ధాన్యంపై దాగుడుమూతలు | Yasangi Paddy Harvesting Starts From Next Week In Telangana | Sakshi
Sakshi News home page

ధాన్యంపై దాగుడుమూతలు

Published Wed, Mar 30 2022 3:08 AM | Last Updated on Wed, Mar 30 2022 3:11 AM

Yasangi Paddy Harvesting Starts From Next Week In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి వరి కోతలు వచ్చే నెల మొదటివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాతావరణం అనుకూలించడంతో ఈసారి పంట దిగుబడి సంతృప్తికరంగా ఉంటుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోలు విషయమై నెలకొన్న వివాదంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్‌ నెల ప్రారంభం కాబోతున్నా.. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం) సేకరించబోమని తెగేసి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరుకు సిద్ధమైందే తప్ప.. రైతులు పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో స్పష్టత ఇవ్వట్లేదు. కేంద్ర వైఖరి నేపథ్యంలో వానాకాలం పంట కొనుగోళ్ల సమయంలోనే సీఎం కేసీఆర్‌ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ‘రైతులదే బాధ్యత’అన్న ధోరణిలో జిల్లాల రెవెన్యూ, పౌరసరఫరాల యంత్రాంగాలు ఉన్నాయి. 

ఉప్పుడు బియ్యంపైనే వివాదం..
యాసంగి ధాన్యం ఎక్కువగా అధిక వేడి కారణంగా నూకలుగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి 20 ఏళ్ల కిందటే ఎఫ్‌సీఐ ఉప్పుడు బియ్యం విధానాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో ఉప్పుడు బియ్యంకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా కేంద్రమే తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ సేకరించింది. అయితే కొన్నేళ్లుగా ఉప్పుడు బియ్యం తినేవాళ్లు తగ్గడంతో ఎఫ్‌సీఐ గోదా ముల్లో నిల్వలు పెరిగిపోతున్నాయనేది కేంద్రం వాదన.

ఈ క్రమంలో 2020–21 యాసంగి పంట సేకరణ సమయంలో కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టంగా రాష్ట్రానికి చెప్పింది. దేశంలోని ఏ రాష్ట్రం నుంచి కూడా ఉప్పుడు బియ్యం సేకరించట్లేదని, ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ముడిబియ్యమే సేకరిస్తామని చెప్పింది. ముడిబియ్యం తప్ప ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల రాష్ట్ర మంత్రుల బృందానికి తేల్చి చెప్పారు. అయితే ‘ఉప్పుడు, ముడిబియ్యంతో సంబంధం లేకుండా  రైతులు పండించిన ధాన్యా న్ని కొనాలి..’అని కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

తగ్గిన సాగు..పెరిగిన దిగుబడి
గత సంవత్సరం యాసంగిలో 53 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా అత్యధికంగా 93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే ఇటీవలి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి 36 లక్షల ఎకరాలకే వరిసాగు పరిమితమైంది. అయినా 70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం విక్రయానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లకు మార్చి నాటికే ఏర్పాట్లు మొదలవుతాయి.

ఏప్రిల్‌ రెండో వారం నుంచే కొనుగోళ్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి అలాంటివేవీ లేవు. వరికోతలు పూర్తయిన తరువాత రైతులు ధాన్యాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? ఎవరికి విక్రయిస్తారో స్పష్టత లేకుండా పోయింది. కొన్ని మండలాల్లో రైతులతో మిల్లర్లు తక్కువ ధరకు ఒప్పందం చేసుకోవడం, విత్తనాల కోసం సీడ్‌ కంపెనీలు అవగాహన కుదుర్చుకోవడం  మిన హా ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఏర్పాట్లూ లేవు. 

రైతులు నష్టపోవాల్సిందేనా?
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కనీస మద్దతు ధరతో రైతు ధాన్యాన్ని విక్రయించుకుంటాడు. ఏ– గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.1,960, సాధారణ ధాన్యం రూ.1,940కి విక్రయిస్తారు. కేంద్రాలు లేనిపక్షంలో ధాన్యాన్ని నేరుగా మిల్లర్లు, దళారులు రైతుల నుం చి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు. క్వింటా లుకు రూ.400 నుంచి రూ.500 వరకు తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుందని, ఇదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోతారని అంటున్నారు. 

ప్రభుత్వాలు డ్రామాలు ఆపాలి
యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్రానిది. డ్రామా లు ఆపి, వరి ధాన్యంపై నిర్ణయం తీసుకోవాలి.
– వి.ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఏఐకేఎంఎస్‌ 

మార్కెట్‌ సదుపాయం..మద్దతు ధర ముఖ్యం
రైతులు పండించిన ధాన్యం ఎవరు కొంటున్నారనేది, ఎక్కడ అమ్ముతున్నారనేది ముఖ్యం కాదు. మార్కెట్‌ సదుపాయం కల్పించి, మద్దతు ధర అందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. జిల్లాలో వరి తప్ప ఇతర పంటలను పండించే స్థితిలో ప్రస్తుత భూములు లేవు. అందువల్ల వరి సాగు తప్పలేదు. ఏదో విధంగా ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో పోరాటం తప్పదు.
– మండారి డేవిడ్‌ కుమార్, రైతు కూలీసంఘం రాష్ట్ర నాయకుడు, సూర్యాపేట జిల్లా

ఐకేపీ కేంద్రాలు తెరవాలి
ఈ వేసవిలో 9 ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రభుత్వం దొడ్డు వడ్లు సాగు చేయవద్దు అనడంతో సన్న రకం సాగు చేశా. వెంటనే ఐకేపీ కేంద్రాలు నెలకొల్పి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మిల్లుకు అమ్మితే ధర తగ్గుతుంది. ఆర్థికంగా నష్ట పోతాం.
– గుండాల హనుమయ్య, రైతు, నసీంపేట (సూర్యాపేట జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement