కరుణించని వరుణుడు
ఎండుతున్న బత్తాయి తోటలు
ఇంకుతున్న భూగర్భ జలాలు
హల్‌చల్ చేయాల్సిన కాడెద్దులు కంగారుపడుతున్నాయి... ఛల్‌ఛల్‌మని గాల్లో గింగిరీలు కొట్టాల్సిన చెర్నోకోలో చెమ్మగిల్లిపోయింది...గజ్జెల సవ్వడులతో పరుగులు తీయాల్సిన ఎడ్లబండ్లు కానరావడం లేదు...నాగలి భుజాన వేసుకోవాల్సిన రైతన్నలో అయోమయం, చేనుకుండ తీసుకుపోవాల్సిన అన్నపూర్ణల మోముల్లో వివర్ణం, పచ్చని భూముల్లో బీటలు, బోసిపోయిన పంట కాలువలు, ఎండిపోయి నల్లబారిన పండ్లతోటలు... ఇదీ ప్రస్తుతం జిల్లాలోని సాగు దుస్థితి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కరువు కమ్ముకొస్తోంది. ఒకవైపు జలాశయాలు ఎండిపోయి ఖరీఫ్‌కు నీరు రాదని తేలిపోయిన నేపథ్యంలో మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. జూలై నెలలో పడాల్సిన వర్షపాతం కంటే 43.7 శాతం తక్కువ పడింది. పశ్చిమ ప్రకాశం దాదాపు అన్ని మండలాల్లో వ ర్షాలు అతి తక్కువగా పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో వేసిన పంటలు గిడసబారిపోతున్నాయి.
గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాకు 562 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. తిండిగింజలు రూ.113 కోట్లు, పప్పు ధాన్యాలు రూ.276 కోట్లు, ఇతర పంటలు రూ. 89 కోట్లుపోగా, ఉద్యానవన పంటలకు రూ.62 కోట్లు నష్టం వచ్చింది. రబీలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఈ ఏడాది ఖరీఫ్ ఉండదని కృష్ణాబోర్డు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాల్లో మాగాణిలో వరి వేసే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటలకు కూడా అవకాశం లేదు. మరోవైపు పొగాకు సాగు తగ్గించేశారు. అక్కడ కూడా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సి ఉంది. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఉద్యానవన పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితి కనపడుతోంది.
యర్రగొండపాలెం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 56,086ఎకరాల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా 19106 ఎకరాల్లో మాత్రమే రైతులు తమ పొలాల్లో పంటలను విత్తుకున్నారు. ప్రత్తి పండించే రైతుల పరిస్థితి మరింతదారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు గిడసబారి పోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎర్రతెగులు సోకటందో ఆ పంటను రైతులు దున్నేసుకున్నారు. ఫలితంగా రైతులకు దాదాపు రూ 12 కోట్ల మేరకు నష్టపోవాల్సి వచ్చింది. కంది పంట మొలక దశలోనే నేలపాలయ్యే పరిస్థితి ఉందని పలువురు రైతులు తెలిపారు.
పశ్చిమ ప్రకాశంలో బత్తాయి రైతుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు సాగు చేస్తే సకాలంలో వర్షాలు కురవక 600 అడుగుల్లో బోర్లు వేసినా నీరు పడక తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేకపోవటంతో రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది. నాలుగు సంవత్సరాల క్రితం ఎకరాకు సుమారు 10 నుంచి 12టన్నుల వరకు దిగుబడి రాగా, ఇప్పుడు ఏడాది 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తోంది. మరికొన్ని చెట్లు ఎండు తెగులు సోకి కాయ పరిమాణం సోకి రంగు మారటంతో వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపటం లేదు. వడగాల్పులు వీస్తుండటంతో కాయ ఊరక, రసం లేక బరువు తగ్గి చిన్నవిగా వస్తున్నాయి.
కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడులో చెరువుల్లో చుక్క నీరులేక 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గల నిమ్మతోటలు నిలువునా ఎండి పోవడంతో రైతులు నరికి కాల బెడుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గొర్రెలు, మేకలు వలస బాట పట్టాయి. బత్తాయి నిమ్మ, చెట్లు నిలువునా ఎండిపోయాయి. నీళ్లులేక కనిగిరి, వెలిగండ్ల మండలాల్లో బత్తాయి చెట్లను నరికేశారు. + కొండపిలో పశువులకు సైతం గ్రాసం కొరత ఏర్పడింది. వర్షపాతం పూర్తి స్దాయిలో పడిపోయింది. చేలన్నీ ఎడారులను తలపిస్తున్నాయి. ఇక్కడ ఖరీఫ్ సీజన్‌లో 16,998 హెక్టార్ల నార్మల్ ఏరియాలో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికీ మొత్తం 5 వేల హెక్టార్లలో కూడా రైతులు పంటలు సాగు చేయలేకపోయారు.
దర్శి నియోజకవర్గంలో అడపా దడపా కురిసిన చిరుజల్లులకు కొందరు రైతులు తమ పొలాల్లో విత్తనాలు వేసి వేల రూపాయలు నష్టపోయారు. వేసిన విత్తనాలు మొలవక, చేసిన కృషి వృథా అయి అప్పులు పెరిగి అల్లాడుతున్నారు. చెరువులు ఎండిపోయి, బావులు, బోర్లు అడుగంటి గొంతు తడుపుకునేందుకు కూడా గుక్కెడు నీరు లభించక ప్రజలు విలవిల్లాడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఆకాశం మబ్బులుగా ఉన్నా సరైన వర్షం పడిన దాఖలు లేవు. గత రెండు సంవత్సరాల నుంచి చేతి నిండా పని ఉన్న కూలీలు నేడు ఇబ్బందులకు గురవుతున్నారు.
కరువు కాటేస్తోంది
Published Sat, Aug 8 2015 4:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement