సాగునీరు లేక రైతన్నలు..
సాగునీరు ఉండి వినియోగించుకునే అవకాశం లేక రైతన్నలు..తాగునీరు లేక జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. రైతు పక్షపాతిని అని చెప్పుకునే ప్రభుత్వానికి రైతుల అవస్థలు పట్టకపోవడం విశేషం. దీంతో రైతులు పొలాల అమ్మకాల బాట పట్టారు. అలాగే ప్రతిఇంటికీ తాగునీరు సక్రమంగా అందిస్తామని చెబుతున్న అధికార యంత్రాంగం గొప్పలు..ఆచరణలో కానరాకపోవడంతో గొంతెండి పోతున్న ప్రజలు దాహం తీర్చుకోవడానికి మంచినీటి కొనుగోలు బాట పట్టారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లు తయారైంది జిల్లాలోని సాగునీటి పరిస్థితి. సముద్రంలోకి వృథాగా పోతున్న నదీ జలాల్లో సుమారు 16టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకునే సౌకర్యం లేకుండా పోయింది.జలయజ్ఞం కింద ఒకేసారి నాలుగు భారీ ప్రాజెక్టులను జిల్లాలో చేపట్టి అపర భగీరథుడిగా నిలిచిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులకు తూట్లు పొడిచింది. ఏళ్లు గడుస్తున్నా రైతులకు సాగునీటి చింత తీరడం లేదు. దీంతో రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములను రియల్ ఎస్టేట్లకు విక్రయించుకుంటున్నారు. వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారు.
తోటపల్లిపై గంపెడాశలు
జిల్లాలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో తోటపల్లి అతి ముఖ్యమైనది. లక్షా 20వేల ఎకరాల ఆదనపు ఆయకట్టు కోసం చేపట్టిన తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ ఒక ప్రహసనంగా మారింది. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నంతసేపు చకాచకా సాగిన పనులు ఆయన మరణాంతరం పడకేశాయి. నిధుల విడుదలలో సర్కారు నిర్లిప్తంగా వ్యవహరించడంతో పనులు నిలిపివేసి కాంట్రాక్టర్ పలాయనం చిత్తగించారు. నేటికి 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 40 కిలోమీటర్ల పొడవునా చేపట్టిన కాలువల తవ్వకం జరగాలి. కాలువను నాలుగవ, 32వ, 40వ కిలోమీటర్ల వద్ద అనుసంధానించాలి. లైనింగ్ పనులు పూర్తిచేయాలి. ఈ పనులు పూర్తయితే 35వేల ఎకరాలకు అదనంగా సాగునీరందించడానికి అవకాశం ఉంది.
జంఝావతి జంఝాటం
నలభై ఏళ్ల కల సాకారం కావడం లేదు. 24,640ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో ప్రతిపాదించి న ఈ ప్రాజెక్టు అసలు పూర్తవుతుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఒడిశా ప్రభుత్వంతో నెలకొన్న వైరమే దీనికి కారణం. వివాదాన్ని పక్క న పెట్టి సుమారు 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు ఆస్ట్రియా పరిజ్ఞానంతో రూ.5కోట్ల వ్యయంతో రబ్బర్‌డ్యామ్ ప్రాజెక్టు నిర్మించి కాసింత ఉపశమనం కలిగించారు. ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు పరితపించారు. ఇంతలో వైఎస్ మరణించడంతో, తర్వాత పట్టించుకునే వారు లేకపోయారు. ఇప్పుడైనా ఒడిశాతో సంప్రదింపులు చేసి జంఝావతికి మోక్షం కల్గిస్తారో లేదో చూడాలి.
సాగుతున్న తారకరామతీర్థ సాగర్ పనులు
వైఎస్సార్ ఎంతో సదుద్దేశంతో చేపట్టిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులను ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని నత్తనడకన సాగుతున్నాయి. ఏదో ఒక వివాదంతో ఎప్పటికప్పుడు పనులు నిలిచిపోవడమే తప్ప వేగవంతమయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. నేటికి 25శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తయినా ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, ఎడారిలా మారిపోతున్న పంట పొలాలు రియల్ ఎస్టేట్ కింద విక్రయాలు జరిగిపోవడంతో కొన్నాళ్లకు సాగు భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
శివారు భూములకందని పెద్దగెడ్డ
12 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు పెద్దగెడ్డ ప్రాజెక్టు పూర్తయినా శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. వైఎస్ హయాంలో జరిగిన పనులు తప్ప మిగిలిన కాలువల్లో పూడిక తీత తొలగింపు పను లు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రధాన కాలువల్లో తూముల వద్ద షట్టర్లు అమర్చడం వంటివి జరగలేదు. వీటిపై పాలకులు దృష్టి సారించడం లేదు.
వెంగళరాయ తదితర ప్రాజెక్టులది అదే పరిస్థితి
వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నుంచి అదనపు ఆయకట్టు కు సాగునీరందించేందుకు పనులు జరగాలి. 24,700 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా పూడిక తొలగింపు,లైనింగ్ పనులు జరగకపోవడంతో బొబ్బిలి, సీతానగరం మండలాలకు సాగునీరు అందడం లేదు.
ఆండ్ర ఆధునికీకరణ పనులు చేపడితే ఆయకట్టుకు సాగునీరందించేందుకు అవకాశం ఉంది. అలాగే వట్టిగెడ్డ ప్రాజెక్టు కాలువల్లో లోపాలు సవరించాలి. సైపూన్లు నిర్మించేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అదేవిధంగా ఆండ్ర ప్రాజెక్టు ఆధునికీకరణ, పెదంకలాం, ఏడొంపులగెడ్డ, మంగళగెడ్డ ప్రాజెక్టులకు నిధులు అవసరం ఉంది. కానీ వాటిపై మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దీంతో వనరులున్నా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి నెల కొంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలోనైనా జిల్లాలోని ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందేమో అన్న ఆశలో జిల్లా రైతులున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.