ఖరీఫ్.. కన్నీళ్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద ఆశలు అడుగంటి పోయాయి.. వానల్లేక ఎక్కడా చెప్పుకోదగ్గ నీటి నిల్వల్లేవు.. జూరాల, కడెం మినహా భారీ ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ల నుంచి ఖరీఫ్ ఆయకట్టుకు చుక్క నీరందడం లేదు.. వెరసి ఏకంగా 19 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది! భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరినా.. తాగునీటి అవసరాల దృష్ట్యా సాగుకు నీరందించడం కష్టంగానే ఉండొచ్చు.
ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీటి సరఫరా కష్టమే
19 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం
5 టీఎంసీల నీళ్లే సాగర్‌లోకి వచ్చాయి
2.14 టీఎంసీల నీళ్లే నిజాంసాగర్‌లోకి వచ్చాయి
తుపాన్లు వస్తేనే ప్రాజెక్టులు నిండే అవకాశం
ఏ ప్రాజెక్టు చూసినా..
సాగునీటి ప్రాజెక్టుల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా.. గతేడాది అత్యధికంగా 26 లక్షల ఎకరాల మేర నీరందించారు. ఈ ఏడాది మాత్రం దారుణంగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద 6.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎకరా భూమికి కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం సాగర్‌లోకి 5 టీఎంసీల నీరు మాత్రమే రావడంతో తాగునీటికే ఎగువ ప్రాజెక్టుల వైపు చూడాల్సి వస్తోంది. కనీసం 70 టీఎంసీల నీరొస్తేనే ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఆయకట్టు రైతులు ఆశలు వదులుకోవాల్సిందే.
ఇక ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 40 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయకట్టుకు వదలడం లేదు. మరో 27 టీఎంసీలు వస్తే కానీ ఖరీఫ్ నీటి విడుదలపై చెప్పలేని పరిస్థితి. గతేడాది ఈ ప్రాజెక్టు కింద 8.60 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు నీరందింది. నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఏడాది ప్రాజెక్టులోకి 2.14 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది.
దీంతో ఇక్కడా ఆయకట్టుకు నీటి విడుదలపై ఆశలు అడుగంటిపోయాయి. శ్రీశైలంపై ఆధారపడిన కల్వకుర్తి ప్రాజెక్టు కింద ఈ ఏడాది 3 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినా... తాగునీటి అవసరాలే తీరడం లేదు. అక్టోబర్, నవంబర్‌లో తుపాన్లు సంభవిస్తే ప్రాజెక్టుల్లోకి నీరొచ్చే అవకాశం ఉంటుంది. అలా వస్తేనే ఖరీఫ్ ఆయకట్టుకు చివరి తడికైనా నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఖరీఫ్ ఆశలు గల్లంతు కానున్నాయి.
ఏం చేయాలోఅర్థం కావడం లేదు
సాగర్‌లో నీళ్లు లేక వరిపై ఆశలు సన్నగిల్లాయి. నాకు రెండెకరాల భూమి ఉంది. గతేడాది 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశా. ఈసారి నీళ్లు లేక ఐదెకరాలే కౌలుకు తీసుకున్నా. పంట ఎండిపోయే టట్లుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నా.
– సోమిరెడ్డి, త్రిపురారం, నల్లగొండ
కన్నీళ్లే మిగిలాయి
సాగర్ కాల్వకు నీరు విడుదల చేయక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. వేలకు వేలు పోసి బోర్లు వేస్తే నీరు పడతలేదాయె. అప్పుల పాలవుతున్నాం. బోర్ల వద్ద కొంత నాటు వేసినా నీరు సరిపోవడం లేదు. నీళ్ల కోసం చూస్తే కన్నీళ్లే మిగిలాయి
– గడ్డం సైదిరెడ్డి, నారమ్మగూడెం, నల్లగొండ
నమ్మకం లేదు
వరినాట్లకు సమయం మించిపోయింది. ఇప్పటి వరకు కల్వకుర్తి నుంచి నీరందకపోవడంతో ఈసారి పంటలు పండుతాయన్న నమ్మకం లేదు. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రకటన చేయాలి.
– చిక్కొండ్ర బాలయ్య, నాగర్ కర్నూల్