సాక్షి, అమరావతి: తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పూర్తయిన పనుల ద్వారా గతంలో ఎన్నడూలేని రీతిలో జూన్ 12నే ఖరీఫ్ పంటల సాగు నిమిత్తం 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసింది. కుడి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తిచేయడం.. రివిట్‌మెంట్ పూర్తిచేసి, 2,151 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేర 2.51 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా మిగిలిపోయిన 85,765 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టింది.
కుడి ప్రధాన కాలువలో అంతర్భాగంగా చేపట్టిన గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద 1908లో బ్రిటిష్ సర్కార్ తోటపల్లి వద్ద నాగావళి నదిపై రెగ్యులేటర్ ద్వారా 64 వేల ఎకరాలకు నీళ్లందించేది.
ఇది శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. రెగ్యులేటర్‌కు ఎగువన 2.51 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్‌ను నిరి్మంచి.. అదనంగా 1,06,765 ఎకరాలకు, తోటపల్లి కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు.
ప్రాధాన్యతగా తోటపల్లి..
జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు పూర్తిచేసిన ముఖ్యమంత్రి.. తోటపల్లిలో మిగిలిన పనులను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కుడి ప్రధాన కాలువలో మిగిలిన పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఇక జూన్ 12న పూర్తయిన పనుల ద్వారా పాత, కొత్త కలిపి 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేశారు.
కుడి ప్రధాన కాలువలో ప్యాకేజ్–1లో 5.70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 37 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. ప్యాకేజ్–2లో 8.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 47 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో.. కోతలు పూర్తయ్యేదాకా అంటే డిసెంబర్ దాకా కాలువల పనులు చేయడానికి వీలుకాదు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట కోతలు పూర్తయ్యాక కుడి కాలువలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వుతున్న గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 2.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 27 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఈ పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు.
గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ..
తోటపల్లి బ్యారేజ్ గరిష్ఠ నీటినిల్వ 2.51 టీఎంసీలు. బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే 20 గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకుగాను 3,478 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. కానీ, బ్యారేజ్ మట్టికట్టకు రివిట్‌మెంట్ పనులు పూర్తికాలేదు. దీంతో బ్యారేజ్‌లో రెండు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు.
ఈ పనులు పూర్తిచేసి.. మిగతా 2,151 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా వచ్చే ఏడాదికి బ్యారేజ్‌లో 2.51 టీఎంసీలను నిల్వచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం ద్వారా తోటపల్లి ఆయకట్టు రైతులందరికీ జలయజ్ఞం ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment