సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపుస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్‌లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షలమంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతుధర (గ్రేడ్–ఎ క్వింటాల్‌కు రూ.1,770, సాధారణ రకం– క్వింటాల్‌కు రూ.1750)కు 6.71 లక్షలమంది మంది రైతుల నుండి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు.
గత ఏడాది ఖరీఫ్‌లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈసారి పురుగులు(దోమకాటు), ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. రైతులకు కనీసమద్దతు ధర లభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో దళారుల జోక్యానికి అడ్డుకట్ట పడింది. పంటకు కనీస మద్దతుధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతుల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుండి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటివరకు రూ.5,213 కోట్లు ఆన్‌లైన్ ద్వారా రైతుఖాతాలోకి జమ చేయగా, మిగిలిన మొత్తం కూడా ట్రాక్‌షీట్ జనరేట్ అయిన వెంటనే జమ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేశాం
రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లాల కలె క్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఖరీఫ్‌లో 25 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 34 లక్షల టన్నులు సేకరించాం. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. దీని ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగలిగాం.
– అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment