జలయజ్ఞం చేసిన అపర భగీరథుడు | Ys Rajasekhara reddy birthday special story | Sakshi
Sakshi News home page

YSR Jayanthi: జలయజ్ఞం చేసిన అపర భగీరథుడు

Published Sat, Jul 8 2023 12:54 AM | Last Updated on Sat, Jul 8 2023 1:27 AM

Ys Rajasekhara reddy birthday special story - Sakshi

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పలు రకాలుగా వారి సేవలను తెలుగు ప్రజలు స్మరించుకుంటు న్నారు. ఒక వ్యక్తి గొప్పదనం వారి తదనంతరం వారిని గుర్తు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే ప్రజానేత అయితే వారు తీసుకునే నిర్ణయాల  సార్వజనీనతను బట్టి ఉంటుంది. ఆ కోణంలో చూసినప్పుడు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా చేసిన పోరాటాలూ, తీసుకున్న నిర్ణయాలూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీ యాలలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రస్థానంలో వారిని చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేశాయి. 

ఎందరో మహానుభావులు రాయలసీమ ఉద్యమాన్ని నడి పారు. దాన్ని ప్రజా ఉద్యమంగా మలచడంలో వైఎస్‌ విజయం సాధించారు. జాతీయ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వైఎస్‌ ఒక ప్రాంత సమస్యపై పోరాటంలో పాల్గొనడం సాహసం. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అంటారు.

అందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే 294 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే 52 నియో జక వర్గాలు ఉన్న రాయలసీమ అంశాలపై ఎందుకు మాట్లాడ తారు? రాయలసీమ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన కారణంగా... కేవలం చెన్నై నగరానికి త్రాగు నీరు కోసం రూపొందించిన ‘తెలుగు గంగ’ తిరుపతి వరకూ రాగలిగింది. కీలకమైన పోతిరెడ్డిపాడు సమస్య సమాజం ముందుకువచ్చింది. 

రాయలసీమ ఉద్యమంలో వైఎస్‌ ప్రస్థాన ఫలితమే ‘జల యజ్ఞ’ రూపకల్పన. వెనుకబడిన ప్రాంత అస్తిత్వ ఉద్యమంలో కీలక అంశంగా నీటి సమస్య ఉంటుంది. వైఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నది జలయజ్ఞం. ఏపీలోని అన్ని ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం రూపొందించారు.

పోలవరం, దుమ్ముగూడెం టేల్‌ పాండ్, పులిచింతల, గాలేరు– నగరి, హంద్రీనీవా, పోతిరెడ్డి పాడు, సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్టులు నేడు ప్రజల ముందు ఉన్నాయి అంటే అది వైఎస్‌ దూర దృష్టి ఫలితమే. ఆధునిక కాలంలో ఆంగ్లేయుల తర్వాత మొత్తం తెలుగు ప్రజలకు శాశ్వత నీటి పరిష్కారం కోసం దూర దృష్టితో ఆలోచించింది రాజశేఖర రెడ్డి అనే చెప్పాలి.  

జలయజ్ఞం పేరుతో అన్ని ప్రాజెక్టుల నిర్మాణం ఒకేసారి చేపట్టడం సరికాదని చాలా మంది వాదించారు. అలాంటి వాదనలకు వైఎస్‌ చెప్పిన సమాధానం ‘రాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి నేడు రూపొందించిన ప్రాజెక్టులు మన హయాంలో పూర్తి కాకపోయినా ప్రజలు పోరాడి సాధించుకుంటారు.’ అది వైఎస్‌ ఆలోచన. అలా ఆయన ఆలోచన చేయకుండా ఉంటే పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా మారి ఉంటుందా? వారు ఊహించిన విధంగా నేడు ప్రజలు ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోరాడుతున్నారు.

ప్రభుత్వాలు తమ ప్రాధాన్యత అంశంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న వైఎస్‌. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమ డిమాండ్లకుఅత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అందులో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ వెడ ల్పునూ, శ్రీశైలం ప్రాజెక్ట్‌  నీటిమట్టాన్నీ పెంచాలని నిర్ణయించడం వంటివి కొన్ని మాత్రమే.

రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ వెడల్పు పెంచడం అవసరం. వరద సమయంలో నీటి హక్కు లేని ప్రాజెక్టులకు నీరు విడుదల చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ వెడల్పును 12 వేల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 44 వేల క్యూసెక్కుల సామ ర్థ్యానికి పెంచారు.

శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా జీఓ ఇచ్చినా రాజకీయ కుట్రల కారణంగా దాని అమలు సాధ్యం కాలేదు. దాని ఫలితం నేడు రెండు రాష్ట్రాల సమస్యగా మారింది. గండికోట ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి చేయడంతో బాటు కుందూ నదిపై జోలదరాసికీ, రాజోలుకూ శంకుస్థాపన చేశారు. అలాగే సిద్ధేశ్వరం అలుగు ఆలోచన చేశారు. కానీ వారి మరణాంతర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవి సాకారం కాకపోవడంతో నేటికీ రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కాలేదు.

గోదావరిపై పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చిరకాల వాంఛ. ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఓ కొలిక్కి రాలేదు. కానీ నీటి సమస్య గురించి అవగాహన కలిగిన వైఎస్‌ అత్యంత వ్యయంతో కూడిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూను కున్నారు. కేంద్రాన్ని ఒప్పించి అన్ని అనుమతులూ మంజూరు చేయించుకొని కుడి ఎడమ కాల్వల నిర్మాణం చేపట్టారు. ‘ప్రాజెక్టు పూర్తి కాకుండానే కాల్వల నిర్మాణం’ అంటూ విప క్షాలు చేసే విమర్శలకు వెరవలేదు. విభజన సమయంలో పోలవరానికి జాతీయ హోదా లభించింది అంటే అది వైఎస్‌ కృషి ఫలితమే.

అదీ నీటి ప్రాజెక్టులపై వైఎస్‌కున్న నిబద్ధత, దూరదృష్టి. అదే సమయంలో అపార నీటి వనరులు ఉన్న గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగించే ప్రయ త్నంలో భాగంగా దుమ్ముగూడెం పథకాన్ని రూపొందించి 500 కోట్లతో ప్రాథమిక పనులు పూర్తి చేశారు. విభజన సమయంలో పోలవరంలో భాగంగా 165 టీఎమ్‌సీల సామర్థ్యం కలిగిన దుమ్ముగూడేనికి జాతీయ హోదా వచ్చి ఉంటే తెలంగాణలో కొంత భాగం, కృష్ణా, గోదావరి డెల్టాలకు గోదావరి నీళ్లూ; వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, దక్షిణ తెలంగాణ ప్రాజె క్టులకు కృష్ణ నీటినీ వినియోగించే అవకాశం ఉండేది.

వైఎస్‌ మరణం, విభజన సమయంలో దూరదృష్టి లేని నేతల కార ణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. శంకుస్థాపనకే పరిమితం అయిన గాలేరు–నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఫలితంగా నీటి హక్కులు లేకపోయినా మూడు ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన విధంగా నిర్మాణం చేసుకోవచ్చని విభజన చట్టంలో అనుమ తించారు.

వైఎస్‌ ఆశించిన శ్రీశైలం ప్రాజెక్ట్‌ నీటిమట్టం పెంపు, సిద్దేశ్వరం, గుండ్రేవుల, కుందూపై నిర్మాణాలు... ముఖ్యంగా దుమ్ముగూడెం పథకం పూర్తి అయితే రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విపక్ష నేతగా సీమ హక్కుల కోసం పోరాటం, అధికారంలోకి వచ్చిన తర్వాత సాకారం కోసం ప్రయత్నాలు చేసిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రస్థానంలో ఎప్పటికీ చిరస్మరణీయులు.
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం
సమన్వయ కర్త ‘ 94904 93436 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement