totapalli project
-
ఆయకట్టు రైతులందరికీ ‘తోటపల్లి’ ఫలాలు
సాక్షి, అమరావతి: తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పూర్తయిన పనుల ద్వారా గతంలో ఎన్నడూలేని రీతిలో జూన్ 12నే ఖరీఫ్ పంటల సాగు నిమిత్తం 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసింది. కుడి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తిచేయడం.. రివిట్మెంట్ పూర్తిచేసి, 2,151 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేర 2.51 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా మిగిలిపోయిన 85,765 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టింది. కుడి ప్రధాన కాలువలో అంతర్భాగంగా చేపట్టిన గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద 1908లో బ్రిటిష్ సర్కార్ తోటపల్లి వద్ద నాగావళి నదిపై రెగ్యులేటర్ ద్వారా 64 వేల ఎకరాలకు నీళ్లందించేది. ఇది శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. రెగ్యులేటర్‌కు ఎగువన 2.51 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్‌ను నిరి్మంచి.. అదనంగా 1,06,765 ఎకరాలకు, తోటపల్లి కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యతగా తోటపల్లి.. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు పూర్తిచేసిన ముఖ్యమంత్రి.. తోటపల్లిలో మిగిలిన పనులను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కుడి ప్రధాన కాలువలో మిగిలిన పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఇక జూన్ 12న పూర్తయిన పనుల ద్వారా పాత, కొత్త కలిపి 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువలో ప్యాకేజ్–1లో 5.70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 37 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. ప్యాకేజ్–2లో 8.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 47 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో.. కోతలు పూర్తయ్యేదాకా అంటే డిసెంబర్ దాకా కాలువల పనులు చేయడానికి వీలుకాదు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట కోతలు పూర్తయ్యాక కుడి కాలువలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వుతున్న గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 2.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 27 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఈ పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ.. తోటపల్లి బ్యారేజ్ గరిష్ఠ నీటినిల్వ 2.51 టీఎంసీలు. బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే 20 గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకుగాను 3,478 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. కానీ, బ్యారేజ్ మట్టికట్టకు రివిట్మెంట్ పనులు పూర్తికాలేదు. దీంతో బ్యారేజ్‌లో రెండు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. ఈ పనులు పూర్తిచేసి.. మిగతా 2,151 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా వచ్చే ఏడాదికి బ్యారేజ్‌లో 2.51 టీఎంసీలను నిల్వచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం ద్వారా తోటపల్లి ఆయకట్టు రైతులందరికీ జలయజ్ఞం ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
తోటపల్లి వెలగాలి
గరుగుబిల్లి (కురుపాం): తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2003లో శంకుస్థాపన చేశారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టుకు పాలనా అనుమతులను తీసుకొచ్చి పనులను వేగవంతం చేశారు. స్పిల్‌వే, తోటపల్లి కుడిప్రధాన హెడ్ స్లూయిస్, కుడికాలువ నిర్మాణ పనుల్ని 90 శాతం వరకు పూర్తి చేశారు. వైఎస్ ఆకస్మిక మరణంతో ప్రాజెక్టు పనులు మందగించాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కుడికాలువ కల్వర్టు పనులు, స్ట్రక్చర్ పనులను పూర్తిచేసి 2015 సెప్టెంబర్ 10న సాగునీటిని సరఫరా ప్రారంభించారు. కుడి ప్రధాన కాలువ నిర్మాణం ఇలా.. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర నుంచి గుర్ల మండలం గడి గెడ్డ వరకు 117.7 కిలోమీటర్ల కుడి ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టారు. ఇందులో నాలుగు బ్రాంచ్ కాలువలు, 29 డిస్ట్రిబ్యూటర్లు, 220 స్ట్రక్చర్లను నిర్మించారు. కుడి ప్రధాన కాలువ ద్వారా విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో 155 గ్రామాలకు 62,055 ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లోని 132 గ్రామాల్లో 57,945 ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం. అంచనాలు మించిన వ్యయం సకాలంలో నిర్వాసితుల సమస్యలు, భూసేకరణ తదితర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అంచనా వ్యయాన్ని రూ.772.64 కోట్లకు పెంచారు. తరువాత అంచనా వ్యయం రూ.1124 కోట్లకు చేరింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ పనుల నిర్వాహణకు విడుదల చేసిన నిధులు కేవలం రూ.65 కోట్లే. ఈ కొద్దిపాటి నిధులను విడుదల చేసి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని.. రైతులను ఆదుకున్నాం అంటూ ప్రసంగాలు చేస్తుంటే రైతులు విస్తుపోతున్నారు. ప్రాజెక్టు అసంపూర్తి పనుల పూర్తికి ఇంకా రూ.300 కోట్లు విడుదల చేయాల్సి ఉందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. చెప్పేది లక్షల్లో.. ఇచ్చేది వేలల్లో కుడి ప్రధాన కాలువ నిర్మాణం మినహా పిల్ల కాలువలు నిర్మించకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 50 వేల ఎకరాలకు మించి సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పిల్లకాలువ నిర్మాణానికి ఇంకా 200 ఎకరాల భూసేకరణ జరగాలని అధికారులు చెబుతున్నారు. దీంతో పంట పొలాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. నిర్వాసితుల గోడు ప్రాజెక్టు నిర్మాణంలో 21 గ్రామాలు ముంపు గ్రామాలుగా ప్రకటించగా 10 గ్రామాలకు పునరావాసం కల్పించారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేశామని చెప్పుకోవడం తప్ప నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం లేదని ఈ ప్రాంతీయులు ఆరోపిస్తున్నారు. గరుగుబిల్లి మండలంలో సుంకి, నందివానివలస, జియ్యమ్మవలస మండలం బాసంగి, బాసంగి గదబవలస బిత్రపాడు, కొమరాడ మండలం కళ్లికోట, దుగ్గి, గుణానపురం, పార్వతీపురం మండలం పిన్నింటి రామినాయుడువలస గ్రామాలకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదు. రైతులకు జగన్ భరోసా ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించిన సందర్భంగా ఈ ప్రాంత రైతులు ప్రాజెక్టు పరిస్థితిని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంతోపాటు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటిస్తే తప్పరు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి కూడా రైతులకు మాట ఇస్తే వెనుకడుగు వేయరు. పంటల సీజన్ వచ్చిందంటే రైతుల ఖాతాలో పెట్టుబడి నిధి కింద రూ.12,500 జమ చేస్తామని ప్రకటించడం హర్షణీయం. రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించడం ముదావహం. – మండల శంకరరావు, ఎంపీటీసీ, తోటపల్లి కుడికాలువ నీరందించాలి ఈ ప్రాంతంలోనే తోటపల్లి ప్రాజెక్టు ఉన్నా కొత్తగా నిర్మించిన కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని గ్రామాల వెంబడి సాగునీరు సరఫరా అవుతున్నా రైతుల పంటపొలాలకు నీరందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంతోనైనా సాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి. – ఉరిటి రామారావు, కన్వీనర్, వైఎస్సార్సీపీ, గరుగుబిల్లి సాగునీటి సరఫరాపై ప్రభుత్వం కాకిలెక్కలు తోటపల్లి ప్రాజెక్టు అంకితం 2015లో.. నీరందించినట్టు ప్రకటించింది 50 వేల ఎకరాలు 2016లో 89 వేల ఎకరాలు 2017లో లక్షా ఏడు వేల ఎకరాలు 2018లో లక్షా పది వేల ఎకరాలు వాస్తవానికి నీరందుతున్నది కేవలం యాభై వేల ఎకరాలు -
పనుల్లో జాగు...ప్రశ్నార్థకంగా సాగు
తోటపల్లి ప్రాజెక్టులో మరో 15 పనులు పెండింగ్ రూ.6 కోట్లతో డిజైనింగ్‌కు ప్రతిపాదన ఈ ఏడాదీ పూర్తి స్థాయి సాగునీరు లేనట్టే... విజయనగరం కంటోన్మెంట్: తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి... అన్నట్టు ఏదో ప్రారంభించేశాం అని చెప్పుకోవడానికి తప్ప పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడంలేదు. జిల్లాలోని ఏకైక భారీ తరహా సాగునీటి ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయి సాగునీరు అందించేందుకు అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్నాయి. ఇప్పుడీ పథకానికి సంబంధించి మరి కొన్ని పనులు పెండింగ్‌లో పడ్డాయి. తోటపల్లి కాలువ ఆసాంతం సుమారు 15 పనులు చేపట్టాల్సి ఉన్నట్టు అధికారులు ఇటీవలే గుర్తించారు. సుమారు రూ. 6 కోట్ల విలువయిన ఈ పనులను ఇప్పటి కాంట్రాక్టర్లు తాము చేయలేమని చేతులెత్తేయడంతో ఇప్పుడు వాటికి టెండర్లు పిలిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెండింగ్ పనులకు సంబంధించి ఇంకా డిజైన్ కూడా కాలేదు. వాటి అనుమతికోసం విశాఖలోని సీఈకి ఇప్పుడు ప్రతిపాదనలు పంపించారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే... పనులెప్పుడు ప్రారంభమవుతాయన్నది రైతుల సందేహం. అసలే వర్షాకాలం... ఈ తరుణంలో ఎప్పుడు డిజైన్ చేస్తారు? మంజూరు చేసేదెప్పుడు? సాగునీరు అందించేదెప్పుడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రాజెక్టు డిజైన్ చేసి, కాంట్రాక్టర్లకు అప్పగించినప్పుడే కొన్ని పనులు మరచిపోయారు. అండర్ టన్నెల్స్, చెరువుల పక్కనుంచి నీటిని మళ్లించడం, చెరువుల నీటికి అడ్డంగా ఉన్న కాలువ నిర్మాణాన్ని మార్చడం వంటివి పొందుపరచలేదు. తోటపల్లి కాలువ పనులు పూర్తవుతున్న కొద్దీ ఆ లోపాలు బయటపడుతున్నాయి. నీరు నిలువ ఉండిపోవడం, వివిధ చెరువుల వద్ద నీరు పెండింగ్ ఉండిపోవడం వంటివి చూశాక ఈ పనులు తప్పనిసరిగా చేయాల్సిందేనని గుర్తించారు. తోటపల్లి కాలువ పొడవునా బ్రిడ్జిలు, యూటీలను నిర్మించాల్సి ఉన్నందున ఓ పక్క మిగిలి ఉన్న ఉప కాలువల పనులు, లైనింగ్ వంటివాటితో ఇప్పటికే అధికారులకు తీరిక లేకుండా నడుస్తోంది. ఇప్పుడీ అదనపు పనులు కూడా జత కలవడంతో ఏ పనులు ఎప్పుడు చేస్తారోనన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. -
తోటపల్లికి ‘కోటి’ కష్టాలు
విజయనగరం కంటోన్మెంట్: తోటపల్లి ప్రాజెక్టును ఆదరాబాదరాగా ప్రారంభించేయాలనే ఆదుర్దాతో చాలా పనులను గుర్తించకుండానే అధికారులు అగ్రిమెంటు చేసుకున్న విషయం బట్టబయలైంది. ఈ ఏడాది సాగునీరు అందించేందుకు అవసరమయిన పనులు చేస్తుంటే అగ్రిమెంట్లో లేని పలు స్ట్రక్చర్ల నిర్మాణాలు జరగని విషయం బయటపడింది. కోట్ల రూపాయల విలువైన ఆ పనులు అగ్రిమెంట్లో లేనందున తాము చేయబోమని కాంట్రాక్టర్లు ఖరాఖండీగా చెప్పేస్తుంటే.. ఎలాగైనా చేయాల్సిందేనని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనివల్ల తోటపల్లి సాగునీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అడుగడుగునా అవరోధాలు జిల్లాలోని ఏకైక భారీ సాగు నీటి పారుదల తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రెండు జిల్లాల్లో లక్షా 20వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. తోటపల్లి కుడి ప్రధాన కాలువ 40.700 కిమీల వద్ద బాడంగి మండలం వాడాడ సమీపంలోని గోపాలకృష్ణ రంగరాయపురం(జీకేఆర్ పురం)లో సాగునీటి చెరువుకు వెళ్లాల్సిన వాగునీటికి అడ్డంగా తోటపల్లి కాలువను నిర్మించేశారు. వాస్తవానికి ఆ చెరువుకు నీరు వెళ్లే ప్రాంతలో యూటీ(అండర్ గ్రౌండ్ టన్నెల్)నిర్మించాలి. అంటే తోటపల్లి కాలువ కింది నుంచి చెరువుకు వాలు నీరు వెళ్లాల్సి ఉంది. ఈ నిర్మాణాన్ని గుర్తించకుండా అగ్రిమెంట్ ఒప్పందం పూర్తయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కాలువ నిర్మించేశారు. చెరువుకు వెళ్లే వాగునీటికి ఇది అడ్డంగా ఉండటంవల్ల అక్కడి భూములు మునిగిపోతాయని అధికారులు గుర్తించారు. చెరువుకు నీరూ చేరదు. ఈ రెండు సమస్యలతో పాటు నిల్వ ఉండిపోయే నీటివల్ల కాలువకు భవిష్యత్తులో తోటపల్లి కాలువకు గండి పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కాలువ కిందన యూటీ నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లను కోరుతున్నప్పటికీ వారు ససేమి అంటున్నారు. సుమారు 40 లక్షలకు పైగా వ్యయమయ్యే పనులను తాము అగ్రిమెంట్లో లేకుండా చేపట్టలేమని వారి వాదన. ఇవే కాదు నాలుగైదు పనులు ఇలాంటివి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. స్టేట్‌లెవెల్ స్టాండింగ్ కమిటీలోనూ... అధికారులు హుటాహుటిన స్టేట్‌లెవెల్ స్టాండింగ్ కమిటీ అనుమతి కోసం హైద్రాబాద్ వెళ్లారు. అక్కడా వారికి చుక్కెదురైంది. ఒక సారి అగ్రిమెంట్ పూర్తయ్యాక మళ్లీ అందులో కొత్తగా పనులు చేయమనడాన్ని వారు తప్పుపట్టారు. కాకుంటే నీరు-చెట్టు కింద ఆ పనులను చేసుకోవాలనీ, అందుకోసం జిల్లా కలెక్టర్ అనుమతులు ఇవ్వవచ్చనీ సూచించింది. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు ఆలోచన లేకుండా ఆదరాబాదరాగా పనులు చేయడం వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి.అంతేగాకుండా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం కనిపించదని రైతులు చెబుతున్నారు. నీరు-చెట్టు కింద పనులు చేస్తాం జీకేఆర్ పురంలో కాలువ కింద యూటీ నిర్మిస్తాం. ప్రారంభంలో దానిని గుర్తించలేకపోవడం వల్ల అగ్రిమెంట్లో పొందుపరచలేదు. ఇప్పుడు గుర్తించి ఎస్ఎల్ఎస్సీలో చర్చించాం. నీరు-చెట్టు కింద పనులు చేసుకోమన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతులతో ఆ పనులు త్వరగానే చేస్తాం. - డోల తిరుమల రావు, ఎస్ఈ, తోటపల్లి ప్రాజెక్టు -
తోటపల్లి ప్రాజెక్టు షాక్
తోటపల్లి ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ అధికారులు దిగువున ఉన్న సాయన్న చానల్, నారాయణపురం ఆనకట్టతోపాటు పలుచోట్ల ఓపెన్‌హెడ్ రెగ్యులేటర్లను మర్చిపోయారు. సుమారు 49 వేల ఎకరాల ను సస్యశ్యామలం చేయాల్సిన నాగావళి నది డిసెంబర్ నాటికే నిర్జీవంగా మారుతుంది. సాగునీటి పరిస్థితి అటుంచితే నదీ తీర గ్రామాల్లోని బోరుబావులు సైతం ఎండిపోతున్నాయి. ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సాయన్న చానల్ పరిస్థితి ఏమిటి ? రేగిడి మండలం సంకిలి వద్ద నాగావళి నదిపై 50 ఏళ్ల క్రితంసాయన్న చానల్ ఓపెన్ హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేగిడి, సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మండలాల్లోని 12,000 ఎకరాలకు ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు పుష్కలంగా అందేది. ప్రాజెక్టు కారణంగా ఈ ఏడాది నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం నది ఏడారిని తలపిస్తోంది. ఇదీ నారాయణపురం ఆనకట్ట కథ సంతకవిటి మండలం రంగారాయపురం గ్రామం వద్ద 60 ఏళ్ల క్రితం నిర్మించిన నారాయణపురం ఆనకట్ట ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కుడి కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,600 ఎకరాలు, ఎడవ కాలువ ద్వారా బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని 18,700 ఎకరాలను సస్యశ్యామలం చేసేది. తోటపల్లి పుణ్యమా అని రెండు కాలువలకు సాగునీరు అందడం గగనంగా మారింది. రబీని పక్కన పెడితే ఈ ఏడాది ఖరీఫ్‌లోనే రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ ఆనకట్ట రూపురేఖలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. నాగావళి నదీ తీరంలో వ్యవసాయ పంపుసెట్లుతోపాటు బోరు బావులు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు పరిస్థితి ఇది.. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. గరిష్ట నీటి మట్టం 105 మీటర్లు. వర్షాకాలంలో ప్రొజెక్టులోకి నాగావళి ద్వారా 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుందని ఇరిగేషన్ అధికారులు అంచనా. ఆ సమయంలో మాత్రమే 5 వేల నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు మాత్రమే. 150 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడి చిపెడుతున్నామని చెప్పారు. ఫలితంగా సంకిలి వద్ద నాగావళి నదిలో నీరులేక సాయన్నచానల్ రెగ్యులేటర్‌కు అందడం లేదు. ఇక్కడ ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. నారాయణపురం ఆనకట్ట ఎత్తు కేవలం ఆరు అడుగులు మాత్రమే. ఇక్కడ వేసవిలో కూడా క నీసం మూడు అడుగుల నీరు నిల్వ ఉండాలి. అప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల్లో 150 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ ఆనకట్ట కింద ఆయకట్టుకు ఖరీఫ్‌లో కూడా సాగునీరు అందలేదు. దీంతో మడ్డువలస ప్రొజెక్టును ఆశ్రయించారు. -
సమస్యలపై తోటపల్లి నిర్వాసితుల నిరసన
విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఆర్డీవో గోవిందరావును కలసి వినతిపత్రం ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, దానిపై ఇప్పటి వరకూ చర్యల్లేవన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మూణ్ణాళ్ల ముచ్చట
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఇక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఆధ్వర్యంలో ప్రాజెక్టు కుడిమట్టికట్ట పరిసరాలలో ఏర్పాటుచేసిన బోటుషికారు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారి తాకిడి తగ్గింది. ఒకవైపు తాటిపూడి ప్రాజెక్టును పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇటలీకి చెందిన సంస్థ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి తోటపల్లి ప్రాజెక్టు స్థితిగతులపై అవలోకనం చేసుకోవాలి. కానరాని మౌలిక సౌకర్యాలు తోటపల్లిని పర్యాటకులు ఆకర్షించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూ.41.92లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు బోట్లను కొనుగోలుచేసి అవసరమైన పనులను నిర్వహించి బోటుషికారును 2012 మార్చిలో అప్పటి కేంద్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి కిశోర్‌దేవ్ అట్టహాసంగా ప్రారంభించారు. బోటుషికారు నిర్వహణకు సుంకి, కోటవానివలస, బంటువానివలస గ్రామాల్లోని పదిమంది గిరిజన యువతకు శిక్షణ కూడా ఇచ్చారు. బోటుషికారు ప్రారంభ తొలినాళ్లలో పర్యాటకుల తాకిడి బాగానే ఉండేది. అయితే ఈ ప్రాంతంలో పర్యాటకులకు అవసరమైన తాగునీరు, విశ్రాంతి గదులు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సందర్శకుల తాకిడి తగ్గింది. ఈ కారణంగా బోటుషికారుకు ఆదాయం రాకపోవడంతోపాటు సిబ్బందికి ఐటీడీఏ సంస్థ సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో నిర్వాహకులు విధులనుంచి తప్పుకున్నారు. ఇప్పుడు బోట్లు అలంకార ప్రాయంగా మారాయి. నిధులు మంజూరుచేసిన అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడంతో ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. సౌకర్యాలు కల్పిస్తే మంచిదే... ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు నూతనంగా నిర్మించిన భారీనీటిపారుదల ప్రాజెక్టు ఉండటంతో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. దీనివల్ల అటు ఆలయానికి సందర్శకుల తాకిడి ఎక్కువై ఆదాయం పెరుగుతుంది. ప్రాజెక్టు కుడిమట్టికట్ట ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రాజెక్టును సందర్శించిన సమయంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా పనులుమాత్రం సాగడంలేదు. ముఖ్యంగా కార్తీకమాసంలో ఒడిశా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలనుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తూంటారు. వారిని ఆకర్షించేలా బోటుషికారు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులతోపాటు, అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సీఎం సభా ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్టు సభా ప్రారంభానికి ముందే, గురువారం సభా ప్రాంగణం పరిసరాలలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం, ఎం.రాజపురానికి చెందిన కొప్పర దుర్గారావు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం రాత్రి 9 గంటలకు బయటకు పొక్కింది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రిలో బాధితుని సోదరి కొప్పర జ్యోతి అందించిన వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం కవిటి పంచాయతీ ఎం.రాజపురం గ్రామానికి చెందిన కొప్పర దుర్గారావు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఉల్లిభద్రలో ముఖ్యమంత్రి సభ వద్ద ఎండ్రిన్ తాగి, అనంతరం సమీపంలోని ఉన్న పోలీసు వద్దకు వెళ్లి, ఆతని కాళ్లపై పడి ‘నేను ఎండ్రిన్ తాగాను, చచ్చిపోతున్నాన’ని చెప్పాడు. దీంతో పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించారు. దుర్గారావుకు మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
తోటపల్లి కాలువకు మళ్లీ గండి
సీతానగరం, బొబ్బిలి: తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువకు మళ్లీ గండి పడింది. అధికార పార్టీ నాయకుల ప్రచార తాపత్రయమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆయకట్టు రైతులకు ఎలాగైనా సాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పనుల్లో నాణ్యత లోపించటంతో శనివారం మరోసారి గండి పడింది. దీంతో ఇటు అధికార పార్టీ ప్రతినిధులు, అటు ఇంజినీరింగ్ అధికారులు ఏం చేయాలో తెలియ తలలు పట్టు కున్నారు. ఆదరాబాదరాబా పనులు నిర్వ హించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించ కోవడం, ఎలాగైనా ఈ నేలాఖరులోగా పనులు పూర్తి చేయాలన్న తొందరే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే. జిల్లాలో సువర్ణముఖి నది మీద లక్ష్మీపురం, వేగావతి నదిపై బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామం వద్ద రెండు అక్విడెక్టులు నిర్మించారు. అలాగే కాలువ మొత్తం 78 వరకూ మదుములను స్ట్రక్చర్లను నిర్మాణం చేశారు. 48 వ కిలోమీటరు వరకు సీతానగరం మండలంలోని నిడగల్లు పంచాయతీ పరిధిలో ఉన్న ముత్యాలదొరవలస నుంచి గాదెలవలస వరకు కుడికాలువ నిర్మించారు. ఈ కాలువకు మధ్యలో 17.7 కిలోమీటరు వద్ద సువర్ణముఖి నది ఉంది. కాలువ నిర్మాణ పనులను 2012-13 వరకూ ఐటీడీ పనులు చేపట్టింది. తర్వాత ప్రభుత్వానికి, ఐటీడీ కంపెనీకి మధ్య వివాదం తలెత్తడంతో పనులు నిలిచి పోయాయి. 2013లో యుఏఎన్ మ్యాక్స్ కంపెనీకి పనులు ఈపీసీ విధానంలో దక్కాయి. అప్పటినుంచి పనులు జరుగుతున్నాయి. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుపానుకు సువర్ణముఖి నదిపై నిర్మించిన అక్విడెక్ట్‌ను ఆనుకుని 17.7 కిలోమీటరు వద్ద కాలువకు గండి పడింది. గండిపూడ్చివేత పనులు నిర్వహిస్తుండగానే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించి, తోటపల్లి నుంచి ఖరీఫ్‌కు నీరిస్తామని ప్రకటించేశారు. దీంతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడిని మరింత పెంచారు. అక్విడెక్టు వద్ద ఉన్న శ్లాబ్కల్వర్టుకు పెద్ద రంధ్రం చేసి దానిలోపలకు మనుషులు వెళ్లి మరమ్మతు చేయవలసి వచ్చింది. నది ఒడ్డున ఊపిరి ఆడని ప్రదేశాల్లో పనులు చేయించడంతో పాటు నాణ్యతను పూర్తిగా విస్మరించారు. దీంతో భవిష్యత్‌లో గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన నేడు నిజమైంది. గరుగుబిల్లి వద్ద ఆ శాఖ అధికారులు శుక్రవారం నిర్వహించిన ట్రయిల్ రన్‌కు కాలువ ద్వారా వచ్చిన నీటి ప్రవాహం వల్ల కాలువ నిండి నీరు ఉంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి శనివారం ఉదయం 11 గంటల సమయంలో 17.7 కిలోమీటరు వద్ద మళ్లీ గండి పడింది. దీంతో అక్విడెక్ట్ చూట్టూ వేసిన రాతి కట్టడాలతోపాటు మట్టి కొట్టుకుపోయింది. దానిని నిలుపుదల చేయడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నా ఫలితం లేకపోయింది. ఈ నెలాఖురన ముఖ్యమంత్రితో జలాలు విడుదల చేయించాలని ట్రయిల్ రన్ వేస్తే ఇప్పుడు ఇలా జరగడంతో ఇటు అధికార పార్టీ నాయకులు, అటు నీటిపారుదలశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కాలువ ద్వారా సీతానగరం, బొబ్బిలి, తెర్లాం. బాడంగి మండలాల్లో దాదాపు 9,300 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు అంతగా పడకపోవడం వల్ల ఈ అక్విడెక్టు వద్ద నిర్మాణంలో డొల్లతనం ఆలస్యంగా తెలిసింది. అధికారుల నిర్లక్ష్యమే కారణం: ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి తోటపల్లి కాలువకు శనివారం పడిన గండిని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజక వర్గాల రైతులకు సాగు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ మేరకు పనులు వేగవంతం చెయ్యాలని మార్గదర్శకాలు విడుదల చేశారన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గండి పడిందని అన్నారు. దీనికి బాధ్యులైనవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరతామన్నారు. ఆయన వెంట పాజెక్ట్ డీఈ రమణమూర్తి, పార్వతీపురం ఏఎంసీ చెర్మైన్ రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటనాయుడు, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. కాగా ఏగోటివలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ వల్ల ఇబ్బందులు రాకుండా రక్షణ గోడ నిర్మించాలని ఎంపీటీసీ సభ్యులు డి.నాగరత్నం నేతృత్వంలో రైతులు ఎమ్మెల్సీని, అధికారులను కోరారు. మంత్రి మృణాళిని పరిశీలన సీతానగరం: తోటపల్లి కాలువకు పడిన గండిని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గండి పూడ్చివేత పనులను వేగవంతం చెయ్యాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించామన్నారు. ఆమె వెంట ఎమ్మెల్సీ డి.జగదీష్, ఎమ్మెల్యే బి.చిరంజీవులు, పార్వతీపురం ఆర్డీవో రోణంకి గోవిందరాజు, ఎస్ఈ తిరుమలరావు, ప్రాజెక్ట్ సలహాదారు ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కె.గణపతిరావు, రెవెన్యూ సీనియర్ సహాయకులు శివయ్య ఉన్నారు. కాన్వాయ్ వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు గండి పరిశీలించాక మంత్రి మృణాళిని బొబ్బిలి వైపు తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌లోని వాహనం ఆటోను తప్పించబోయి బైక్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. చినబోగిలి సమీపంలో జరిగిన ఈ ఘటనలో సీతానగరం గ్రామానికి చెందిన బి.వెంకటేష్, బి.రాంబాబు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి స్పందించి గాయపడినవారితో మాట్లాడారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్నాక పయనమయ్యారు. -
అర్జంట్
విజయనగరం కంటోన్మెంట్: మీకు సౌకర్యాల్లేవంటే ఎలా..? ముఖ్యమంత్రి నేడో రేపో వచ్చేస్తున్నారు. ఇక్కడా అక్కడా అనకుండా మేమిచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకోండి..లేదంటే తీసుకున్న పరిహారాన్ని వెనక్కు ఇచ్చేయండి. ఇవీ తోటపల్లి నిర్వాసితులకు తహశీల్దార్లు జారీచేస్తున్న నోటీసులు. మాకు మీరిచ్చిన స్థలాలు నివాసయోగ్యం కాదు మొర్రో అని మొత్తుకుటుటున్నప్పటికీ అధికారులు వినిపించుకోవడం లేదు. ఆ నోటీసులపై అర్జంట్ అని ముద్రించి మరీ పంపిస్తున్నారు. దీంతో నోటీసులు అందుకున్న నిర్వాసితులు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈనెల 15 తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కనిపిస్తుండడంతో అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.తోటపల్లి ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామాల్లో సహాయ పునరావాసం కింద 21 గ్రామాలను గుర్తించారు. ఇందులో పది గ్రామాలను తరలించారు. ఇంకా పీఆర్ఎన్ వలస, బాసంగి, సుంకి తదితర గ్రామాల నిర్వాసితులకు భూముల గుర్తింపు, పట్టాల పంపిణీ మిగిలి ఉంది. మొత్తం 4286 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన అధికారులు పట్టాలు తీసుకోని వారికి నోటీసులు ఇస్తున్నారు. నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలు బీపీఎల్‌కు చెందిన వారైనప్పటికీ చాలా మంది ఏపీఎల్ పరిధిలో ఉన్నారని రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా బీపీఎల్ కిందికే వస్తారు. కానీ రికార్డుల్లో మాత్రం చాలా మందికి ఏపీఎల్ అంటూ నమోదు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవనీ, బాంబులు వేసి క్వారీ రాళ్లు పేల్చే చోట మాకు ఇళ్లు నిర్మించుకోవాలని బలవంతం పెడుతున్నారని మొత్తుకుంటుంటే మా మొర వినిపించుకోకుండా తిరిగి మాకు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే సుంకి గ్రామంలోని 35 మంది తమకు అనుకూలంగా లేని చోట భూములు ఇచ్చినా తాము వెళ్లేది లేదని పట్టుదలతో ఉండిపోయారు. వారికి ఈనెల 27న నోటీసులు పంపించారు. వీరితో పాటు తులసి రామినాయుడు వలస గ్రామానికి చెందిన వారికి గరుగుబిల్లి తహశీల్దార్ అర్జంటు నోటీసులు ఇచ్చారు. 284 నంబర్‌తో వచ్చిన ఈ నోటీసులు చూసి అధికారులు ఎక్కడ స్థలం చూపిస్తే అక్కడికే వెళతారని ఊహించిన ప్రభుత్వ యంత్రాంగం తీరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంటి స్థలం పట్టాను తీసుకునేందుకు నిరాకరించుట గురించి అని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో వీఆర్వో ఇచ్చిన పట్టాలను మీరు తీసుకోవడం లేదని మీరు ఏపీఎల్‌కు చెందిన వారనీ, పట్టా తీసుకోకపోతే గతంలో మీకు ఇచ్చిన పరిహారాన్ని వారం రోజుల్లోగా పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వాపసు చేయాలని, అతి జరూరు పేరుతో నోటీసులు ఇవ్వడం న్యాయమా? అని నిర్వాసితులు వాపోతున్నారు. -
పునరావాసం అయోమయం !
నానా అవస్థలూ పడుతున్న నాగావళి ముంపు గ్రామాల ప్రజలు స్థలాలివ్వరు...ఇచ్చిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించరు... ఇళ్లు కట్టుకునేందుకు ఇసుకకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన... పదేళ్లగా పాడుబడిన ఇళ్లలో కాపురాలు ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తోటపల్లి నిర్వాసితులు పార్వతీపురం:తోటపల్లి ప్రాజెక్టులో తొలి సమిథులైన నిర్వాసితుల పునరావాసం కల్పన ఎప్పటిపూర్తవుతుందో తెలియక ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క తోటపల్లి నుంచి ఈ ఏడాదికే పూర్తి స్థాయిలో నీరందిస్తామని పాలకులు, అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారని, అయితే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. గుణానుపురం, దుగ్గి, బాసంగి, గదబవలస, కళ్లికోట, నిమ్మలపాడు, బట్లభద్ర, తదితర గ్రామాల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో అర్థంకావడం లేదని వారు తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన దాదాపు 20 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటికి 10 గ్రామాల వారికే పునరావాసం కల్పించారు. ఏడు గ్రామాల వారికి కేటాయించిన స్థలంలో చేపట్టిన ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి, మరో మూడు గ్రామాల వారికి స్థలం కేటాయింపు విషయంలో విభేదాలున్నాయి. దీంతో 10 గ్రామాల వారు పాత గ్రామాల్లోనే ఉన్న ఇళ్లను బాగుచేసుకోలేక, కొత్తవాటిని నిర్మించుకోలేక అవస్థలు పడుతూ దాదాపు పదేళ్లగా జీవనం సాగిస్తున్నారు. గట్టిగా వర్షం పడితే నాగావళి నీరు పొంగి గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. దీంతో నిత్యం భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్ నాటికే ప్రాజెక్టునిర్మాణం పూర్తి చేసి పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఒక వేళ ప్రాజెక్టు పూర్తయితే తమ పరిస్థితి ఏంటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు నిల్వ పెడితే ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డునపడాల్సిందే. కనీస సౌకర్యాలు లేక అవస్థలు గుణానుపురం, దుగ్గి, కళ్లికోట, బిత్తరపాడు, చిన్నపుదొరవలస, బంటువానివలస, నిమ్మలపాడు, బట్లభద్ర, బాసంగి గదబవలస, సుంకి తదితర నిర్వాసిత గ్రామాల వారికి ఇప్పటికీ పునరావాసం పూర్తి కాలేదు. ఇళ్లు నిర్మించుకోడానికి కేటాయించిన స్థలంలో కనీససౌకర్యాలు లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు చాలా మంది వెనుకడుగువేస్తున్నారు. అయితే కొంతమంది నిర్వాసితులు సాహసించి తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి కనీస అవసరమైన నీరు, విద్యుత్ లేకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీరు నిల్వ చేస్తుండడంతో నాగావళి నీరు ఏ సమయంలో గ్రామాలపైకి వస్తుందోనని భయపడుతున్నారు. వర్షాకాలం వచ్చేలోపే ఇళ్లు నిర్మించుకుందామని ఆశ పడుతున్న వారికి ఏటా నిరాశే ఎదురవుతోంది. దీంతో పాత గ్రామాల్లోని కూలిన ఇళ్లలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. చిక్కుముడులు వీడని గుణానుపురం... నిర్వాసిత గ్రామం గుణానుపురం వ్యవహారం ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడంతో ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన చిక్కుముడులు వీడడం లేదు. అందులో 605 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 544 మందికి ప్యాకేజీ అందజేశారు. ఇంకా 61 మందికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికి 380 మందికి పునరావాసానికి సంబంధించి 31.80 ఎకరాలలో పట్టాలిచ్చారు. ఇంకా సుమారు 143 మందికి 16 ఎకరాల మేరకు స్థల సేకరణ చేయాల్సి ఉంది. అయితే ఈ స్థల సేకరణే అధికారులకు తలనొప్పిగా మారింది. జిరాయితీ భూమిలో ఇళ్లు ఉన్న 29 మందికి పరిహారం ఇవ్వాలి. డీ-పట్టాలకు సంబంధించి కూడా పరిహారం అందజేయవలసి ఉంది. అలాగే 64 మందికి రాయితీలు రావాల్సి ఉంది. 18 ఏళ్లు దాటిన సుమారు 42 మంది వారికి ప్యాకేజీ రావలసి ఉంది. దుగ్గిని వేధిస్తున్న మరో సమస్య... ఇక దుగ్గిని మరో సమస్య వేధిస్తోంది. తమకు కేటాయించిన స్థలాల్లో ఎస్సీలు ఇళ్ల నిర్మాణం చేపట్టడడంతో బీసీలు ఇళ్లనిర్మాణానికి వెనుకడుగువేస్తున్నారు. తమకు ఇచ్చిన స్థలంలో గోతులున్నాయని, అందుకే కట్టడం లేదని వారు చెబుతున్నారు. కదలని కళ్లికోట... ఇళ్ల స్థలాన్ని చదును చేసి ఇస్తేనే తాము కదులుతామని కళ్లికోట గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామంలో 159 మందికి పట్టాలిచ్చారన్నారు. 39 మంది 18 ఏళ్ల వయస్సు వారికి పరిహారం అందించారన్నారు. అయితే పునరావాస స్థలంలో నిర్మించిన వాటర్ ట్యాంకు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఇప్పుడే కొద్దిపాటి వర్షాలకే కారిపోతున్నాయన్నారు. వాటి నిర్మాణంలో నాణ్యత లోపించిందని వారు ఆరోపించారు. ఇక నిమ్మలపాడు, బట్లభద్ర తదితర గ్రామాల ప్రజలు సీమనాయుడు వలస వద్ద ఇళ్లనిర్మాణాలు చేపట్టినా మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వెళ్లలేకపోతున్నామంటున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. -
సాగునీరు లేక రైతన్నలు..
సాగునీరు ఉండి వినియోగించుకునే అవకాశం లేక రైతన్నలు..తాగునీరు లేక జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. రైతు పక్షపాతిని అని చెప్పుకునే ప్రభుత్వానికి రైతుల అవస్థలు పట్టకపోవడం విశేషం. దీంతో రైతులు పొలాల అమ్మకాల బాట పట్టారు. అలాగే ప్రతిఇంటికీ తాగునీరు సక్రమంగా అందిస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం గొప్పలు..ఆచరణలో కానరాకపోవడంతో గొంతెండి పోతున్న ప్రజలు దాహం తీర్చుకోవడానికి మంచినీటి కొనుగోలు బాట పట్టారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు తయారైంది జిల్లాలోని సాగునీటి పరిస్థితి. సముద్రంలోకి వృథాగా పోతున్న నదీ జలాల్లో సుమారు 16టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకునే సౌకర్యం లేకుండా పోయింది.జలయజ్ఞం కింద ఒకేసారి నాలుగు భారీ ప్రాజెక్టులను జిల్లాలో చేపట్టి అపర భగీరథుడిగా నిలిచిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులకు తూట్లు పొడిచింది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు సాగునీటి చింత తీరడం లేదు. దీంతో రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములను రియల్ ఎస్టేట్లకు విక్రయించుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారు. తోటపల్లిపై గంపెడాశలు జిల్లాలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో తోటపల్లి అతి ముఖ్యమైనది. లక్షా 20వేల ఎకరాల ఆదనపు ఆయకట్టు కోసం చేపట్టిన తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ ఒక ప్రహసనంగా మారింది. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నంతసేపు చకాచకా సాగిన పనులు ఆయన మరణాంతరం పడకేశాయి. నిధుల విడుదలలో సర్కారు నిర్లిప్తంగా వ్యవహరించడంతో పనులు నిలిపివేసి కాంట్రాక్టర్ పలాయనం చిత్తగించారు. నేటికి 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 40 కిలోమీటర్ల పొడవునా చేపట్టిన కాలువల తవ్వకం జరగాలి. కాలువను నాలుగవ, 32వ, 40వ కిలోమీటర్ల వద్ద అనుసంధానించాలి. లైనింగ్ పనులు పూర్తిచేయాలి. ఈ పనులు పూర్తయితే 35వేల ఎకరాలకు అదనంగా సాగునీరందించడానికి అవకాశం ఉంది. జంఝావతి జంఝాటం నలభై ఏళ్ల కల సాకారం కావడం లేదు. 24,640ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో ప్రతిపాదించి న ఈ ప్రాజెక్టు అసలు పూర్తవుతుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఒడిశా ప్రభుత్వంతో నెలకొన్న వైరమే దీనికి కారణం. వివాదాన్ని పక్క న పెట్టి సుమారు 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఆస్ట్రియా పరిజ్ఞానంతో రూ.5కోట్ల వ్యయంతో రబ్బర్‌డ్యామ్ ప్రాజెక్టు నిర్మించి కాసింత ఉపశమనం కలిగించారు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు పరితపించారు. ఇంతలో వైఎస్ మరణించడంతో, తర్వాత పట్టించుకునే వారు లేకపోయారు. ఇప్పుడైనా ఒడిశాతో సంప్రదింపులు చేసి జంఝావతికి మోక్షం కల్గిస్తారో లేదో చూడాలి. సాగుతున్న తారకరామతీర్థ సాగర్ పనులు వైఎస్సార్ ఎంతో సదుద్దేశంతో చేపట్టిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులను ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని నత్తనడకన సాగుతున్నాయి. ఏదో ఒక వివాదంతో ఎప్పటికప్పుడు పనులు నిలిచిపోవడమే తప్ప వేగవంతమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. నేటికి 25శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తయినా ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, ఎడారిలా మారిపోతున్న పంట పొలాలు రియల్ ఎస్టేట్ కింద విక్రయాలు జరిగిపోవడంతో కొన్నాళ్లకు సాగు భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. శివారు భూములకందని పెద్దగెడ్డ 12 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు పెద్దగెడ్డ ప్రాజెక్టు పూర్తయినా శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. వైఎస్ హయాంలో జరిగిన పనులు తప్ప మిగిలిన కాలువల్లో పూడిక తీత తొలగింపు పను లు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రధాన కాలువల్లో తూముల వద్ద షట్టర్లు అమర్చడం వంటివి జరగలేదు. వీటిపై పాలకులు దృష్టి సారించడం లేదు. వెంగళరాయ తదితర ప్రాజెక్టులది అదే పరిస్థితి వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి అదనపు ఆయకట్టు కు సాగునీరందించేందుకు పనులు జరగాలి. 24,700 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా పూడిక తొలగింపు,లైనింగ్ పనులు జరగకపోవడంతో బొబ్బిలి, సీతానగరం మండలాలకు సాగునీరు అందడం లేదు. ఆండ్ర ఆధునికీకరణ పనులు చేపడితే ఆయకట్టుకు సాగునీరందించేందుకు అవకాశం ఉంది. అలాగే వట్టిగెడ్డ ప్రాజెక్టు కాలువల్లో లోపాలు సవరించాలి. సైపూన్లు నిర్మించేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అదేవిధంగా ఆండ్ర ప్రాజెక్టు ఆధునికీకరణ, పెదంకలాం, ఏడొంపులగెడ్డ, మంగళగెడ్డ ప్రాజెక్టులకు నిధులు అవసరం ఉంది. కానీ వాటిపై మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దీంతో వనరులున్నా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి నెల కొంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలోనైనా జిల్లాలోని ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందేమో అన్న ఆశలో జిల్లా రైతులున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.