నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ‘‘జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 4లక్షల 59వేల 74 హెక్టార్లు. అయితే గత ఖరీఫ్‌లో 6లక్షల 2వేల 799హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి లక్షా 92వేల 185హెక్టార్లు. అత్యధికంగా పత్తి 3లక్షల 35వేల 976 హెక్లార్లు కాగా మిగతావి కంది, పెసర, ఆముదం, వేరుశనగ వంటి ప్రధాన పంటలు సాగు చేశారు. అయితే ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే మరో 10 శాతం పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 6లక్షల 70 వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా వరి 2లక్షల హెక్టార్లు, పత్తి 3లక్షల 50 హెక్టార్లు, కంది 32వేల హెక్టార్లు, పెసర 38వేల హెక్టార్లు, వేరుశనగర 7వేల హెక్టార్లలో, ఆముదం 3200 హెక్లార్లతో పాటు ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది’’.
విత్తనాలు సిద్ధం చేశాం
‘‘కేంద్ర ప్రభుత్వం పదేళ్లపై బడిన వరి వంగడాలకు సబ్సిడీని ఎత్తివేసింది. సబ్సిడీ లేని వరి విత్తనాలు రైతులకు అందించేందుకు 38 వేల 432 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాం. బీపీటీ 5204 రకం 18వేల క్వింటాళ్లు, ఎంటీయూ 1010 రకం 20 వేల క్వింటాళ్లు, ఎంటీయూ 7029 రకం 332 క్వింటాళ్లు, ఎన్‌ఎల్‌ఆర్ రకం 100 క్వింటాళ్లను సిద్ధం చేశాం. దాంతో పాటు 49 క్వింటాళ్ల మినుములు, 752 క్వింటాళ్ల జనుము విత్తనాలు రెడీగా ఉంచాం. దాంతో పాటు సబ్సిడీపై అందించేందుకు 1200 క్వింటాళ్ల కంది, 1000 క్వింటాళ్ల పెసర, 2500 క్వింటాళ్ల వేరుశనగ, 400 క్వింటాళ్ల మొక్కజొన్న, 200 క్వింటాళ్ల జొన్నతో పాటు ఆము దం, పిల్లి పెసర విత్తనాలను సిద్ధం చేశాం. వీటన్నింటినీ ఏపీ సీడ్స్ వద్ద అందుబాటులో ఉంచడంతోపాటు అన్ని మండల కేంద్రాలలోని విక్రయ కేంద్రాలకు తరలించాం.
అదేవిధంగా జిల్లాలో గత ఏడాది 13లక్షల 45వేల 404బీటి పత్తి విత్తనాలను సరఫరా చేశాం. కానీ ఈ ఖరీఫ్‌లో 17లక్షల ప్యాకెట్‌లను జిల్లాకు తెప్పిం చడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా బీటీ పత్తి విత్తనాలను మార్కెట్‌లో ఉంచాం. ఇంకా రెండు మూడు రోజులలో మొత్తం బీటీ పత్తి విత్తనాలు జిల్లాకు రానున్నాయి. రైతులు బ్రాండెడ్ కంపనీ విత్తనాలని ఎగబడకుండా అన్ని రకాల బీటీ పత్తి విత్తనాలను వేసుకోవాలి. అన్ని రకాల విత్తనాలు బాగానే దిగుబడులు వస్తాయి’’.
ఎరువులు అందుబాటులోనే...
‘‘జిల్లాలో ఇప్పటికే యూరియా 16638 టన్నులు, డీఏపీ 6110 టన్నులు, ఎంఓపీ 2640 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 360 టన్నులు, కాంప్లెక్స్ 16244 టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో యూరియా 1,81,762 టన్నులు, డీఏపీ 72,704 టన్నులు, ఎంఓపీ 45,441టన్నులు, ఎస్‌ఎస్‌పీ 7276టన్నులు, కాంప్లెక్స్ 1,09,058టన్నులు ఎరువులు అవసరంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిం చాము. సీజన్ ప్రారంభం కాగానే నెలనెల వారిగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం’’.
భూసార పరీక్షలు
‘‘జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి రైతుల పొలాలలో మట్టి నమూనాలను సేకరించి భూ సార పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో మొత్తం 11వేల నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహించిన అనంతరం పరీక్షల ఫలితాలను ఆయా రైతుల సెల్‌ఫోన్‌లకు తెలుగులో మెసేజ్ రూపంలో పంపిస్తున్నాం. ఫలితాలను బట్టి ఆ భూమిలో ఏఏ పంటలు వేసుకోవాలి. ఏ మోతాదులో ఏ ఎరువులను వాడాలి అనే అంశాలను కూడా రైతులకు సూచిస్తున్నాం’’.
ఖరీఫ్..సర్వం సన్నద్ధం
Published Wed, May 21 2014 2:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement