నేను కాంగ్రెస్‌ పార్టీలో ఉండలేను: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి | mlc jeevan reddy protest over congress leader assassination in jagtial | Sakshi
Sakshi News home page

నేను కాంగ్రెస్‌ పార్టీలో ఉండలేను: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

Published Tue, Oct 22 2024 11:21 AM | Last Updated on Tue, Oct 22 2024 1:19 PM

mlc jeevan reddy protest over congress leader assassination in jagtial

జగిత్యాల, సాక్షి: జగిత్యాలలో కాంగ్రెస్‌  సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నా విరమించారు. ఆయన ఇవాళ పార్టీ నేత గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు  హామీ ఇవ్వటంతో  జీవన్‌ రెడ్డి వెనక్కి తగ్గారు. 

ఈ క్రమంలో సొంత ప్రభుత్వంపైనే జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌పై జీవన్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. ‘‘ నీకో దండం...  నీ పార్టీకో దండం’’ అంటూ  లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. జీవన్‌ రెడ్డికి సీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఫోన్‌ చేయగా.. ‘‘నేను పార్టీలో ఉండలేను. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు’’ అని ఫోన్‌ మాట్లాడుతుండగానే ఫోన్‌ కట్‌ చేశారు. 

‘‘ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహూల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ, ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దాన్ని విస్మరించింది. కేసీఆర్ ఏదైతే చేశాడో.. అదే ఇవాళ కాంగ్రెస్‌ నాయకులు ఆచరిస్తున్నారు. రాహూల్ గాంధీ మన నాయకుడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. నేనెవ్వరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేను. నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను’’ అని  జీవన్‌రెడ్డి అన్నారు.

అంతకు ముందు గంగారెడ్డి హత్యపై  కాంగ్రెస్ నేతలు జగిత్యాల-ధర్మపురి రహదారిపై నిరసన చేపట్టారు. రోడ్డుపై సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ బైఠాయించిన నిరసన తెలిపారు. జగిత్యాలలో 2 గంటలుగా జీవన్‌రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు.

పోలీసులకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సహనం కోల్పోయిన జీవన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు  భారీగా మోహరించారు.

జగిత్యాల రూరల్ జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్‌ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగిత్యాల- ధర్మపురి రోడ్డుపై కొనసాగుతున్న నిరసన

చదవండి: జగిత్యాల: కాంగ్రెస్‌ నేత గంగారెడ్డి దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement