కేంద్ర కమిటీ సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలుపుతున్న కలెక్టర్
డిచ్‌పల్లి: ఏటా పంటలు సాగు చేస్తున్నాం.. నష్టపోతూనే ఉన్నాం.. నష్టం జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు వచ్చి చూస్తున్నారు.. పోతున్నారు. అయితే ఇప్పటి వరకు నష్ట పరిహారం అందించి ఆదుకున్నవారు ఎవరూ లేరూ.. అంటూ బాధిత రైతులు కేంద్ర కమిటి సభ్యుల ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి తాము బాధపడుతుంటే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాం..పరిహారం అందేలా చూస్తామని హామీలు గుప్పిస్తారు, గొప్పలు చెబుతారే తప్ప ఇప్పటి వరకు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు.
మూడు సంవత్సరాలుగా వరుసగా పంటలు నష్ట పోతున్నామని, కానీ ఇప్పటి వరకు ఒక్కరూపాయి నష్ట పరిహారం అందలేదని వాపోయారు. పంటల బీమా చేసుకోండి.. నష్టం వస్తే ఉపయోగపడుతుందని చెబుతూ బీమా సొమ్మును తీసుకుంటున్నారు కానీ పరి హారం ఇవ్వడం లేదన్నారు. వ్యక్తిగతంగా బీమా సొమ్ము వసూలు చేస్తున్నప్పుడు, గ్రామాన్ని, మండలాన్ని యూనిట్ గా తీసుకుని పరిహారం అందిస్తామని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వ నిబంధనల్లో ఎక్కడ లోపం ఉందో పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా కేంద్రప్రభుత్వానికి నివేదిక అం దజేస్తామని కేంద్ర పరిశీలన కమిటీ కన్వీనర్ డాక్టర్ మోహన్‌లాల్ హామీ ఇచ్చారు. పరిహారం కూడా సత్వరం అందేలా చూస్తామన్నారు.
ఒక్క గ్రామంలోనే 1800 ఎకరాల్లో పంట నష్టం
సిరికొండ మండలం కొండూర్ గ్రామంలోనే సుమారు 1800 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వానకు పంటలు పూర్తిగా నష్టపోయి ఒక్క మా కుటుంబంలోనే సుమారు 15 లక్షలు నష్టపోయాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప, ఇప్పటికీ రూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.
-చల్ల గోపాల్‌రెడ్డి, కొండూర్ గ్రామం, సిరికొండ మండలం
పంటను అలాగే వదిలేశాను
రబీలో పది ఎకరాల్లో వరి పంటను వేశాను. రేపు పంట కోస్తమని అనంగా వడగళ్లు కురిసి పంట పూర్తిగా నేల పాలైంది. కోయడానికి కూడా రాకపోవడంతో అలాగే పొలంలో వదిలేశాను. వంద శాతం నష్టం జరిగింది. ఎకరానికి రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. మా ఊర్లో 140 ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
-చాగంటి లక్ష్మన్, కలిగోట్, జక్రాన్‌పల్లి మండలం