రూ.149 లక్షలతో చంద్రన్న రైతు క్షేత్రాలు
Published Mon, May 29 2017 11:45 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- 122 నుంచి 93కు తగ్గిన పొలం బడులు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 268 యూనిట్‌లలో చంద్రన్న రైతు క్షేత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రైతులకు రూ.149 లక్షల విలువైన ఇన్‌పుట్స్ పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌లో 10 హెక్టార్లుంటుందని, మొత్తంగా 2,680 హెక్టార్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లుగా జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. జీలుగ, జిప్సమ్, జింక్, బోరాన్‌లను రైతు అవసరాన్ని బట్టి సరఫరా చేస్తామని, ఇందుకు రూ.1700 రాయితీ ఉంటుందన్నారు. ఇవన్ని ఒకే రైతుకు ఇవ్వడం జరుగదని, ఇందులో ఏదీ అవసరమైతే దానిని ఇస్తామని తెలిపారు. జీవన ఎరువులు, విత్తన శుద్ధి మందు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ను రైతుల అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు రూ.800 రాయితీ ఉంటుందన్నారు. వేపచెక్క 120 కిలోలు, 5 లీటర్ల వేపనూనె పంపిణీ చేస్తామని, ఇందులో రూ.1000 సబ్సిడీ ఉంటుందని, మొత్తంగా హెక్టారుకు రూ.4500 విలువైన ఇన్‌పుట్స్ ఇస్తామని తెలిపారు. కర్నూలు, డోన్,నందికొట్కూరు, నంద్యాల, ఆలూరు సబ్ డివిజన్‌లలో 25, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్‌లలో 25, ఆదోని సబ్ డివిజన్‌లో 23 ప్రకారం చంద్రన్న రైతు క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తగ్గిన పొలంబడులు...
ఖరీఫ్‌లో పొలంబడులను తగ్గించారు. గత ఏడాది ఖరీఫ్‌లో 122 పొలంబడులు నిర్వహించారు. ఈ ఖరీఫ్‌లో 93 పొలంబడులు మాత్రమే నిర్వహిస్తున్నారు. నూనెగింజల అభివృద్ధి పథకం కింద వేరుశనగలో 29, ప్రొద్దుతిరుగుడులో 5, రాష్ట్ర ప్రణాళిక కింద వరిలో 3, మొక్కజొన్నలో 16, పత్తిలో 30, పప్పు ధాన్యాల పంటల్లో 10 ప్రకారం పొలం బడులు నిర్వహిస్తారు. విత్తనం వేసింది మొదలు కోత వరకు 14 వారాల పాటు వీటిని నిర్వహిస్తారు. ఒక్కో పొలం బడిలో 35 మంది రైతులుంటారు. వీరికి ఐపీఎం కిట్స్ పంపిణీ చేస్తారు.
Advertisement
Advertisement