విజయనగరం కంటోన్మెంట్: మీకు సౌకర్యాల్లేవంటే ఎలా..? ముఖ్యమంత్రి నేడో రేపో వచ్చేస్తున్నారు. ఇక్కడా అక్కడా అనకుండా మేమిచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకోండి..లేదంటే తీసుకున్న పరిహారాన్ని వెనక్కు ఇచ్చేయండి. ఇవీ తోటపల్లి నిర్వాసితులకు తహశీల్దార్లు జారీచేస్తున్న నోటీసులు. మాకు మీరిచ్చిన స్థలాలు నివాసయోగ్యం కాదు మొర్రో అని మొత్తుకుటుటున్నప్పటికీ అధికారులు వినిపించుకోవడం లేదు. ఆ నోటీసులపై అర్జంట్ అని ముద్రించి మరీ పంపిస్తున్నారు. దీంతో నోటీసులు అందుకున్న నిర్వాసితులు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈనెల 15 తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కనిపిస్తుండడంతో అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.తోటపల్లి ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామాల్లో సహాయ పునరావాసం కింద 21 గ్రామాలను గుర్తించారు.
ఇందులో పది గ్రామాలను తరలించారు. ఇంకా పీఆర్‌ఎన్ వలస, బాసంగి, సుంకి తదితర గ్రామాల నిర్వాసితులకు భూముల గుర్తింపు, పట్టాల పంపిణీ మిగిలి ఉంది. మొత్తం 4286 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన అధికారులు పట్టాలు తీసుకోని వారికి నోటీసులు ఇస్తున్నారు. నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలు బీపీఎల్‌కు చెందిన వారైనప్పటికీ చాలా మంది ఏపీఎల్ పరిధిలో ఉన్నారని రికార్డుల్లో చూపించారు. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా బీపీఎల్ కిందికే వస్తారు. కానీ రికార్డుల్లో మాత్రం చాలా మందికి ఏపీఎల్ అంటూ నమోదు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవనీ, బాంబులు వేసి క్వారీ రాళ్లు పేల్చే చోట మాకు ఇళ్లు నిర్మించుకోవాలని బలవంతం పెడుతున్నారని మొత్తుకుంటుంటే మా మొర వినిపించుకోకుండా తిరిగి మాకు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికే సుంకి గ్రామంలోని 35 మంది తమకు అనుకూలంగా లేని చోట భూములు ఇచ్చినా తాము వెళ్లేది లేదని పట్టుదలతో ఉండిపోయారు. వారికి ఈనెల 27న నోటీసులు పంపించారు. వీరితో పాటు తులసి రామినాయుడు వలస గ్రామానికి చెందిన వారికి గరుగుబిల్లి తహశీల్దార్ అర్జంటు నోటీసులు ఇచ్చారు. 284 నంబర్‌తో వచ్చిన ఈ నోటీసులు చూసి అధికారులు ఎక్కడ స్థలం చూపిస్తే అక్కడికే వెళతారని ఊహించిన ప్రభుత్వ యంత్రాంగం తీరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంటి స్థలం పట్టాను తీసుకునేందుకు నిరాకరించుట గురించి అని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో వీఆర్వో ఇచ్చిన పట్టాలను మీరు తీసుకోవడం లేదని మీరు ఏపీఎల్‌కు చెందిన వారనీ, పట్టా తీసుకోకపోతే గతంలో మీకు ఇచ్చిన పరిహారాన్ని వారం రోజుల్లోగా పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వాపసు చేయాలని, అతి జరూరు పేరుతో నోటీసులు ఇవ్వడం న్యాయమా? అని నిర్వాసితులు వాపోతున్నారు.
అర్జంట్
Published Mon, Jul 6 2015 12:14 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement