తేది లోపు నారు పెంచాలి. నారు 35 నుంచి 40 రోజులకు వచ్చే సరికి నాట్లు వేయాల్సి ఉంటుంది. ఆగస్టు చివరి నాటికి నాట్లు పూర్తి చేయాలి. ఆలస్యంగా నారు పోసి నాట్లు వేస్తే వరి పంట పొట్ట దశకు వచ్చే సరికి ఉష్ణోగ్రతలు తగ్గిపోయి దోమపోటు, అగ్గి తెగులుతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ కారణంగా రైతులు సాగునీటి విడుదల ఆలస్యమైతే.. కర్నూలు సోనా సాగుకు నీళ్లొదులుకుంటారు. స్వల్పకాలిక పంటలుగా ఐఎన్‌ఆర్-64, జేజీఎల్ 1470, ఎంటీయూ 1001 తదితర రకాలను సాగు చేస్తారు.
కాలువలకు నీరు విడుదల కాని సమయంలో రైతులు వర్షం వస్తే గడ్డనారు పెంచుతారు. కనీసం ఈ సంవత్సరం గడ్డనారు పెంచేందుకు అవసరమైన వర్షం కూడా కురవకపోవడంతో రైతులు కర్నూలు సోనా సాగు ఆశలను వదులుకున్నారు. ఆలస్యంగా నీటి విడుదల జరిగితే ముతక రకాలైన స్వల్పకాలిక పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బోర్ల కింద మాత్రమే కర్నూలు సోనా సాగవుతోంది.
ఆలస్యమైతే స్వల్పకాల పంటలే మేలు
కర్నూలు సోనా సీజన్ దాటిన తర్వాత కాలువలకు నీరు వస్తే స్వల్పకాలిక పంటలు సాగు చేయడం మేలు. దీర్ఘకాలిక వరి వంగడాలను సాగు చేస్తే తెగుళ్ల ప్రభావంతో పాటు పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.
- వరప్రసాద్, ఏడిఏ