భారీగా పెరిగిన వరి కోత యంత్రాల అద్దె ధరలు  | Paddy Harvesters Rental Prices Increased In Telangana | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన వరి కోత యంత్రాల అద్దె ధరలు 

Oct 27 2021 3:17 AM | Updated on Oct 27 2021 12:19 PM

Paddy Harvesters Rental Prices Increased In Telangana - Sakshi

కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. వరికోత మెషీన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి.

జగిత్యాల అగ్రికల్చర్‌: కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. వరికోత మెషీన్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. ట్రాక్టర్ల బాడుగ భారంగా మారింది. వరికోతలకు వినియోగించే టైర్‌ హార్వెస్టర్‌ అద్దె గతేడాది గంటకు రూ.1,800–రూ.2,000 ఉండగా, డీజిల్‌ ధరలు పెరగడంతో ఈసారి రూ.2,300–రూ.2,500 వరకు యజమానులు పెంచేశారు. పొలాల్లో తడి ఆరక టైర్‌ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్‌ హార్వెస్టర్లను వినియోగించాల్సి వస్తోంది.

అయితే ఇవి తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి అద్దెకు తీసుకొచ్చి డిమాం డ్‌ను బట్టి గంటకు రూ.3,500– రూ.4,500 వరకు వసూలు చేస్తు న్నారు. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిసాగైంది. ఈ లెక్కన వరికోతల నిమిత్తం రాష్ట్ర రైతాంగంపై రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశముంది. 

తడిసిమోపెడు..:
ఇదివరకు టైర్‌ హార్వెస్టర్‌తో ఎకరా పొలంలోని వరి పైరును గంటలో కోయిస్తే, ఇప్పుడు పొలాల్లో తేమ కారణంగా గంటన్నర పడుతోంది. హార్వెస్టర్‌ డ్రైవర్‌ మామూళ్లతో కలుపుకుని గంటకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. అదే చైన్‌ హార్వెస్టర్‌తో ఎకరం పైరు కోయిస్తే 2 నుంచి 2.30 గంటల వరకు సమయం పడుతోంది. అంటే.. చైన్‌ హార్వెస్టర్‌తో కోయిస్తే దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు వస్తోంది. ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లేందుకు ఒక్కో ట్రిప్పుకు గతేడాది రూ.500 ఖర్చు కాగా, ఈసారి దాదాపు రూ.వెయ్యి వరకు పెరిగింది.

ధాన్యంలో తేమతోపాటు తప్ప, తాలు ఉందంటూ తిప్పలు పెడుతుండటంతో ఆరబెట్టడం, మెషీన్ల ద్వారా తూర్పార పట్టడం వంటివి చేసేందుకు మరో రూ.2 వేలు –రూ.3 వేలు రైతులు వెచ్చించాల్సి వస్తోంది. హమాలీల కూలీ, లారీ డ్రైవర్ల మామూళ్లు.. ఇలా రైతులపై మోయలేని భారం పడుతోంది. తేమ అధికంగా ఉండే నేలల్లో ఇతర పంటలు పండించే పరిస్థితి లేక వరిసాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.

ఖర్చులు రెట్టింపయ్యాయి 
వర్షాలకుతోడు సాగునీటి కాలువల ద్వారా నీరు నిరంతరం పారుతోంది. వ్యవసాయ బావుల నుంచి నీరు పైకి ఉబికి వస్తున్నది. దీంతో పొలాలు ఎప్పుడూ తేమగా ఉంటున్నాయి. ఫలితంగా టైర్‌ హార్వెస్టర్‌తో వరికోసే పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లోని వరిని చైన్‌ హార్వెస్టర్‌తో కోయిస్తే, దాదాపు రూ.30 వేలు ఖర్చు వచ్చింది. అంతకుముందు టైర్‌ హార్వెస్టర్‌ ఖర్చు రూ.8 వేల –రూ.9 వేలు అయ్యేది.
– యాళ్ల గోపాల్‌రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా

ఏమీ మిగలడం లేదు 
రోజూ డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం లీటర్‌ రూ.104–రూ.105 మధ్య ఉంది. రెండునెలలు వరికోతలు ఉంటాయి. మున్ముందు డీజిల్‌ ధర ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. అందుకే హార్వెస్టర్‌ అద్దెలు పెంచక తప్పడంలేదు. కరోనా నేపథ్యంలో డ్రైవర్ల జీతాలతోపాటు మరమ్మతు ఖర్చులు రెట్టింపయ్యాయి. మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం కట్టడమే ఇబ్బందిగా మారింది.
– శ్రీనివాస్‌రెడ్డి, హార్వెస్టర్‌ యజమాని, పోరండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement